పంతం నెగ్గించుకున్న చంద్రబాబు : మండలిలో ఏం జరగనుంది..?

అనూహ్య పరిణామాల మధ్య శాసన మండలి సమావేశాలు ఇవాళ్టికి(జనవరి 22,2020) వాయిదా పడ్డాయి. రాజధాని వికేంద్రీకరణ బిల్లులను ప్రవేశపెట్టేందుకు వైసీపీ ప్రభుత్వం

  • Published By: veegamteam ,Published On : January 22, 2020 / 03:19 AM IST
పంతం నెగ్గించుకున్న చంద్రబాబు : మండలిలో ఏం జరగనుంది..?

అనూహ్య పరిణామాల మధ్య శాసన మండలి సమావేశాలు ఇవాళ్టికి(జనవరి 22,2020) వాయిదా పడ్డాయి. రాజధాని వికేంద్రీకరణ బిల్లులను ప్రవేశపెట్టేందుకు వైసీపీ ప్రభుత్వం

అనూహ్య పరిణామాల మధ్య శాసన మండలి సమావేశాలు ఇవాళ్టికి(జనవరి 22,2020) వాయిదా పడ్డాయి. రాజధాని వికేంద్రీకరణ బిల్లులను ప్రవేశపెట్టేందుకు వైసీపీ ప్రభుత్వం భావించగా.. సర్కారు ప్రయత్నాలకు గండికొట్టేందుకు టీడీపీ అన్ని ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగా రూల్ 71 కింద చర్చకు టీడీపీ నోటీసు ఇచ్చింది. దీన్ని మండలి చైర్మన్ షరీఫ్ అనుమతించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఐతే..రూల్‌ 71పై ఓటింగ్‌ నిర్వహించగా టీడీపీ ప్రవేశపెట్టిన తీర్మానం నెగ్గింది. దీంతో ఇవాళ మండలి సమావేశాలపై ఉత్కంఠ నెలకొంది.

నాటకీయ పరిణామాల మధ్య శాసన మండలిలో టీడీపీ ప్రవేశపెట్టిన రూల్‌ 71 తీర్మానం నెగ్గింది. తొలుత తీర్మానంపై చర్చ జరిగిన అనంతరం ఛైర్మన్‌ షరీఫ్‌ ఓటింగ్‌ నిర్వహించారు. రూల్‌ 71కు అనుకూలంగా 27, వ్యతిరేకంగా 13, తటస్థంగా 9 ఓట్లు పడ్డాయి. మండలి ప్రారంభం నుంచి అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య నువ్వా నేనా అన్నట్లు పరిస్థితులు కొనసాగాయి. సభ ప్రారంభం కాగానే రూల్‌ 71 కింద శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై అధికార వైసీపీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లులు ప్రవేశపెట్టేముందు రూల్‌ 71 కింద తీర్మానం పెట్టడం సంప్రదాయాలకు విరుద్ధమని వైసీపీ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బిల్లులపై చర్చ జరపాలంటూ అధికార పక్షం, రూల్‌ 71పై అంటూ ప్రతిపక్ష సభ్యుల వాదోపవాదాలతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పలుమార్లు సభ వాయిదా పడింది.   

అనంతరం ప్రతిపక్ష సభ్యుల సంఖ్యా బలం ఎక్కువగా ఉండటంతో రూల్‌ 71పై చర్చకు ఛైర్మన్‌ షరీఫ్‌ అనుమతించారు. టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ చర్చను ప్రారంభించగా.. ఆ పార్టీకి చెందిన మరికొంతమంది సభ్యులు కూడా మాట్లాడారు. చర్చ అనంతరం ఛైర్మన్‌ ఓటింగ్‌ నిర్వహించారు. ఈ ఓటింగ్‌లో టీడీపీకి అనుకూలంగా 27, వైసీపీకి అనుకూలంగా 13 ఓట్లు పడ్డాయి. ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథరెడ్డి నోటీసుకు వ్యతిరేకంగా ఓటేసి టీడీపీకి షాకిచ్చారు. శత్రుచర్ల, శమంతకమణి సభకు గైర్హాజరు కాగా.. ఇప్పటికే డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేశారు. ఇక బీజేపీ, పీడీఎప్ ఎమ్మెల్యేలు తటస్థంగా ఉన్నారు. దీంతో టీడీపీ ప్రవేశపెట్టిన రూల్‌ 71 తీర్మానం నెగ్గినట్లయింది. ఓటింగ్‌ అనంతరం సభను బుధవారానికి(జనవరి 22,2020) వాయిదా వేశారు. 

మరోవైపు రూల్‌ 71 తీర్మానం ఆమోదం పొందడంతో ప్రభుత్వం ప్రవేశపెట్టే పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లుల చర్చ జరిగే అవకాశం లేదని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. రూల్ 71 ఆమోదం పొందటంతో మంత్రివర్గ విధానాలు తప్పని తేలిందని, వికేంద్రీకరణ బిల్లు చర్చ లేకుండానే తిరస్కరణకు గురైందంటున్నారు టీడీపీ నేతలు.

మండలి వాయిదాపడ్డ అనంతరం టీడీపీ ఎమ్మెల్సీలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. మండలిలో ప్రభుత్వానికి ధీటుగా టీడీపీ సభ్యులు సమాధానమిచ్చారని కొనియాడారు. వైసీపీ ప్రభుత్వం సాంకేతికంగా, నైతికంగా కూడా ఓడి పోయిందన్నారు. బుధవారం కూడా వికేంద్రీకరణ బిల్లులపై చర్చ పెట్టకూడదన్నారు. ఒకవేళ బిల్లులపై ఓటింగ్ పెడితే ఇతర సభ్యులు కూడా టీడీపీకి మద్దతుగా నిలుస్తారని చెప్పారు. ప్రభుత్వం ఈ విషయంలో ఏమీ చేయలేదని స్పష్టం చేశారు. తమ దగ్గర ఇంకా చాలా అస్త్రాలు ఉన్నాయన్నారు చంద్రబాబు. 

మరోవైపు తక్కువ మంది సభ్యులు ఉండటంతో శాసన మండలిలో వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. దీంతో ఏకంగా మండలినే రద్దు చేస్తారని జోరుగా చర్చలు జరిగాయి. దీనికి సంబంధించి సీఎం జగన్‌ చర్చలు జరుపుతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి సంచలన నిర్ణయం లేకుండానే తొలి రోజు మండలి సమావేశం ముగిసింది. ఈ నేపథ్యంలో బుధవారం జరిగే మండలి సమావేశంలో ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందనే విషయం సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది.    

* నాటకీయ పరిణామాల మధ్య నెగ్గిన రూల్‌ 71 తీర్మానం
* రూల్‌ 71కు అనుకూలంగా 27, వ్యతిరేకంగా 13, తటస్థంగా 9 ఓట్లు 
* రూల్‌ 71 కింద తీర్మానం ప్రవేశపెట్టిన యనమల రామకృష్ణుడు
* రూల్‌ 71 కింద తీర్మానం పెట్టడం సంప్రదాయాలకు విరుద్ధమన్న వైసీపీ
* టీడీపీ సంఖ్యా బలం ఎక్కువగా ఉండటంతో రూల్‌ 71పై చర్చకు అనుమతి
* చర్చ అనంతరం ఓటింగ్‌ నిర్వహించిన ఛైర్మన్‌

* టీడీపీకి అనుకూలంగా 27, వైసీపీకి అనుకూలంగా 13 ఓట్లు 
* టీడీపీకి వ్యతిరేకంగా ఓటేసిన పోతుల సునీత, శివనాథరెడ్డి 
* సభకు గైర్హాజరైన శత్రుచర్ల, శమంతకమణి
* ఎమ్మెల్సీ పదవికి రాజీనామ చేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్ 
* తటస్థంగా ఉన్న బీజేపీ, పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు