సుగాలి ప్రీతి కేసుపై పవన్ కళ్యాణ్ ఏం చెప్పబోతున్నారు?

కర్నూలు జిల్లాలో మూడేళ్ల కిందట రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థిని సుగాలి ప్రీతి మృతి కేసు సంచలనం సృష్టించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్నూలు పర్యటనకు సిద్ధమయ్యాడు.

  • Published By: veegamteam ,Published On : February 12, 2020 / 06:54 AM IST
సుగాలి ప్రీతి కేసుపై పవన్ కళ్యాణ్ ఏం చెప్పబోతున్నారు?

కర్నూలు జిల్లాలో మూడేళ్ల కిందట రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థిని సుగాలి ప్రీతి మృతి కేసు సంచలనం సృష్టించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్నూలు పర్యటనకు సిద్ధమయ్యాడు.

సోషల్ మీడియాలో ఇప్పుడు జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. సుగాలి ప్రీతికి న్యాయం చేయాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో మూడేళ్ల కిందట రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థిని సుగాలి ప్రీతి మృతి కేసు సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్నూలు పర్యటనకు సిద్ధమయ్యాడు. సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ నాయకులు నిరసన ప్రదర్శనలు, ఆందోళనలను నిర్వహించడానికి సిద్ధమయ్యారు. మరోవైపు సుగాలి ప్రీతి కేసును అడ్డం పెట్టుకుని పవన్ రాజకీయాలు చేయాలనుకుంటున్నారని మండిపడుతోంది. సుగాలి ప్రీతి కేసు నిందితులను శిక్షించాలని మొదటి నుంచి తాము పోరాటాలు చేస్తున్నామని పేర్కొంది.

అసలు సుగాలి ప్రీతి ఎవరు? 
ఇదే సమయంలో అసలు సుగాలి ప్రీతి ఎవరు? ఏం జరిగింది..? ఎప్పుడు జరిగింది.. ఇప్పుడెందుకు ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరిగిందనే విషయాలను చూస్తే.. 2017 ఆగస్టు 19న 15 ఏళ్ల బాలిక అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. అత్యాచారాలకు, హత్యాచారాలకు బలైపోయిన బాధితుల పేర్లు బైటకు రాకూడదనే కారణంతో ప్రస్తుతం ఆమె పేరును గీతగా మార్చారు. కర్నూలు శివారులోని లక్ష్మీగార్డెన్‌లో ఉంటున్న ఎస్‌.రాజు నాయక్, ఎస్‌.పార్వతిదేవి దంపతుల 14 ఏళ్ల కుమార్తే ఈ గీత. ఓ రాజకీయ నాయకుడికి చెందిన కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్‌ స్కూల్‌లో పదో తరగతి చదివేది. 2017 ఆగస్టు 19న ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయినట్లు స్కూల్‌ యాజమాన్యం చెబుతోంది. తమ కుమార్తె ఉరి వేసుకుని చనిపోలేదని, స్కూల్‌ యజమాని కొడుకులు బలవంతంగా రేప్‌ చేసి చంపేశారని తల్లిదండ్రుల ఆరోపణ. 

ప్రాథమిక రిపోర్ట్‌లో బాలికని రేప్‌ చేసినట్లు నిర్ధారణ 
ఇక, కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసిన వైద్యులు సైతం… 2017 ఆగస్టు 20న ఇచ్చిన ప్రాథమిక రిపోర్ట్‌లో బాలికని రేప్‌ చేసినట్లు నిర్ధారించారు. పెథాలజీ హెచ్‌ఓడీ డాక్టర్‌ సైతం ఇదే విషయాన్ని నిర్ధారిస్తూ నివేదిక ఇచ్చారని తల్లిదండ్రులు తెలిపారు. తమ దగ్గరున్న ఆధారాలతో బాధితురాలి తల్లిదండ్రులు తాలూకా పోలీసు స్టేషన్‌లో కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్‌ యజమానితో పాటు.. అతడి కుమారులపై ఫిర్యాదు చేశారు. నిందితులపై పోలీసులు పోక్సో చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. 

సాక్ష్యాలు బలంగా ఉండటంతో నిందితుల అరెస్టు 
ఈ ఘటనపై విచారణకు ముందుగా త్రి సభ్య కమిటీని ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్.. తర్వాత ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించారు. బాలిక శరీరంపై ఉన్న గాయాలను, అక్కడి దృశ్యాల పట్ల కమిటీ అనుమానం వ్యక్తం చేసింది. విద్యార్థినిపై లైంగిక దాడి చేసి.. హత్య చేశారని ఈ కమిటీ నివేదిక ఇచ్చింది. సాక్ష్యాలు బలంగా ఉండటంతో నిందితులను అరెస్టు చేశారు. కానీ 23 రోజులకే వారికి బెయిల్ వచ్చింది. దీంతో తమ బిడ్డను రేప్‌ చేసి చంపిన వారిని శిక్షించాలంటూ బాలిక తల్లిదండ్రులు కలెక్టరేట్‌ ముందు ఆందోళనకు దిగారు. 

పవన్ కళ్యాణ్‌ను కలిసిన బాధితురాలి తల్లి 
ఆధారాలు పక్కాగా ఉన్నప్పటికీ.. ఇప్పటి వరకు తమకు న్యాయం జరగలేదని బాధితురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై దళిత సంఘాలు కూడా ఆందోళనలు నిర్వహించాయి. అయితే ఎలాంటి న్యాయం జరగలేదు. దీంతో ఇదే విషయమై ఆమె జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిశారు. దీంతో ఈ ఘటనపై బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. పవన్ కళ్యాణ్..  ఇవాళ కర్నూలు నగరంలో ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు. అటు ఈ కేసును సీబీఐకి అప్పగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. 

సీబీఐ దర్యాప్తు కోసం కేంద్ర హోంశాఖకు ప్రతిపాదనలు 
మరోవైపు సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని కర్నూలు జిల్లా ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. సీబీఐ దర్యాప్తు కోసం కేంద్ర హోంశాఖకు ప్రతిపాదనలు పంపించామని వివరించారు. ఈ కేసులో అనేక మలుపులు చోటుచేసుకోవడంతో కేసును సీబీఐకి అప్పగించాలని అన్ని వర్గాల నుంచి పెద్దఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. ఒత్తిడి పెరగడంతో.. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు మరోసారి లోతుగా దర్యాప్తు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.