తాతా మనవడి సవాల్‌ : ప్రత్తిపాడులో పట్టు ఎవరిది

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీ రాజకీయాలు తాతా మనవళ్ల తగాదాకు తెరలేపాయి. రాజకీయంగా పట్టు దక్కించుకోవాలని తాత

  • Published By: veegamteam ,Published On : January 29, 2019 / 02:22 PM IST
తాతా మనవడి సవాల్‌ : ప్రత్తిపాడులో పట్టు ఎవరిది

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీ రాజకీయాలు తాతా మనవళ్ల తగాదాకు తెరలేపాయి. రాజకీయంగా పట్టు దక్కించుకోవాలని తాత

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీ రాజకీయాలు తాతా మనవళ్ల తగాదాకు తెరలేపాయి. రాజకీయంగా పట్టు దక్కించుకోవాలని తాత ప్రయత్నిస్తుంటే.. తన తరానికి అవకాశం రావాలని మనవడు శక్తి యుక్తులను ధారపోస్తున్నాడు. నా అనుభవం అంత లేదు నీ వయస్సంటున్న తాతతో.. రాజకీయాల్లో యువరక్తానికే జోరంటూ సవాల్‌ విసురుతున్నాడు మనవడు. తాత దూకుడికి మనవడు ముకుతాడు వేస్తాడా.. ప్రత్తిపాడు నియోజకవర్గంలో పట్టు ఎవరు సాధిస్తారు.

 

తూర్పుగోదావ‌రి జిల్లాలోని ప్రత్తిపాడు నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయాలు ఎప్పుడూ ఆస‌క్తిగానే ఉంటాయి. మెట్ట రాజ‌కీయాల‌కు పెట్టింది పేరుగా ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని చెబుతుంటారు. కొన్ని ద‌శాబ్దాలుగా ఇక్కడ మూడు కుటుంబాల హ‌వానే క‌నిపిస్తోంది. ప‌ర్వత‌, ముద్రగ‌డ‌, వ‌రుపుల కుటుంబాల నుంచే ఎమ్మెల్యేలుగా అవ‌కాశాలు ద‌క్కించుకోవ‌డం విశేషం. 2014 ఎన్నిక‌ల్లో వరుపుల సుబ్బారావు వైసీపీ అభ్యర్థిగా గెలిచారు. అప్పట్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ప‌ర్వత చిట్టిబాబు టీడీపీ త‌రుపున పోటీ చేసి ఓట‌మి పాలుకాగా, ముద్రగ‌డ ప‌ద్మనాభం రంగంలో ఉన్నప్పటికీ పెద్దగా ప్రభావం చూప‌లేక‌పోయారు.

 

వైసీపీ త‌రుపున గెలిచిన వ‌రుపుల సుబ్బారావు ఆ త‌ర్వాత మారిన రాజ‌కీయ ప‌రిణామాల‌తో పార్టీ ఫిరాయించి టీడీపీ కండువా క‌ప్పుకున్నారు. టీడీపీ త‌రుపున ఓట‌మి పాలైన ప‌ర్వత చిట్టిబాబు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ప‌నిచేస్తూ హ‌ఠాన్మర‌ణం చెందారు. దీంతో 2019 ఎన్నిక‌ల్లో త‌న‌కు మ‌ళ్లీ అవ‌కాశం ద‌క్కుతుంద‌నే ఆశాభావంతో వ‌రుపుల సుబ్బారావు ముందుకు సాగుతున్నారు. కానీ ఆయ‌న‌కు పోటీగా మ‌నవ‌డు వ‌రుపుల రాజా ముందుకొచ్చారు. ప్రస్తుతం డీసీసీబీ చైర్మన్‌గా ఉన్న వ‌రుపుల రాజా.. త‌న‌కు ఛాన్స్ ఖాయ‌మ‌ని దీమాతో ఉన్నారు. దానికి త‌గ్గట్టుగా నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృతంగా ప‌ర్యట‌న‌లు చేస్తూ ఎన్నిక‌ల ప్రచారాన్ని త‌ల‌పిస్తున్నారు.

 

వ‌రుపుల సుబ్బారావు ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ ఛాన్స్ ద‌క్కించుకోవాల‌ని ఆశిస్తున్న ఆయ‌న‌కు టీడీపీలోనే వ్యతిరేక‌త క‌నిపిస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యే తీరుతో ప‌లువురు టీడీపీ నేత‌లు పార్టీని వీడి విప‌క్షం వైపు చేరుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు మ‌ళ్లీ అవ‌కాశం ఇస్తే ఓట‌మి ఖాయ‌మ‌నే వాద‌న వినిపిస్తోంది. అయితే త‌న‌కు టికెట్ రాకుండా చేస్తున్న మ‌న‌వ‌డి వ్యవ‌హారాన్ని వ‌రుపుల సుబ్బారావు స‌హించ‌లేక‌పోతున్నారు. త‌న‌కు అవ‌కాశం ఇవ్వక‌పోతే జ‌న‌సేన‌లో చేరేందుకు సైతం సిద్ధమంటూ సంకేతాలు ఇస్తున్నారు.

 

వ‌రుపుల రాజా మాత్రం జిల్లాకి చెందిన య‌న‌మ‌ల తోడ్పాటు, నారా లోకేష్ ప్రోత్సాహంతో టికెట్ ద‌క్కుతుంద‌నే ధృఢ విశ్వాసంతో క‌నిపిస్తున్నారు. పార్టీ ఫిరాయింపుల మీద ఉన్న వ్యతిరేక‌త పార్టీకి న‌ష్టం చేకూరుస్తుంద‌ని, యువ‌త‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని ఆయ‌న కోరుతున్నారు. మొత్తానికి ప్రత్తిపాడు టీడీపీ రాజ‌కీయాలు హీటెక్కుతున్నాయి. ఎన్నిక‌ల ముంగిట తాతా మ‌న‌వ‌డి త‌గాదా తార‌స్థాయికి చేరుతుండ‌డంతో చ‌ర్చనీయాంశంగా మారింది. చివ‌ర‌కు ఏం జ‌రుగుతుంద‌న్నది ఆస‌క్తి రేకెత్తిస్తోంది.