మున్సిపోల్స్‌పై ఆ నలుగురు దృష్టి పెట్టలేదంట!

  • Published By: sreehari ,Published On : January 24, 2020 / 02:40 PM IST
మున్సిపోల్స్‌పై ఆ నలుగురు దృష్టి పెట్టలేదంట!

తెలంగాణలో ఏ ఎన్నిక జరిగినా టీఆర్ఎస్‌ పార్టీ తరఫున ఆ నలుగురు కీలక పాత్ర పోషించాల్సిందే. ప్రతి ఎన్నికలోనూ వారిలో ఎవరో ఒకరు చురుకైన పాత్ర పోషించడం ఇప్పటి వరకూ చూశాం. టీఆర్ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, మాజీ ఎంపీ కవిత… ఈ నలుగురి ప్రచారాలు లేకుండా తెలంగాణలో ఏ ఎన్నిక కూడా జరగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా వీరు నలుగురు ప్రచారాలు నిర్వహించి, పార్టీని అధికారంలోకి తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించిన సందర్భాలే ఉన్నాయి. కానీ, తొలిసారి మున్సిపల్‌ ఎన్నికల్లో మాత్రం ఈ నలుగురి పాత్ర అంతగా కనిపించలేదంటున్నారు పార్టీ కార్యకర్తలు. 

కేసీఆర్, కవిత ఎక్కడా? 
నిజానికి అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ అధినేతగా కేసీఆర్‌ రాష్ట్రాన్ని చుట్టేసి వచ్చారు. పలు సభల్లో పాల్గొని అభ్యర్థుల విజయానికి బాటలు వేశారు. అలానే ఆయన తనయుడు కేటీఆర్, అల్లుడు హరీశ్‌రావు కూడా పలు నియోజకవర్గాల్లో సభలు నిర్వహించారు. తమ సొంత నియోజకవర్గాల్లో మాత్రమే కాకుండా ఇతర అభ్యర్థుల విజయానికి కూడా కృషి చేశారు. వ్యూహాలు అమలు చేశారు. కేసీఆర్‌ కుమార్తె కవిత కూడా అదే తీరుగా కొన్ని నియోజకవర్గాల్లో పర్యటించి ప్రసంగాలు చేశారు. కానీ, తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం కేసీఆర్‌, కవిత ఎక్కడా కనిపించలేదంటున్నారు. కేటీఆర్‌ ఈసారి సిరిసిల్ల రాజన్న జిల్లాకే పరిమితం అయ్యారు. అలాగే హరీశ్‌రావు సిద్ధిపేట మీదనే దృష్టి సారించారు.

మంత్రులకే ఎన్నికల బాధ్యతలు : 
సీఎం కేసీఆర్‌, మాజీ ఎంపీ కవిత మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఈ ఎన్నికలపై అంతగా దృష్టి పెట్టలేదంటున్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపోటముల బాధ్యతలను పూర్తిగా ఆయా మంత్రులు, ఎమ్మెల్యేలకే టీఆర్ఎస్‌ అధిష్టానం అప్పగించింది. మున్సిపల్‌ ఎన్నికల్లో కేసీఆర్‌ స్థాయి వ్యక్తి ప్రచారం చేయాల్సిన అవసరం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. కేసీఆర్‌ కాకపోతే కనీసం హరీశ్‌, కేటీఆర్‌ అయినా చురుకుగా ప్రచారం చేసి ఉండాల్సింది కదా అని కొందరు అంటున్నారు. కానీ, మంత్రులకు బాధ్యతలు అప్పగించిన తర్వాత ఆ అవసరం లేదని చెబుతున్నారు. మొత్తం మీద ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ ఎంతవరకూ సక్సెస్‌ అయ్యిందో.. మంత్రులు తమ బాధ్యతలు నిర్వర్తించడంలో విజయం సాధించారో లేదో తెలియాలంటే 25వ తేదీ వరకూ ఆగాల్సిందే అని జనాలు అనుకుంటున్నారు.