JBS To MGBS మెట్రో : ఫలక్ నుమా పనులు ఎప్పుడు ? ఓవైసీ ట్వీట్

  • Published By: madhu ,Published On : February 6, 2020 / 07:30 AM IST
JBS To MGBS మెట్రో : ఫలక్ నుమా పనులు ఎప్పుడు ? ఓవైసీ ట్వీట్

హైదరాబాద్‌లో మరో మెట్రో రైలు కూత పెట్టనుంది. JBS To MGBS మార్గంలో మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. ఇందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. 2020, ఫిబ్రవరి 07వ తేదీ శుక్రవారం సీఎం కేసీఆర్ మెట్రో రైలును ప్రారంభించనున్నారు. అయితే..దీనిపై MIM అధినేత, హైదరాబాద్ ఎంపీ అసుదుద్దీన్ ఓవైసీ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ట్వీట్‌లో పలు విమర్శలు సంధించడమే కాకుండా..ప్రశ్నలు సంధించారు. 

MGBS నుంచి JBS వరకు మెట్రో పనులు పూర్తి చేశారు..ఒకే..కానీ ఫలక్ నుమా మార్గంలో ఎప్పుడు పనులు మొదలు పెడుతారని హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యాన్ని ప్రశ్నించారు. దార్ ఉల్ షిఫా నుంచి ఫలక్ నుమా మెట్రో లైన్ సంగతి ఏంటీ ?

దక్షిణ హైదరాబాద్ విషయానికి వచ్చే సరికి..సమాధానం ఉండదు అంటూ విమర్శలు చేశారు. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మార్గాన్ని పూర్తి చేయడానికి మాత్రం నిధులు ఉంటాయి..కానీ ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా పనులు ఎప్పుడు మొదలు పెడుతారు ? ఎప్పుడు పూర్తి చేస్తారు ? అంటూ సూటిగా ప్రశ్నించారు. 

ఇదిలా ఉంటే..నగరంలోని నివాసం ఉంటున్న ప్రజలు జేబీఎస్, ఎంజీబీఎస్ నుంచి వివిధ ప్రాంతాలకు చేరుకోవడానికి తరలివస్తుంటారు. పండుగల సమయంలో విపరీతమైన రద్దీ ఉంటుంది. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ప్రయాణం చేయాలంటే..సుమారు 40 నిమిషాలకు పైగా సమయం పడుతుంది.

మెట్రో రైలు అందుబాటులో రావడం వల్ల కేవలం 15 నిమిషాల్లో ఎంజీబీఎస్ గమ్యాన్ని చేర్చుకోవచ్చు. దీనివల్ల ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. మొత్తం నగరంలో 72 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ నగరంలో ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

కానీ ఎంజీబీఎస్ – ఫలక్ నుమా మార్గం నిర్మాణ దశలోనే ఆగిపోయింది. ప్రస్తుతం దీనిపై ఓవైసీ చేసిన ట్వీట్‌పై మెట్రో యాజమాన్యం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. 

* జేబీఎస్ – ఎంజీబీఎస్ స్టేషన్లను కలిపే ఈ మార్గంలో 9 స్టేషన్లు ఉన్నాయి. 
* జేబీఎస్ – పరేడ్ గ్రౌండ్ స్టేషన్, సికింద్రాబాద్ వెస్ట్, గాంధీ ఆసుపత్రి, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, చిక్కడపల్లి, * నారాయణగూడ, సుల్తాన్ బజార్, ఎంజీబీఎస్ స్టేషన్లున్నాయి. 

* ఢిల్లీ తర్వాత అతిపెద్ద మెట్రో రైలు మార్గం కలిగిన రెండో నగరంగా హైదరాబాద్ పేరొందింది. 
* 11 కి.మీటర్ల మార్గంతో ఇక్కడ మెట్రో మార్గం..69 కి.మీటర్లకు చేరుకోనుంది. 
* రెండో దశ విస్తరణలో భాగంగా రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం, ఇతర మార్గాలు, పాతబస్తీ మెట్రోపై సీఎం కేసీఆర్ ప్రకటనలు చేసే అవకాశం ఉంది.