భానుడు భగభగలు : ఈ వేసవి చాలా హాట్ గురూ..జాగ్రత సుమా

  • Published By: madhu ,Published On : February 29, 2020 / 12:13 PM IST
భానుడు భగభగలు : ఈ వేసవి చాలా హాట్ గురూ..జాగ్రత సుమా

ఈ వేసవి చాలా హాట్‌గా ఉండబోతోంది. మార్చిలో భానుడు భగ్గుమనేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ ఎండాకాలం రికార్డు స్థాయిలో ఎండలు ఉండబోతున్నాయని భారత వాతావరణశాఖ ఓ నివేదిక విడుదల చేసింది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 0.5 డిగ్రీల సెల్సియస్‌ నుంచి 1 డిగ్రీ సెల్సియస్‌ వరకు అదనంగా ఈసారి ఎండలు నమోదు అయ్యే చాన్స్ ఉన్నట్లు నివేదిక చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా భూతాపం పెరిగిపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. 

వాతావరణశాఖ నివేదికలోని అంచనాల ప్రకారం మార్చి రెండో వారం నుంచే వేసవి తాపం మొదలవబోతోంది. ఇక మే నెలలో వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే, గత సంవత్సరంతో పోలిస్తే ఈ గాడ్పుల తీవ్రత కాస్త తక్కువే ఉండొచ్చని నివేదిక చెబుతోంది. ఇక తూర్పు, ఉత్తర తెలంగాణా జిల్లాలతో పాటు, కోస్తాంధ్రా జిల్లాలపై ఈ వేసవి వేడి ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. దేశంలో అధికంగా ప్రభావితమయ్యే ప్రాంతాల జాబితాలో ఈ మూడు ప్రాంతాలూ ఉన్నాయి. 

Also Read | McDonald, Domino పిజ్జాల్లో ఇన్నీ కేలరీలు, ఫ్యాట్ తింటున్నామా? 

తెలంగాణా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 45 డిగ్రీలు, రాయలసీమ జిల్లాల్లో 43 నుంచి 44 డిగ్రీల సెల్సియస్‌ను దాటొచ్చని అంచనా వేస్తున్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్‌, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్‌, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట ప్రాంతాల్లో ఈ వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

మార్చి రెండో వారం నుంచే ఎండలు మండిపోతాయంటున్నారు వాతావరణశాఖ అధికారి రాజారావు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉష్ణోత్రగతలు తీవ్రస్థాయిలో ఉంటాయంటున్నారు. తగిన చర్యలు తీసుకుంటే తప్పా ఈ ఎండల బారీ నుంచి తప్పించుకోలేమని వాతావరణ శాఖ అధికారి రాజారావు వెల్లడించారు. 
Read More : goli maro : రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్‌లో టెన్షన్