3 రాజధానులు.. శాసనమండలి రద్దు : జగన్‌ను నడిపిస్తున్న అదృశ్య శక్తి ఏంటి..?

అనుకున్నంతా జరిగింది. ఏపీ శాసనమండలి రద్దుకు అసెంబ్లీ తీర్మానం జరిగిపోయింది. సీఎం మొండిగా అడుగులు వేస్తున్నారు. ఇక్కడే అందరికీ ఒక అనుమానం మొదలైంది. ఈ

  • Published By: veegamteam ,Published On : January 29, 2020 / 02:41 PM IST
3 రాజధానులు.. శాసనమండలి రద్దు : జగన్‌ను నడిపిస్తున్న అదృశ్య శక్తి ఏంటి..?

అనుకున్నంతా జరిగింది. ఏపీ శాసనమండలి రద్దుకు అసెంబ్లీ తీర్మానం జరిగిపోయింది. సీఎం మొండిగా అడుగులు వేస్తున్నారు. ఇక్కడే అందరికీ ఒక అనుమానం మొదలైంది. ఈ

అనుకున్నంతా జరిగింది. ఏపీ శాసనమండలి రద్దుకు అసెంబ్లీ తీర్మానం జరిగిపోయింది. సీఎం మొండిగా అడుగులు వేస్తున్నారు. ఇక్కడే అందరికీ ఒక అనుమానం మొదలైంది. ఈ దూకుడు వెనుక అదృశ్య హస్తం ఉందనేదే ఆ అనుమానం. రాబోయే కాలంలో మండలిలో తమ పార్టీకి ఆధిక్యం దక్కుతుందని తెలిసినా.. పార్లమెంటు ఆమోదం పొందకుండా మండలి రద్దు కాదనే విషయంపై అంచనాలున్నా.. వెనుకంజ వేయలేదు. ఇంతకీ జగన్‌ను నడిపిస్తోన్న అదృశ్య శక్తి ఏంటి? చివరి వరకూ ఆ శక్తితోనే ముందుకు వెళ్లబోతున్నారా?

మండలి రద్దు వెనుక బీజేపీ మద్దతు..?
ఏపీ సీఎం జగన్ అంతా తాను అనుకున్నట్టుగానే చేసుకుంటూ పోతున్నారు. ఏపీ శాసనమండలిలో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపించడంపై ఆయన ఆగ్రహించారు. మండలి రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చేశారు. అసెంబ్లీలో మండలి రద్దు కోసం తీర్మానాన్ని ఆమోదింపజేసుకున్నారు. ఏ విషయంలోనూ జగన్‌ వెనుకంజ వేయకుండా ముందుకు సాగిపోతున్నారు. ఇదంతా చూస్తున్న జనాలకు ఎక్కడో ఏవో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జగన్‌ మరీ ఇంత దూకుడుగా ముందుకెళ్తున్నారంటే దీని వెనుక ఏదో మతలబు ఉందని చెవులు కొరుక్కుంటున్నారు. తప్పకుండా కేంద్రంలోని బీజేపీ మద్దతు ఉండే ఉంటుందని అంటున్నారు. లేకుంటే మరీ ఇంత మొండిగా ముందడుగు వేయబోరని లెక్కలేస్తున్నారు.

3 నెలల ముందే బీజేపీ పెద్దలతో జగన్ చర్చలు..?
నిజానికి మండలి రద్దు అంత ఆషామాషీ విషయం కాదు. అంత పెద్ద నిర్ణయం ముందు ఎలాంటి కసరత్తు చెయ్యకుండానే ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారనుకుంటే పొరపడినట్టే. మూడు రాజధానుల ఎపిసోడ్ మొదలైన నాటి నుంచి జగన్ అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకునే నిర్ణయాలు తీసుకుంటున్నారనే విషయం… జాగ్రత్తగా గమనించిన వారికి స్పష్టంగా అర్ధమవుతుందని అంటున్నారు. ఈ నిర్ణయానికి మూడు నెలల ముందే బీజేపీ కేంద్ర పెద్దలతో జగన్ చర్చించారట. ప్రధాని మోదీ, అమిత్ షా తో చర్చించి వారు ముందుకెళ్లు అన్న తర్వాతే మంత్రి బొత్స అమరావతిపై వ్యాఖ్యలు మొదలు పెట్టారట. ఆ తర్వాత అసెంబ్లీలో సీఎం జగన్‌ ప్రకటన వచ్చాయంటున్నారు. అయితే కేంద్ర పెద్దలు కూడా ఊహించని పరిణామం మండలిలో జరిగింది. దీంతో మండలి రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చారంటున్నారు.

పార్లమెంటు ఆమోదానికి రెండేళ్లు పడుతుందన్న ధీమాలో టీడీపీ:
ప్రస్తుతం మండలి రద్దు కోసం అసెంబ్లీ తీర్మానం కేంద్ర ప్రభుత్వానికి చేరిపోయింది. ఇప్పుడు అందరి దృష్టి కూడా ఈ విషయంలో కేంద్రం ఏం చేయబోతోందనే అంశంపైనే ఉంది. శాసనమండలి రద్దు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా… కేంద్రం, పార్లమెంట్ నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. దీనికి ఎలా లేదన్నా రెండేళ్ల సమయం పడుతుందని టీడీపీ నాయకత్వం ధీమాగా ఉంది. అప్పటి వరకు శాసనమండలిలో తమ ఎమ్మెల్సీల్లో చాలా మంది పదవీ విరమణ చేస్తారనే ఉద్దేశంలో టీడీపీ ఉందంట. ఇదే విషయాన్ని టీడీపీ ఎమ్మెల్సీలకు చంద్రబాబు చెప్పారని వార్తలు వచ్చాయి.

బడ్జెట్ సమావేశాల్లోనే పనైపోతుందని జగన్ ధీమా:
మరోపక్క ఈ విషయంలో జగన్ లెక్క మాత్రం వేరుగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. సాధ్యమైనంత తొందరగా ఏపీ శాసనమండలికి సంబంధించిన తీర్మానాన్ని పార్లమెంట్ ఆమోదిస్తుందనే నమ్మకంతో ఉన్నారట. అన్నీ అనుకున్నట్టు జరిగితే రాబోయే బడ్జెట్ సమావేశాల్లోనే ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సీఎం జగన్ ఇంత హఠాత్తుగా ఈ శాసనమండలికి సంబంధించిన బిల్లును రద్దు చేయడం వెనుక అసలు కారణంగా కూడా ఇదేననే ప్రచారం జరుగుతోంది. బీజేపీ తమ నిర్ణయానికి తప్పుకుండా మద్దతు ఇస్తుందనే నమ్మకం ఉందంటున్నారు. 

బీజేపీ ఎమ్మెల్సీలకు పదవులు:
ఈ విషయంలో కేంద్రం నుంచి వైసీపీ ప్రభుత్వానికి స్పష్టమైన హామీ లభించి ఉండొచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. అందుకే మండలి రద్దుపై వైసీపీ సర్కార్ శరవేగంగా ముందుకు సాగిందనే టాక్ వినిపిస్తోంది. ఈ పరిణామం చోటు చేసుకున్న వెంటనే కేంద్ర పెద్దలతో జగన్ సంప్రదింపులు చేశారని సమాచారం. మండలి రద్దు ఒక్కటే ఇప్పుడున్న పరిస్థితుల నుంచి గట్టెక్కిస్తుందని అంటున్నారు. న్యాయపరంగా ఉన్న చిక్కులు కూడా తొలగుతాయని జగన్ చెప్పడం వల్లే… బీజేపీ అంగీకరించిందని చెబుతున్నారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్సీలు నష్టపోతే.. వారికీ రాష్ట్రంలో ఉండే కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే పదవులు ఇచ్చేందుకు అంగీకారానికి వచ్చారట.

చంద్రబాబుకు చెక్‌ పెట్టడమే మోడీ లక్ష్యం:
ఇప్పటికే అమరావతిలో ఉద్యమం ఉధృతం అయినట్టుగా కేంద్ర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండటంలో సమస్య మరింత జటిలం కాకుండా చంద్రబాబుకి చెక్ పెట్టడమే లక్ష్యంగా ప్రధాని మోదీ.. జగన్ నిర్ణయానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీలైనంత త్వరగా మండలి రద్దు ప్రక్రియ కేంద్రం ప్రారంభిస్తుందని టాక్‌. మొత్తానికి ఏపీ శాసనమండలి రద్దు విషయంలో సీఎం జగన్ తరహాలోనే కేంద్రం కూడా వేగంగా ముందుకు సాగుతుందా? లేదా అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.