విజయనగరం వైసీపీ నేతలకు వింత కష్టం!

  • Published By: sreehari ,Published On : July 7, 2020 / 08:03 PM IST
విజయనగరం వైసీపీ నేతలకు వింత కష్టం!

ప్రస్తుతానికి కరోనా కాలం నడుస్తోంది. ఎటు చూసినా కరోనా కేసులే కనిపిస్తున్నాయి. వారూ, వీరూ అని తేడా లేకుండా… ఎవరినీ వదలడం లేదు. సాధారణ పౌరులు, ప్రభుత్వ సిబ్బంది, అధికారులు, వైద్యులు, ప్రజాప్రతినిధులు ఇలా అందరినీ పలకరిస్తోంది.

ఇదంతా బాగానే ఉంది కానీ.. విజయనగరం జిల్లా అధికార పార్టీ నేతలు మాత్రం కరోనా వైరస్ కంటే.. వారిపై ఆకతాయిలు చేస్తున్న దుష్ప్రచారం అంటూనే ఎక్కువ భయపడుతున్నారట. సోషల్ మీడియా వేదికగా సదరు నేతలకు కరోనా వచ్చిందంటూ వస్తున్న పోస్టులు ఆ నేతలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయని అంటున్నారు. ఇదెక్కడి చోద్యంరా బాబు అంటూ తలలు పట్టుకుంటున్నారట.

ఆకతాయిల ప్రచారాల నేపథ్యంలో తమకి కరోనా లేదని నిరూపించుకునేందుకు ఆ నేతలు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఏదో ఒక కార్యక్రమం పేరుతో బయటకు రావడం, ప్రెస్‌మీట్లు పెట్టడం వంటి కార్యక్రమాలతో రోజూ ప్రజలకు కనిపించేలా ప్లాన్‌ చేసుకుంటూ, తమకు కరోనా గిరోనా ఏమీ లేదు చూశారా అనే సంకేతాలు ఇస్తున్నారట. బయటకు ఇలా కనిపిస్తున్నా లోలోపల మాత్రం గుబులుగానే ఉంటున్నారని చెబుతున్నారు.

ఎన్ని చేసినా… వీరిపై పడ్డ మచ్చ మాత్రం పోవడం లేదు. ఇటీవల ఓ ఎమ్మెల్యే ఏకంగా ప్రెస్‌మీట్ పెట్టి మరీ ఆకతాయిలకు వార్నింగ్ ఇచ్చారు. తాము తరచూ కరోనా వైరస్ టెస్టులు చేయించుకుంటున్నామని, తమకి ఎలాంటి వైరస్ సోకలేదని, తమపై దుష్ప్రచారం చేస్తున్న ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ గట్టిగానే వార్నింగ్‌ ఇచ్చారు.

గత నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాలు, రాజ్యసభ పోలింగ్‌కు హాజరై, జిల్లాకు తిరిగివచ్చినప్పటి నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యేలపై సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారం మొదలైంది. విజయవాడ నుంచి వచ్చిన తర్వాత ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది.

ఆయనతో పాటు జిల్లాలో అధికార పార్టీకి చెందిన మరో కీలక నేతకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఒకేసారి ఇద్దరు అదికార పార్టీ నేతలకు పాజిటివ్ రావడంతో జిల్లాలో కలకలం రేగింది. ఇద్దరు నేతలకు కరోనా రావడంతో ఈ ప్రచారానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. ఈ నేపథ్యంలో పలువురు అధికార పార్టీ నేతలకు కరోనా పాజిటివ్ వచ్చిందనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

సోషల్ ప్రచారంతో నేతల్లో కలవరం :
ఫలానా ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్ వచ్చిందట అంటూ రోజుకో పోస్టు రోజుకో రకంగా రావడంతో సదరు నేతల్లో కలవరం మొదలైంది. వాస్తవానికి విజయవాడ నుంచి వచ్చీ రాగానే, పలువురు ఎమ్మెల్యేలు కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకున్నారు. విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి సహా బొత్స అప్పలనర్సయ్య, బడ్డుకొండ అప్పలనాయుడు, అలజంగి జోగారావు, పీడిక రాజన్నదొర తదితరులు ప్రత్యేకంగా స్వాబ్ టెస్టులు చేయించుకున్నారు. వీరందరికీ నెగిటివ్ ఫలితాలు వచ్చాయి. అయినా, వీరిలో ఒక ఎమ్మెల్యేకి పాజిటివ్ రిపోర్టు వచ్చిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. తీవ్ర అసహనానికి గురైన ఆయన.. మళ్లీ కరోనా టెస్టు చేయించుకొని, ఆ ఫొటోను మీడియాకి సైతం విడుదల చేశారు.

తమకు కరోనా లేనప్పటికీ, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో ప్రజాప్రతినిధులు అంటే సాధారణ ప్రజలు కూడా భయపడే పరిస్థితులు తలెత్తాయి. అధికారులు, ప్రభుత్వ సిబ్బంది సైతం బయటకు చెప్పకపోయినా, ప్రజాప్రతినిధులంటే లోలోపలే భయపడుతున్నారట.

తమకి కరోనా లేదని నిరూపించుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలనూ ఉపయోగించుకుంటున్నారు. ప్రజల్లో ఇంకో ఏదో తెలియని భయం వెంటాడుతుండటంతో సదరు నేతలు తలలు పట్టుకుంటున్నారట. మొత్తానికి కరోనా పాజిటివ్ వచ్చిన వారు బాగానే ఉన్నారు…. ఏమీ లేని తమకి ఈ తిప్పలు ఏంటోనని సదరు నేతలు లోలోపలే మదన పడుతున్నారట.