బొబ్బిలి కోటలో పాగావేసేదెవరు ? 

ఎన్నికలు సమీపిస్తుండటంతో విజయనగరం జిల్లాలో రాజకీయాలు జోరందుకున్నాయి.

  • Published By: veegamteam ,Published On : January 19, 2019 / 02:07 PM IST
బొబ్బిలి కోటలో పాగావేసేదెవరు ? 

ఎన్నికలు సమీపిస్తుండటంతో విజయనగరం జిల్లాలో రాజకీయాలు జోరందుకున్నాయి.

విజయనగరం : బొబ్బిలి అంటే .. రాజులు, రాజ్యాలు, యుద్ధాలే కాదు.. రాజకీయంగానూ ప్రత్యేకతను దక్కించుకుంది. ఇక్కడి రాజవంశీకుల పాలన నాటి నుంచి నేటి వరకూ ఎదురులేకుండా సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో బొబ్బిలి రాజులు తమ విజయపరంపరను కొనసాగిస్తారా.. రాజుల పాలనకు చరమగీతం పాడాలన్న బొత్స ఆశయం నెరవేరుతుందా.. అసలు బొబ్బిలి కోటలో పాగావేసేదెవరు ? పలాయనం చిత్తగించేదెవరు ?

ఎన్నికలు సమీపిస్తుండటంతో విజయనగరం జిల్లాలో రాజకీయాలు జోరందుకున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు గెలుపే లక్ష్యంగా పావులుకదుపుతున్నాయి. ముఖ్యంగా బొబ్బిలి కేంద్రంగా రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. రాష్ట్ర భూగర్భ గనుల శాఖా మంత్రి సుజయ కృష్ణ రంగారావు ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బొబ్బిలి మున్సిపాలిటీతో పాటు రామభద్రపురం, బాడంగి, తెర్లాం మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఇక్కడ ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీల మధ్యే ఉండనుంది. ఇక్కడ విజయపరంపరను కొనసాగించేందుకు ఓపక్క బొబ్బిలి రాజులు ఉవ్విళ్లూరుతుండగా..బొబ్బిలి కోటపై ఈసారి ఎలాగైనా వైసీపీ జెండా రెపరెపలాడించాలని .. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యూహాలు రచిస్తున్నారు.  

ఒకప్పుడు బొబ్బిలి రాజకుటుంబీకులు, బొత్స కుటుంబం ఒక గూటి పక్షులే. ఈ రెండు కుటుంబాలు సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్‌లో కొనసాగాయి. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, బొత్స సత్యనారాయణకి మంత్రి పదవి లభించడంతో .. జిల్లా రాజకీయాల్లో బొత్స ప్రాభవం ప్రారంభమైంది. జిల్లాలో తిరుగులేని నాయకుడుగా ఎదుగుతూ రాష్ట్రంలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను తెచ్చుకున్నారు. మరోపక్క బొబ్బిలి రాజులు సుజయ కృష్ణ రంగారావు, ఆయన సోదరుడు బేబీనాయనలు కూడా రాజకీయంగా తమ ప్రాంతంలో మంచి పట్టుసాధించారు. 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన సుజయ రంగారావుకి.. బొత్సకి మధ్య రాజకీయ విభేదాలతో దూరం పెరిగింది. ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నప్పటికీ.. కడుపులో కత్తులు పెట్టుకుని తిరిగేవారు. ముఖ్యంగా బొత్స మేనల్లుడు చిన్న శ్రీను షాడో పాలన బొబ్బిలి రాజులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. దీంతో బొత్సకి…బొబ్బిలి రాజులకు మధ్య క్రమంగా రాజకీయ వైరం పెరుగుతూ వచ్చింది. 2014 ఎన్నికల్లో బొత్స కుటుంబీకులు ఘోర పరాజయం పాలైనా… బొబ్బిలి రాజు రంగారావు మాత్రం మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే, కొన్నాళ్లకు బొత్స కుటుంబీకులు కూడా వైసీపీలోకి రావడం.. అదే సమయంలో టీడీపీ నుంచి మంత్రి పదవి ఆఫర్ రావడంతో.. రంగారావు టీడీపీలోకి వెళ్లిపోయారు. అయితే బొబ్బిలి స్ధానం దక్కించుకోవాలని ఇద్దరు నేతలు  పోటీ పోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. 

బొబ్బిలి రాజులను రాజకీయంగా దెబ్బతీయడం అంత ఈజీ కాదు. రంగారావుపై పోటీ చేసే వ్యక్తి బలమైన నాయకుడై ఉండాలి. దీంతో మాజీ ప్రభుత్వ విప్, సీనియర్ నాయకుడు .. శంబంగి వెంకట చిన అప్పలనాయుడును వైసీపీ నేతలు తెరపైకి తెచ్చారు. మొదట టీడీపీలో ఉన్న ఆయన.. ఆ తర్వాత కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయారు. అయితే.. బొత్స తన రాజకీయ వ్యూహంతో శంబంగిని వైసీపీలోకి తీసుకువచ్చారు. కొప్పలవెలమ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న బొబ్బిలి నియోజకవర్గంలో అదే సామాజిక వర్గానికి చెందిన అప్పలనాయుడును బరిలోకి దించడం ద్వారా బొబ్బిలి రాజుకు చెక్ పెట్టొచ్చన్న వ్యూహంలో వైసీపీ నేతలు ఉన్నారు. అప్పలనాయుడు సామాజికవర్గ పరంగానే కాకుండా, స్థానికంగా కూడా మంచి పట్టు ఉన్న నేత. దీనికితోడు జగన్ పాదయాత్ర ఆ నియోజకవర్గం వైసీపీ కేడర్‌లో నూతనోత్సాహం నింపింది. మంత్రి రంగారావుపై జగన్ నేరుగా చేసిన విమర్శలు, ఆరోపణలు కొన్ని రోజుల పాటు చర్చకు దారితీశాయి. ప్రస్తుత రాజకీయ పరిణామాలతో ఈసారి బొబ్బిలి కోటపై వైసీపీ జెండా ఎగరడం ఖాయమంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

వచ్చే ఎన్నికల్లో కూడా బొబ్బిలి నుంచి తిరిగి సుజయ కృష్ణ రంగారావుకే టికెట్టు వస్తుందన్న ప్రచారం ఇప్పటికే ఊపందుకుంది. అయితే ఎమ్మెల్యేగా ఉన్నప్పటి కన్నా.. మంత్రి పదవి వచ్చిన తర్వాత రంగారావు  ప్రజలకు దూరమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రి దృష్టికి ఏ విషయం తీసుకువెళ్లాలన్నా… ఆయన సోదరుడు బేబీనాయనతోనే సంప్రదించాలన్న వాదన ఉంది. మరోపక్క పార్టీ నేతల్లో తలెత్తున్న అంతర్గత విభేదాలతో పాటు, తమ పనులు కావడం లేదన్న నిరాశ టీడీపీ కేడర్ లో వ్యక్తమవుతోంది. గతంలో ఈ నియోజకవర్గం నుంచి టికెట్టు ఆశించి, భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు వర్గం కూడా తరచూ బొబ్బిలి రాజుల పాలనపై అలకబూనుతుండటం మామూలైంది. ఇక మంత్రి సుజయ రంగారావు, సోదరుడు బేబీనాయనల మధ్య కూడా రాజకీయ విభేదాలు తలెత్తాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోపక్క మున్సిపాలిటీలో టీడీపీ రెండు వర్గాలుగా విడిపోవడం రంగారావుకి కొంత ఇబ్బందికర పరిస్థితిని తెచ్చిపెట్టింది. ఈ పరిస్థితుల్లో రంగారావు గెలుపుపై కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే రాజ వంశీకులు కావడం, ఆర్థికంగా బలమైన కుటుంబీకులు కావడంతో .. ఎన్నికల సమయానికి అంతా చక్కబడుతుందన్న వాదనలూ వినిపిస్తున్నాయి.  

చారిత్రకంగానే కాదు… రాజకీయంగానూ రాజుల పట్టు బలంగా ఉన్న బొబ్బిలి కోటను కైవసం చేసుకోవడం .. అంత ఆషామాషీ కాదన్న అభిప్రాయాన్ని .. రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో బొబ్బిలి కోట రాజుల కంచుకోటగానే ఉంటందా .. లేక వైసీపీ వశమవుతుందా అనేది వేచి చూడాలి.