ఆ ఎమ్మెల్యేకు, ఎంపీకి అసలే పడటం లేదు.. జగన్‌కి తెలియదా? చూసే ఊరుకొంటున్నారా?

  • Published By: sreehari ,Published On : July 28, 2020 / 03:59 PM IST
ఆ ఎమ్మెల్యేకు, ఎంపీకి అసలే పడటం లేదు.. జగన్‌కి తెలియదా? చూసే ఊరుకొంటున్నారా?

ఆ నియోజకవర్గంలో వైసీపీలో రాజకీయ చదరంగం సాగుతోంది. అక్కడ ఎమ్మెల్యేకు, ఎంపీకి అస్సలు పడటం లేదు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు వారు మధ్య ఉన్నాయి. ఆధిపత్యం కోసం నువ్వా నేనా అన్నట్లు రాజకీయాలు సాగిస్తున్నారు. ఈ వర్గ విభేదాలను చూసి కార్యకర్తల్లో నైరాశ్యం ఏర్పడిం ది. ఈ విభేదాల పంచాయతీని చక్కదిద్దేందుకు ఓ ప్రముఖ నాయకుడు ప్రయత్నించినా ఫలితం లేక పోవడంతో విషయం సీఎం వద్దకు చేరిందట. ఇంతకీ ఎవరా నాయకులు ? ఎక్కడా నియోజకవర్గం ?

గూడురు వైసీపలో గలాటా :
వైసీపీకి కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లాలోని గూడూరు నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. సొంత పార్టీలోనే నాయకుల మధ్య చోటుచేసుకున్న వర్గ విభేదాలు కార్యకర్తల్లో అసహనానికి కారణమవుతున్నాయి. గత కొంతకాలంగా స్థానిక ఎమ్మెల్యేకు, ఎంపీకి మధ్య నెలకొన్న విభేదాలు తారస్థాయికి చేరుకోవడంతో గూడూరు వైసీపీలో గలాటా మొదలైంది.

నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్‌రావు. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌కు మధ్య ముందు నుంచి కూడా సరైన సంబంధాలు లేవు. ప్రభుత్వ కార్యక్రమాలు గానీ, పార్టీ కార్యక్రమాలు గానీ ఎవరికి వారుగా నిర్వహించేవారు. ఒకరి కార్యక్రమానికి మరొకరిని ఆహ్వానించే వాళ్లు కాదు. ఇలా ఇద్దరూ
నియోజకవర్గంలో ఎవరికి వారుగా వ్యవహరిస్తూ వస్తున్నారు.

ఆధిపత్యం కోసం నువ్వా నేనంటూ వార్ :
ఈ మధ్య వీరి మధ్య గ్యాప్‌ ఇంకా ఎక్కువైందని పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నారు. ఆధిపత్యం కోసం నువ్వా నేనా అన్నట్లు రాజకీయాలు సాగిస్తున్నారు. ఎమ్మెల్యే వ్యతిరేక వర్గానికి కొడవలూరు ధనుంజయరెడ్డి, పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి సారథ్యం వహిస్తున్నారు.

పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే భూమిని చదును చేసే కాంట్రాక్టును ఎమ్మెల్యే వరప్రసాద్ వర్గీయులు దక్కించుకోవడంతో ఈ వ్యవహారంలో అవకతవకలు జరిగాయంటూ ఎంపీ వర్గీయులు అప్పటి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తూర్పుకనుపూరు ముత్యాలమ్మ ఆలయ చైర్మన్‌గా సిద్దారెడ్డి జనార్దన్‌రెడ్డిని ఎమ్మెల్యే ప్రతిపాదించగా, వేమారెడ్డి మురళీమోహన్ రెడ్డిని చైర్మన్‌గా నియమించడంలో ఎంపీ వర్గీయులు విజయం సాధించారు. దీంతో ఎమ్మెల్యే, ఎంపీ వర్గాలు బహిరంగంగా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు.

మల్లాం సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ చైర్మన్ పదవిని దక్కించుకునే విషయంలోనూ పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ఆధిక్యం ప్రదర్శించారు. దీంతో ఎమ్మెల్యేతోపాటు ఆయన వర్గీయులు పార్టీ స్థితిగతులపై నివేదికలు తయారు చేసి ముఖ్యమంత్రి జగన్‌కు సమర్పించారట. నిస్వార్థంగా పని చేసిన వారికి గుర్తింపు ఇవ్వాలని కోరారట.

ఈ పంచాయతీ జగన్ వద్దకు చేరడంతో గూడూరు నియోజకవర్గంపై దృష్టి పెట్టారని అంటున్నారు. ఈ క్రమంలోనే నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులను గమనించిన సీఎం… నేతలను సమన్వయం చేసే బాధ్యతలను రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అప్పగించినట్లు సమాచారం.

ఒకపక్క పార్టీ అధిష్టానం ఈ పంచాయతీని పరిష్కరించే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం ఆధిపత్యాన్ని ప్రదర్శించే చర్యలు చేపడుతోంది. పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, కొడవలూరు ధనుంజయరెడ్డి రహస్య సమావేశాలు నిర్వహించి, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా గూడూరు మున్సిపాలిటీపై పట్టు సాధించేలా వ్యుహరచన చేశారు.

ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో కూడా నాయకులు వర్గాల వారీగా విడిపోయి ఆధిపత్యం కోసం వార్‌ చేస్తున్నారని కార్యకర్తలు అంటున్నారు. దీంతో పార్టీ ప్రతిష్ట దెబ్బతినడమే కాక బలహీనపడే ప్రమాదం కనిపిస్తోంది.