Karnataka Polls: బీజేపీ, జేడీఎస్ ఎక్కడ బలంగా ఉన్నాయో అక్కడే గట్టిగా కొట్టిన కాంగ్రెస్

రాష్ట్రంలో అతిపెద్ద ప్రాంతం. ఈ ప్రాంతంలోనే అత్యధిక నియోజకవర్గాలు ఉంటాయి. పైగా జేడీఎస్ ఏర్పడినప్పటి నుంచి ఆ పార్టీకి ఈ ప్రాంతం పునాదిగా ఉంది. రాష్ట్రంలో ఆ పార్టీకి ఆదరణ ఉందంటే, అది కేవలం మైసూర్ ప్రాంతంలోనే. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఇక్కడ జెడిఎస్ అగ్రగామిగా నిలిచింది.

Karnataka Polls: బీజేపీ, జేడీఎస్ ఎక్కడ బలంగా ఉన్నాయో అక్కడే గట్టిగా కొట్టిన కాంగ్రెస్

Cong vs BJP vs JDS: చాలా కాలం తర్వాత కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తన పూర్థి ఆధిపత్యాన్ని చాటుకుంది. ఓట్లు, సీట్లు.. అన్నింట్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 43 శాతం ఓట్లతో 135 సీట్లు గెలుచుకుంది. 30 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీకి ఇదే అతిపెద్ద విజయం. ఇక పోతే అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కేవలం 65 అసెంబ్లీ స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. ఇక స్థానిక జనతాదళ్ సెక్యులర్ అయితే కేవలం 19 అసెంబ్లీ స్థానాలను మాత్రమే గెలుచుకుని భారీ ఓటమిని మూటగట్టుకుంది.

అయితే భారతీయ జనతా పార్టీ, జనతాదళ్ సెక్యూలర్ పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లోకి కాంగ్రెస్ పార్టీ చొచ్చుకుపోవడమే కాకుండా.. ఆ పార్టీలకు పట్టున్న ప్రాంతాల్లో వారినే దెబ్బకొట్టడం గమనార్హం. జేడీఎస్ పార్టీకి బలంగా ఉన్న మైసూర్ ప్రాంతంలో.. బీజేపీకి పట్టున్న ముంబై కర్ణాట, మధ్య కర్ణాటకలో కూడా కాంగ్రెస్ అద్భుత విజయాన్ని కైవసం చేసుకుంది. కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో ఎన్నికల ఫలితాలను పరిశీలించినట్లైతే..

కోస్తా-కర్ణాటక
ఈ ప్రాంతంలో 19 స్థానాలు ఉండగా, వాటిలో బీజేపీ 12, కాంగ్రెస్ 6, జేడీ(ఎస్) ఒక సీటు మాత్రమే గెలుచుకున్నాయి. కర్ణాటకలో బీజేపీ కాస్తో కూస్తో నిలబడగలిగి, కాంగ్రెస్ కంటే ఎక్కువ స్థానాలు సాధించిన ఏకైక ప్రాంతం కోస్తా కర్ణాటకనే. కోస్తా కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్‌లకు ఎప్పుడూ తీవ్ర పోటీ ఉంటుంది. అయితే గత కొంత కాలంగా (పలు లోక్‌సభ, విధానసభ ఎన్నికలు) ఈ ప్రాంతంలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈసారి కూడా బీజేపీ తన ఆధిక్యాన్ని నిలుపుకుంది. అయినప్పటికీ ఇక్కడ బీజేపీకి 49 శాతం ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 43 శాతం ఓట్లు వచ్చాయి.

బెంగళూరు సిటీ
రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో బెంగళూరు ప్రాంతం ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇక్కడ చాలా అసెంబ్లీ నియోజకవర్గాలు పట్టణ ప్రాంతంలోనే ఉంటాయి. బెంగళూరులో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ చారిత్రాత్మకంగా చాలా విజయాలు సాధించాయి. ఇరు పార్టీలకు ఈ ప్రాంతంలో 40 శాతం ఓట్ బ్యాంక్ ఉంది. అయితే 2013లో ఇక్కడ బీజేపీకి 32 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక సీట్ల విషయానికొస్తే, రెండు పార్టీలు ఎక్కువగా రెండంకెలలో గెలిచాయి. ఈసారి కాంగ్రెస్ 13 సీట్లు గెలుచుకుంది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి బీజేపీ నాలుగు సీట్లు సాధించింది. అయితే గత ఎన్నికల్లో రెండు స్థానాలు గెలుచుకున్న జేడీఎస్‌ ఈసారి ఆ రెండింటిలోనూ ఓడిపోయింది.

హైదరాబాద్-కర్ణాటక
బీజేపీకి కంచుకోటగా భావించే హైదరాబాద్ ప్రాంతాన్ని ఈసారి కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఈ ప్రాంతంలో రెండు కారణాల వల్ల కాంగ్రెస్ విజయం సాధించింది. మొదటిది ఇక్కడ షెడ్యూల్డ్ కులాల ఓటర్లు అధికంగా ఉన్నారు. దీనికి తోడు ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతం. రెండవది, ప్రస్తుత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ ప్రాంతానికి చెందినవారు కావడం. ఈ రెండు అంశాలు ఈ ప్రాంతంలో పార్టీ అత్యధిక ఓట్లను గెలుచుకోవడానికి దోహదపడ్డాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 46 శాతం ఓట్లు వచ్చాయి. ఈ ప్రాంతంలోని 40 స్థానాలకు గానూ కాంగ్రెస్‌ 26 సీట్లు గెలుచుకోగా, బీజేపీ కేవలం 10 సీట్లు మాత్రమే గెలుచుకుంది.

ముంబై-కర్ణాటక
సీట్ల సంఖ్యేతో పాటు లింగాయత్ ఓటర్లు అధికంగా ఉన్నందున ఈ ప్రాంతం బీజేపీకి బలమైన ప్రదేశం. అక్టోబరు 1990లో ప్రముఖ లింగాయత్ నాయకుడు వీరేంద్ర పాటిల్‌ను ముఖ్యమంత్రిగా తొలగించిన తర్వాత లింగాయత్‌లు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. దీన్ని చాలా కాలంగా బీజేపీ తనకు అనుకూలంగా వాడుకుంటూ వస్తోంది. అయితే ఈసారి ఈ ట్రెండ్‌లో మార్పు వచ్చింది. ఇక్కడ 50 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 33 స్థానాలను గెలుచుకోగా (2018లో ఇక్కడ బీజేపీ 33 స్థానాలు గెలుచుకుంది) బీజేపీ 16 స్థానాలకు పడిపోయింది. ఓట్ల పరంగా చూస్తే మూడు దశాబ్దాల తర్వాత తొలిసారిగా ఈ ప్రాంతంలో కాంగ్రెస్‌కు 40 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి.

మైసూర్-కర్ణాటక
ఇది రాష్ట్రంలో అతిపెద్ద ప్రాంతం. ఈ ప్రాంతంలోనే అత్యధిక నియోజకవర్గాలు ఉంటాయి. పైగా జేడీఎస్ ఏర్పడినప్పటి నుంచి ఆ పార్టీకి ఈ ప్రాంతం పునాదిగా ఉంది. రాష్ట్రంలో ఆ పార్టీకి ఆదరణ ఉందంటే, అది కేవలం మైసూర్ ప్రాంతంలోనే. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఇక్కడ జెడిఎస్ అగ్రగామిగా నిలిచింది. కానీ ఈ ఎన్నికల్లో మొదటిసారి ఆ స్థానాన్ని కాంగ్రెస్ ఆక్రమించింది. ఈ ప్రాంతంలో 64 అసెంబ్లీ స్థానాలకు గానూ కాంగ్రెస్ 42 శాతం ఓట్లను కైవసం చేసుకుని 43 స్థానాలను గెలుచుకుంది. ఇక జేడీ(ఎస్) 26 శాతం ఓట్లతో 14 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. ఈ ప్రాంతంలో జేడీఎస్ తొమ్మిది శాతం ఓట్లను కోల్పోయింది (రాష్ట్రవ్యాప్తంగా 5 శాతం ఓట్లు కోల్పోయింది). ఈ ప్రాంతంలో బీజేపీకి రెండు శాతం ఓట్లు వచ్చినప్పటికీ 11 సీట్లు తగ్గాయి.