కోట్లను ఢీ కొట్టేదెవరు: అభ్యర్ధి వేటలో వైసీపీ

  • Published By: chvmurthy ,Published On : February 2, 2019 / 02:51 PM IST
కోట్లను ఢీ కొట్టేదెవరు: అభ్యర్ధి వేటలో వైసీపీ

న్నికల సమరానికి కర్నూలు పార్లమెంట్ సిద్ధమైంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని రాజకీయ పార్టీలు బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నాయి. తాజాగా కోట్ల టీడీపీలో చేరుతున్నారన్న వార్తల నేపథ్యంలో.. గెలుపు గుర్రం కోసం వైసీపీ వేట మొదలు పెట్టింది. 

దేశ రాజకీయ చరిత్రలో కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. 1952లో కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంగా ఏర్పాటైంది. 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడటంతో కర్నూలు నియోజకవర్గం ప్రాధాన్యం మరింత పెరిగింది. 1952 నుండి 2014 వరకు 16 సార్లు జరిగిన ఎన్నికల్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి 6 సార్లు లోకసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. కేంద్రమంత్రిగా పలు పదవులను అధిరోహించారు. ముఖ్యమంత్రి పదవిని కూడా అలంకరించారు.

2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కర్నూలు లోక్‌సభ పరిధిలోకి మంత్రాలయం, కర్నూలు, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోని, ఆలూరు నియోజకవర్గాలు వచ్చి చేరాయి.2004, 2009లో జరిగిన కర్నూలు లోక్‌సభ ఎన్నికల్లో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. 2009లో గెలుపొందిన కోట్ల కేంద్ర మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కోట్ల వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుకపై ఓడిపొయారు. అప్పట్లో జరిగిన రాజకీయ పరిణామాల వల్ల ఎంపి బుట్టా రేణుక వైసీపీని వీడి టీడీపిలో చేరారు.

కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గంలో కోట్ల కుటుంబానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న కోట్ల కుటుంబం పార్టీని వీడేందుకు సిద్ధమైంది. తాజాగా జరిగిన రాజకీయ పరిణామాలతో కోట్ల సైకిల్ ఎక్కబోతున్నట్టు తెలుస్తోంది. దాదాపు కర్నూలు లోక్‌సభకు టీడీపీ తరపున పోటీ చేసేందుకు రెడీ అయ్యారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరుకు దిగాలని కాంగ్రెస్ కోర్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని కోట్ల వ్యతిరేకించారు. ఈ మేరకు కార్యకర్తలు, ముఖ్యనేతలతో విడివిడిగా సమావేశమై వారి అభిప్రాయాలతోనే టీడీపీలో చేరుతున్నట్లు కోట్ల వర్గీయులు చెబుతున్నారు.

2014 ఎన్నికల్లో కర్నూలు పార్లమెంట్‌ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంది. 2014లో వైసీపీ నుంచి ఎంపీగా గెలుపొందిన బుట్టా రేణుక ఆ తర్వాత టీడీపీలో చేరారు. దీంతో ఈ ఎన్నికల్లో కూడా ఎలాగైనా కర్నూలు స్థానాన్ని వశం చేసుకునేందుకు వైసీపీ వ్యూహాలు పన్నుతోంది. అటు.. కోట్ల టీడీపీకి వెళ్తుండడం.. వైసీపీ నుంచి గెలిచిన బుట్టా రేణుక ఇప్పటికే టీడీపీలోకి వెళ్లిపోవడంతో ఆ పార్టీకి బలమైన అభ్యర్థి అవసరముంది. కోట్లను ఢీ కొట్టగల బలమైన అభ్యర్థి కోసం అన్వేషణ మొదలు పెట్టింది.

కర్నూలు పార్లమెంట్‌లో బీసీ వర్గాల ఓటు బ్యాంకు అధికంగా ఉండడంతో బీసీ వర్గానికి చెందిన బీవై రామయ్యను ఎంపీగా బరిలో దింపేందుకు జగన్ సుముఖంగా ఉన్నట్లు శ్రేణులు చెబుతున్నారు.2014లో ఎంపీగా గెలిచిన బుట్టా రేణుకకు ఈసారి సీటు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. కోట్ల చేరికతో బుట్టా రేణుక ఎమ్మిగనూరు లేదా పాణ్యం అసెంబ్లీ నుంచి పోటీ చేయవచ్చని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. కోట్ల టీడీపీలోకి వస్తుండడంతో కర్నూలు జిల్లా రాజకీయ సమీకరణాలు ఎవరికీ అంతు చిక్కడం లేదు.