పండగ తర్వాత : సైకిల్ ఎక్కే నేతలు వీరే

  • Published By: veegamteam ,Published On : January 10, 2019 / 10:57 AM IST
పండగ తర్వాత : సైకిల్ ఎక్కే నేతలు వీరే

ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. అన్ని పార్టీలు వ్యూహాలకు పదునుపెట్టాయి. ఓ వైపు అభ్యర్థుల కసరత్తు, మరోవైపు చేరికలపై దృష్టి పెట్టాయి. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు కూడా దీనిపైనే ఫోకస్ పెట్టారు. వివిధ పార్టీల నేతలు టీడీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు. వారం పది రోజుల్లో చేరికలు ఉంటాయని టీడీపీ నేతల నుంచి వస్తున్న సమాచారం. పలువురు సీనియర్, కీలక నేతలు టీడీపీ కండువా కప్పుకుంటారని వార్తలు వస్తున్నాయి. మాజీ మంత్రి అహ్మదుల్లా, మాజీ ఎంపీ సబ్బం హరి, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, ఘట్టమనేని ఆదిశేషగిరి రావు, సినీ నటుడు అలీ తదితరులు త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది.

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ అధిష్టానం వ్యహాత్మకంగా ముందుకు వెళుతోంది. ఇతర పార్టీల్లో బలమైన, కీలకమైన నేతలపై కన్నేసింది. వారందరిని వారం పది రోజుల్లో టీడీపీలో చేర్చుకునే వ్యహాలు రూపొందిస్తోంది. అందరిని ఒకేసారి కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి చేర్చుకోవాలని అనుకుంటోంది. కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి అహ్మదుల్లా టీడీపీలో చేరేందుకు అంగీకారం తెలిపారు. ఈ మధ్యనే చంద్రబాబుని కలిసి సైకిల్ ఎక్కేందుకు ఓకే చెప్పారు. విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేత సబ్బం హరి కూడా జనవరి 1వ తేదీ చంద్రబాబుని కలిశారు. ఆయన టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు చెప్పుకోవచ్చు. సబ్బం హరి విశాఖ నార్త్ నియోయజకవర్గం టికెట్ కోరుతున్నారు. చంద్రబాబు మాత్రం అనకాపల్లి టికెట్ ఇస్తానని చెప్పినట్టు సమాచారం.

గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూడా ఇప్పటికే టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. సంక్రాంతి తర్వాత ఏ నిమిషంలో అయినా ఆమె టీడీపీ కండువా కప్పుకోనున్నారు. సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరి రావు టీడీపీలో చేరనున్నారు. ఇటీవలే ఆయన వైసీపీకి రిజైన్ చేశారు. ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారట. విశాఖ జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత కొణతాల రామకృష్ణ పైనా టీడీపీ గురి పెట్టునట్టు సమాచారం. కొణతాలతో టీడీపీ నాయకుల చర్చలు జరుగుతున్నాయని,  2019, జనవరి 18వ తేదీన ఆయన టీడీపీలో చేరతారనే వార్తలు షికారు చేస్తున్నారు. కొణతాల వైపు నుంచి మాత్రం ఎటువంటి క్లారిటీ లేదు. కమెడియన్ ఆలీ కూడా సైకిల్ ఎక్కుతారని సమాచారం. గుంటూరు ఈస్ట్ లేదా వెస్ట్ అసెంబ్లీ టికెట్ అలీకి ఇస్తారని తెలుస్తోంది. రాయలసీమలో అనంతపురం కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి శైలజానాథ్‌ను టీడీపీలో చేర్చుకునేందుకు  చర్చలు జరిగినట్టు సమాచారం. సంక్రాంతి పండగ తర్వాత వీరిలో పలువురు తెలుగుదేశం పార్టీలో చేరతారని టీడీపీ నాయకులు చెబుతున్నారు.