ఢీ అంటే ఢీ : TRS Vs BJP పొలిటికల్ వార్

  • Published By: madhu ,Published On : February 15, 2020 / 07:12 PM IST
ఢీ అంటే ఢీ : TRS Vs BJP పొలిటికల్ వార్

కేంద్రంతో టీఆర్ఎస్ ఢీ అంటే ఢీ అంటోంది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు కసరత్తు చేస్తున్న సీఎం కేసీఆర్..కేంద్రాన్ని టార్గెట్ చేశారు.  అటు బీజేపీ సైతం టీఆర్ఎస్‌ నేతల విమర్శలకు ధీటుగా బదులిస్తోంది. కేంద్రం తెలంగాణపై వివక్ష చూపుతుందని టీఆర్ఎస్‌ నేతలు విమర్శించారు. రాష్ట్రానికి నిధులు విడుదల చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్‌ నేతల విమర్శలపై బీజేపీ నేతలు ఫైర్‌ అయ్యారు.

కావాల్సినన్ని నిధులిస్తున్నా టీఆర్ఎస్‌ నేతలు కావాలనే కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్నారని కమలనాథులు మండిపడుతున్నారు. కేంద్రంపై మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. మోదీ ప్రభుత్వం రాష్ట్రాలను తమ గుప్పిట్లో ఉంచుకోవాలని చూస్తోందన్నారు. డీమానిటైజేషన్‌ ద్వారా దేశానికి మంచి జరుగుతుందని నమ్మి మద్దతిచ్చి తప్పుచేశామన్నారు కేటీఆర్.

సీఏఏను పార్లమెంట్‌ ఉభయ సభల్లో వ్యతిరేకించామన్నారు. మంత్రి కేటీఆర్ కేంద్రంపై విమర్శలు చేయటమే పనిగా పెట్టుకున్నారని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్రం నిధులిచ్చేందుకు సిద్ధంగా ఉంది.. ఎన్ని ఇళ్లు కడతారో చెప్పండి అంటూ కేటీఆర్‌కు కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని బెడ్‌రూమ్ ఇళ్లు ఇచ్చినా కేంద్రం తన వాటా ఇస్తుందన్నారు. ఎంఐఎంకు టీఆర్ఎస్‌ అండగా ఉండటాన్ని బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. టీఆర్ఎస్‌కు, ఎంఐఎంకు కౌంటర్‌గా ప్రజల్లో సీఏఏపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు మార్చిలో సీఏఏ అనుకూల సభ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు బీజేపీ నేతలు.

Read More : విన్నపాలు వినవలె : జగన్ ఢిల్లీ పర్యటన విశేషాలు