వరంగల్ బల్దియా బాద్ షా ఎవరు : 27న మేయర్ ఎన్నిక

  • Published By: madhu ,Published On : April 25, 2019 / 01:10 AM IST
వరంగల్ బల్దియా బాద్ షా ఎవరు : 27న మేయర్ ఎన్నిక

గ్రేటర్ వరంగల్ పీఠం దక్కేదెవరికి…బల్దియా బాద్ షాగా లక్కీ ఛాన్స్ కొట్టేసేదెవరు ? లాబీయింగ్ కలిసి వస్తుందా ? ఎమ్మెల్యేలు జై కొట్టేదెవరికి ? గులాబీ బాస్ మనసులో మాటేంటి ? తెలంగాణలో కీలక నగరంపైనే ఇప్పుడు అందరి ఫోకస్. వరంగల్‌ మేయర్‌ ఎవరానే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కార్పొరేటర్ల లాబీయింగ్, చర్చలు గత రెండు నెలలుగా జోరుగా సాగుతున్నాయి. మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న వారంతా షెడ్యూల్‌ విడుదల చేయడంతో రాజధాని బాట పట్టారు. ఎవరికి వారే తమ గాడ్‌ఫాదర్ల ద్వారా మేయర్ స్థానం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మేయర్‌ అభ్యర్థి ఎంపికలో ఎమ్మెల్యేలతో పాటు, తమ అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొవాలని కార్పొరేటర్లు డిమాండ్‌ చేస్తున్నారు. మొన్నటి వరకు నగర మేయర్‌గా ఉన్న నన్నపునేని నరేందర్ వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా గెలవడంతో ఆ పీఠం ఖాళీ అయింది.

వరంగల్ మేయర్ స్థానం జనరల్  కేటగిరి స్థానం నుంచి ఎంపిక చేసేందుకు సమీక్ష నిర్వహించిన KTR.. గతంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా జనరల్ స్థానమైన బీసీ వర్గానికి చెందిన నన్నపునేని నరేందర్‌కు అవకాశం కల్పించారు. జనరల్‌లో గెలిచిన కార్పొరేటర్లకే మేయర్‌ పదవి ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. మహిళల నుంచి నాగమళ్ల ఝాన్సీ, గుండు అశ్రితారెడ్డి, నల్ల స్వరూపారాణి…పురుషుల నుంచి గుండా ప్రకాష్‌రావు, వద్దిరాజు గణేష్, బోయినపల్లి రంజిత్‌రావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఇంచార్జ్ మేయర్‌గా ఉన్న సిరాజుద్దీన్ సైతం మైనార్టీ రిజర్వేషన్లలో తనకు అవకాశం కల్పించాలని కోరుతున్నట్లు సమాచారం. 

ముఖ్యంగా విలీన గ్రామాల నుంచి ప్రాతినిధ్యం ఉండాలనే ఫార్ములాతో నాగమల్ల ఝాన్సీకి మేయర్‌ పదవి ఇవ్వాలని అధినేతల వద్ద వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌ పట్టుబడుతున్నట్లు ప్రచారంలో ఉంది. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కూడా ఓకే చెప్పే అవకాశాలే ఉన్నాయి. వరంగల్‌ తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్‌, వినయ్‌భాస్కర్‌ కూడా వ్యతిరేకించే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తోంది.

తమ నియోజకవర్గాల నుంచి మరొకరు రాజకీయ ప్రభావం చూపకుండా ఉండే సమీకరణ క్రమంలో భాగంగా వీరంతా ఝాన్సీ పట్ల మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. 2019, ఏప్రిల్ 27న జరగనున్న మేయర్ ఎన్నిక బాధ్యతను పార్టీ ప్రధాన కార్యదర్శి, TSIC చైర్మన్ బాలమల్లుకు అప్పగించారు. మేయర్ ఎన్నిక అయ్యేదాకా ఆయన పార్టీ ఇంచార్జీగా కొనసాగనున్నారు. మరి గ్రేటర్ వరంగల్ పీఠం ఎవరికి దక్కుతుందో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.