విజయనగరం వైసీపీ రగిలిపోతోంది… చెప్పుకోవడానికి చేసిన పనులు కనిపించక…. కిందామీదా పడుతోంది

  • Published By: sreehari ,Published On : July 24, 2020 / 02:55 PM IST
విజయనగరం వైసీపీ రగిలిపోతోంది… చెప్పుకోవడానికి చేసిన పనులు కనిపించక…. కిందామీదా పడుతోంది

అధికారంలోకి వచ్చి సుమారు ఏడాదిన్నర కావస్తోంది. చేతిలో పవర్ ఉన్నా… తామనుకున్న పనులేవీ జరగడం లేదని తెగ బాధపడిపోతున్నారట విజయనగరం జిల్లా అధికార పార్టీ నేతలు. స్థానికంగా ఏవో చిన్న చిన్న పనులు తప్ప… తమని నమ్ముకున్న అనుచరులు, కేడర్ అడిగే చిన్న చిన్న ఆబ్లిగేషన్లను కూడా నెరవేర్చలేకపోతున్నామంటూ ఈ జిల్లా నేతలు మధనపడిపోతున్నారట.

ప్రస్తుతం పాలన అంతా అమరావతి నుంచే జరుగుతోంది. జనాలకి జగన్ ఫొటో తప్ప తమని పట్టించుకునే పరిస్థితి లేదనే భావన ఇక్కడి నేతల్లో వ్యక్తమవుతోందట. కనీసం తమ అనుచరులు అడిగే చిన్న చిన్న పోస్టింగ్‌లు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు, బదిలీలు వంటి పనులు కూడా చేయించుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామంటూ కొంతమంది ఎమ్మెల్యేలు తమ అనుచరుల వద్ద గోడు వెల్లబోసుకుంటున్నారట.

ఉద్యోగాల కోసం రికమండ్ చేయమన్నారని :
అసలు విషయానికొస్తే… ఇటీవల జగన్ ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కోసం ఏకంగా ఒక కార్పొరేషన్‌నే ఏర్పాటు చేసింది. ఇటీవల ఏర్పాటు చేసిన ఈ కార్పొరేషన్ ద్వారా పలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేసింది. ఈ ఉద్యోగాల్లో చేరిన అభ్యర్థులు ఎలా పోస్టులు సంపాదించుకున్నారు? వారిని ఎవరు రికమెండ్ చేశారన్న వివరాలు కనీసం ఎమ్మెల్యేలకు కూడా తెలియదట.

అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత కొంతమంది అనుచరులు ఎమ్మెల్యేలకి వద్దకి వెళ్లి… ఉద్యోగాల కోసం రికమండ్‌ చేయాలని అడిగారట. అయితే, సదరు ఎమ్మెల్యేలు కుదరదంటూ పెదవి విరిచారట. ఓ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండి కూడా కనీసం ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగాన్ని కూడా వేయించుకోలేని దుస్థితిలో ఉన్నానంటూ ఓ ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో తన అసహనాన్ని వ్యక్తం చేశారట.

శాసన సభ్యుల్లో నిరాశ, నిస్పృహ :
ఈ విషయంలోనే కాదు… మిగిలిన సంక్షేమ పథకాల విషయంలోనూ తమ ప్రమేయం లేకుండానే జరిగిపోతున్నాయంటూ కొంతమంది శాసనసభ్యులు తీవ్ర నిరాశ, నిస్పృహ వ్యక్తం చేస్తున్నారని టాక్‌. ప్రస్తుతం జగన్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది.

ప్రధానంగా రైతు భరోసా, వైఎస్సార్ వాహనమిత్ర, అమ్మ ఒడి వంటి పథకాలతో పాటు ఇటీవల భారీ స్థాయిలో సచివాలయ పోస్టులను భర్తీ చేసింది. సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకుండానే లబ్ధిదారుల ఎంపిక జరుగుతోంది. వారి ఖాతాలకే నేరుగా ఆన్ లైన్ ద్వారా లబ్ధి వెళ్లిపోతోంది. దీంతో ఎమ్మెల్యేలకు పని లేకుండా పోతోంది.

జాబులు, పోస్టింగ్‌లన్నీ అధికారుల కనుసన్నల్లోనే :
ప్రస్తుతం నియోజకవర్గాల్లో అభివ్రద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పన వంటి పెద్ద పెద్ద పనులేవీ ప్రారంభం కాలేదు. ఇంతవరకు నిధులు కూడా విడుదల చేయలేదు. దీంతో ఎమ్మెల్యేల పరిస్థితి అయోమయంగా తయారైందంటున్నారు. పేరుకే ఎమ్మెల్యేలు గానీ పెత్తనం చేసేందుకు ఏమీ లేదంటూ కొంతమంది ఎమ్మెల్యేలు తమ అనుచరుల వద్ద తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారట.

నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి పనులూ జరగడం లేదు. ఇక జాబులు, పోస్టింగ్‌లన్నీ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. ఎమ్మెల్యేల సిఫార్సులు చెల్లకపోవడంతో ఇక వీరితో పని లేదంటూ అనుచరులు కూడా ఎమ్మెల్యేల వైపు చూడ్డం మానేస్తున్నారట. దీంతో వారు తెగ ఫీలైపోతున్నారట.