అమ్మ ఆశీర్వాదంతో అన్నాడీఎంకేను మళ్లీ కంట్రోల్లోకి తెచ్చుకుంటా..!

అమ్మ ఆశీర్వాదంతో అన్నాడీఎంకేను మళ్లీ కంట్రోల్లోకి తెచ్చుకుంటా..!

VK Sasikala flaunt AIADMK flag again : అమ్మ జయలలిత ఆశీర్వాదంతో అన్నాడీఎంకే పార్టీని తన అధీనంలోకి తెచ్చుకుంటానని చిన్నమ్మ శశికళ వ్యాఖ్యానించారు. క్రియాశీల రాజకీయాల్లో అడుగుపెడతానని, అన్నాడీఎంకేను తన కంట్రోల్లోకి తెచ్చుకుంటానని, ఎవరూ తనను అడ్డుకోలేరని బహిష్కృత నేత శశికళ ధీమా వ్యక్తం చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించిన శశికళ.. గత నెల 27న విడుదలైన సంగతి తెలిసిందే.

బెంగళూరు శివార్లలోని రిసార్టులో విశ్రాంతి తీసుకున్న అనంతరం శశికళ సోమవారం అర్ధరాత్రి చెన్నైకి చేరుకున్నారు. కృష్ణగిరి జిల్లా నుంచి పలు చోట్ల శశికళ తన కారులో నిలబడే ప్రసంగాన్ని కొనసాగించారు. అణగదొక్కాలనే వారి ప్రయత్నాలు ఫలించవని అన్నారు. క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తానని స్పష్టం చేశారు. త్వరలో మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాలు వివరిస్తానని శశికళ పేర్కొన్నారు.

తాను కార్యకర్తలకు, అభిమానులకు మాత్రమే బానిసనని, వారికి దాసోహం అవుతానని చెప్పుకొచ్చారు. అమ్మ సమాధి సందర్శనకు వీలులేకుండా అకస్మాత్తుగా ఎందుకు మూసివేశారో ప్రజలందరికీ తెలుసునని అన్నారు. తన అభిమాన కార్యకర్తల సహకారంతో విజయం సాధించవచ్చునని తెలిపారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా అమ్మ ఆశీర్వాద బలంతో అధిగమిస్తానని ధీమా వ్యక్తం చేశారు. తుదిశ్వాస విడిచేవరకు అఖిల భారత అన్నాడీఎంకే ద్వారా ప్రజా సంక్షేమాన్ని కాపాడుతానని చెప్పారు.

రిసార్టు నుంచి చెన్నైవైపు కారులో బయల్దేరిన శశికళ కారును తమిళనాడు సరిహద్దుల్లోకి ప్రవేశించగానే పోలీసులు అడ్డుకున్నారు. అన్నాడీఎంకే పతాకాన్ని తొలగించాలని కోరారు. అందుకు శశికళ నిరాకరించారు. శశికళ రాకతో చెన్నైలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.