బెంగాల్‌లో వేడిక్కిన రాజకీయం.. టీఎంసీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు దేశ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. అధికారం కోసం టీఎంసీ, బీజేపీ నువ్వా – నేనా అన్నట్లు తలపడుతున్నాయి. ఎన్నికలకు నెల రోజుల ముందు నుంచే… ప్రధాన పార్టీల అగ్రనేతలంతా ఇప్పటికే రంగంలోకి దిగి… ప్రచారం నిర్వహిస్తున్నారు.

బెంగాల్‌లో వేడిక్కిన రాజకీయం.. టీఎంసీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం

West Bengal Heats Up Ahead of State Polls : పశ్చిమ బెంగాల్ ఎన్నికలు దేశ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. అధికారం కోసం టీఎంసీ, బీజేపీ నువ్వా – నేనా అన్నట్లు తలపడుతున్నాయి. ఎన్నికలకు నెల రోజుల ముందు నుంచే… ప్రధాన పార్టీల అగ్రనేతలంతా ఇప్పటికే రంగంలోకి దిగి… ప్రచారం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో మార్పు తెస్తామని బీజేపీ అంటుంటే… మార్పు కేంద్రంతోనే మొదలవుతుందని మమతా ధీటుగా బదులిస్తున్నారు. ఇప్పటికే ర్యాలీలతో, పాదయాత్రలతో టీఎంసీ, బీజేపీ నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తంటాలు పడుతున్నారు. పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ సర్కారుపై మాటల దాడితో రెచ్చిపోతున్న బీజేపీని అదే స్ధాయిలో ఎదుర్కొనేందుకు ఆమె వ్యూహరచన చేస్తున్నారు.

మాటకు మాట అన్నట్లుగా కౌంటర్లు సంధిస్తున్నారు. దీంతో బీజేపీ నేతల విమర్శలు, మమత కౌంటర్లతో బెంగాల్‌ పోరు ఆసక్తికరంగా మారిపోయింది. నినాదాల ఆటలో బెంగాల్ ఎప్పుడూ ఒక అడుగు ముందుగానే ఉంది. హర్ హర్ మోడీ…. ఘర్ ఘర్ మోడీ… అబ్ కి బార్ మోడీ సర్కార్…. బెంగాల్‌లో ఎక్కడ చూసినా ఇవే నినాదాలు… అధికారమే లక్ష్యంగా బీజేపీ నేతలు ఓటర్లను ఆకట్టుకునేందుకు నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బెంగాల్‌లో నినాదాల ఆట మరింత బలపడింది. ఒకరకంగా చెప్పాలంటే… ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే బెంగాల్‌లో రాజకీయ కోలాహలం మొదలైంది.

బీజేపీ అగ్రనేతల పర్యటనలు… దీదీ ప్రభుత్వంపై ఆరోపణలు… ఆపరేషన్ కమల్ ఆకర్ష్ పేరుతో టీఎంసీ ముఖ్య నేతలను కాషాయ గూటికి చేర్చుకోవడం…. ఇలా బీజేపీ నేతలు వేగంగా పావులు కదుపుతున్నారు. బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఇప్పటికే పదేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న దీదీ సర్కార్… ఈసారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్‌ కొట్టాలని భావిస్తోంది. అటు బీజేపీ మాత్రం… తొలిసారి బెంగాల్‌లో అధికారంలోకి రావాలని గట్టి పట్టుదలతో పావులు కదుపుతోంది. అటు సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు కూడా బెంగాల్‌లో తమ ఉనికిని చాటుకోవాలని ఆరాటపడుతున్నాయి. ఓటర్ దేవుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు ఈసారి నినాదాలతో గాలం వేస్తున్నాయి ప్రధాన పార్టీలు.

బీజేపీ నేతలపై మమతా ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను ఓట్ల కోసం ప్రజలను డబ్బులతో మభ్యపెట్టలేదని, ప్రజల ఆశీస్సులతోనే తాను రాజకీయాలు చేస్తానన్నారు. నందిగ్రామ్‌లో ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోందన్న మమతా… ప్రజలు, రైతుల హక్కు కోసం తాను ఎప్పుడూ పోరాడుతానన్నారు. ఏప్రిల్ 1వ తేదీన ప్రజల జేబుల్లోకి డబ్బులు పెట్టి ఓట్లు అడిగే వారిని ఏప్రిల్ ఫూల్ చేయాలని మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. మత కార్డును వాడుకోవడం ద్వారా నందిగ్రామ్ ఉద్యమాన్ని అవమానిస్తున్నారని మమతా బెనర్జీ అన్నారు. ప్రజల స్పందన కారణంగా నందిగ్రామ్ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నానన్నారు.

నందిగ్రామ్‌లో తనను బయటి వ్యక్తి అని పిలిచేవారిపై తీవ్రంగా విరుచుకుపడుతున్న దీదీ… గుజరాత్ నుండి వస్తున్న వారు అంతర్గత వ్యక్తులు, నేను మాత్రం బయట వ్యక్తినా అని ప్రశ్నించారు. బీజేపీలో చేరిన టీఎంసీ నేత సువేందు అధికారిపై మమతా బెనర్జీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బయటి వ్యక్తుల పార్టీలో చేరిన సువేందు అధికారి భూమి పుత్రుడను అని ఆ విధంగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. మరోవైపు టీఎంసీ పదేళ్ల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని… ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బీజేపీ ప్రచారం చేస్తోంది. ఈసారి బెంగాల్ గడ్డపై ఎగిరేది కాషాయ జెండానే అన్న ధీమాతో ఉంది. ఈ నేపథ్యంలో చివరకు బెంగాల్ ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారన్నది సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.