కృపారాణి దారెటు..?

  • Published By: chvmurthy ,Published On : February 10, 2019 / 02:14 PM IST
కృపారాణి దారెటు..?

కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి భ‌విష్యత్ వ్యూహమేంటి..? రాబోయే ఎన్నిక‌ల్లో ఆమె ఏ పార్టీ నుంచి, ఏ నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేస్తారు..? ఆమె కాంగ్రెస్‌లో ఉంటారా..? లేక వేరే పార్టీలోకి మారుతారా..? ఇదే విష‌య‌ంపై ప్రస్తుతం శ్రీ‌కాకుళం జిల్లాలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. ఏపీ కాంగ్రెస్  వ‌్యవ‌హారాల్లో చురుకుగా పాల్గొంటున్న కృపారాణికి ఒక ప్రధాన పార్టీ మంచి ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్లు సమాచారం.. ఇంత‌కీ కృపారాణి ప‌య‌న‌మెటు..? లెట్స్‌ వాచ్‌ దిస్‌ స్టోరీ….

శ్రీ‌కాకుళం జిల్లాకు చెందిన డాక్టర్ కిల్లి కృపారాణి, రామ్మోహ‌న‌రావు దంప‌తులు కాంగ్రెస్ పార్టీలో కీల‌క భూమిక పోషిస్తున్నారు. 2009లో దివంగ‌త ఎర్రంనాయుడుపై గెలిచిన ఈమె కేంద్రమంత్రిగా ప‌నిచేశారు. ఐతే.. కాంగ్రెస్ పార్టీ నుంచి పురంద‌రేశ్వరి, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, వైరిచ‌ర్ల కిశోర్‌చంద్రదేవ్ లాంటి వారు త‌ప్పుకుంటున్న త‌రుణంలో ఈమె పయనమెటన్నది చ‌ర్చనీయాంశంగా మారింది. కృపారాణికి టీడీపీ, వైసీపీ నుంచి ఆహ్వానం అందినట్లు స‌మాచారం. ఈమె ఓకే అంటే ప్రధాన పార్టీలు శ్రీ‌కాకుళం ఎంపీగాగానీ.. టెక్కలి, ప‌లాస ఎమ్మెల్యే అభ్యర్థిగాగానీ బ‌రిలోకి దింపే ఆలోచ‌న‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఐతే.. కిల్లి కృపారాణి ఆమె భ‌ర్త రామ్మోహ‌న‌రావు మాత్రం ఎలాంటి అంగీకారం తెల‌ప‌కుండా డైలామాలో ఉన్నట్లు క‌న‌బ‌డుతోంది.

కళింగ సామాజిక వ‌ర్గానికి చెందిన ఈమెను పార్టీలోకి తీసుకుంటే ఇచ్ఛాపురం, ప‌లాస‌, టెక్కలి, శ్రీ‌కాకుళం, ఆముదాల‌వ‌ల‌స అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్రభావం ఉంటుద‌న్న చ‌ర్చ సాగుతోంది. ఐతే టీడీపీ, వైసీపీలోకి వెళ్లాల‌న్న ప్రతిపాద‌న‌లకు కిల్లి దంప‌తులు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేద‌ని  స‌మాచారం. దీంతోపాటుగా వైసీపీలో కిల్లి కృపారాణి రాక‌ను మాజీ మంత్రి ధ‌ర్మాన ప్రసాద‌రావు అడ్డుకుంటార‌న్న చ‌ర్చ సాగుతోంది. టీడీపీలోకి వెళితే ఎంపీగా రామ్మోహ‌న్‌నాయుడు, టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థిగా అచ్చెన్నాయుడు ఉన్నందున ఈమె ఎక్కడ నుంచి పోటీ చేస్తార‌న్నది ఆస‌క్తిక‌రంగా మారింది. బ‌ల‌మైన సామాజిక వ‌ర్గం, ఉత్తరాంధ్రలో ప‌ట్టు, ఢిల్లీ స్థాయిలో ప‌రిచ‌యాలు ఉన్న కిల్లి కృపారాణి 2019 ఎన్నిక‌ల విష‌యంలో ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది.