అక్కడ కేజ్రీ సక్సెస్..ఇక్కడ జేపీ ఫెయిల్..ఎందుకు

  • Published By: madhu ,Published On : February 13, 2020 / 08:51 PM IST
అక్కడ కేజ్రీ సక్సెస్..ఇక్కడ జేపీ ఫెయిల్..ఎందుకు

ఢిల్లీలో మూడోసారి అధికార పీఠంపై ఆప్ కూర్చోబోతోంది. సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొత్తం 70 నియోజకవర్గాలున్న ఢిల్లీలో ఆప్ 62 స్థానాల్లో విజయదుందుభి మ్రోగించింది. అనతికాలంలోనే ప్రజల మన్ననలను చూరగొంది ఆప్ పార్టీ. ఈ క్రమంలో అందరి దృష్టి లోక్ సత్తా పార్టీపై పడింది.

ఉమ్మడి ఏపీ రాష్ట్రం ఉన్న సమయంలో లోక్ సత్తా పార్టీని జయప్రకాష్ నారాయణ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆప్..లోక్ సత్తా విధానాలు, సిద్ధాంతాలు ఒక్కటే. కానీ లోక్ సత్తా మాత్రం సక్సెస్ కాలేకపోయింది. కేజ్రీవాల్, జయప్రకాష్ నారాయణలు ఇద్దరూ విద్యావంతులే. కానీ..రాజకీయంలో కే్జ్రీవాల్ దూసుకపోయారు. 

జయప్రకాష్ నారాయణ..1996లో ఉద్యమాన్ని ప్రారంభించేందుకు..ఐఏఎస్‌ను వదులుకున్నారు. ఇక్కడ కేజ్రీవాల్ కూడా ఐఆర్ఎస్‌కు స్వచ్చంద పదవీవిరమణ చేసి రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. పరివర్తన్ పేరిట కేజ్రీ ముందుకు రాగా..అవినీతికి వ్యతిరేకంగా ఎప్డీఆర్‌ను స్థాపించారు జేపీ. విద్య, వైద్యం, వ్యవసాయం, సాధికారత, సుపరిపాలన, ఎన్నికల సంస్కరణలు, ముఖ్యరంగాలపై వీరు దృష్టి పెట్టాయి. ప్రజాస్వామ్య సంస్కరణలను తీసుకొచ్చేందుకు 1996లో లోక్ సత్తాను జేపీ స్థాపించారు. దీనిని తర్వాత..రాజకీయ పార్టీగా మార్చేశారు. అదే విధంగా కేజ్రీవాల్ కూడా..ఆప్ పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళ్లారు. 

అవినీతి తదితర అంశాలపై అవగాహన ఉన్న వీరిద్దరిని సామాన్య, మధ్య తరగతి, విద్యావంతులు మెచ్చుకున్నారు. కానీ ఇక్కడే వేరే విధమైన పరిస్థితులు ఉన్నాయి. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించిన కేజ్రీ..2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రవేశించి విజయం సాధించారు. కేవలం 49 రోజుల పాటు అధికారంలో ఆప్ కొనసాగింది. 2012 నవంబర్‌లో ఆమ్ ఆద్మీ పేరిట పార్టీని స్థాపించారు.

తొలిసారి ముఖ్యమంత్రిగా 49 రోజుల పాటు పదవిలో కొనసాగారు కేజ్రీ. జనలోక్ పాల్ బిల్లుకు ఆమోదం లభించకపోవడంతో ఆయన రాజీనామా చేశారు. తర్వాత  2015 ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 67 స్థానాల్లో విజయదుంధుబి మ్రోగించింది. రెండోసారి సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. 

ఇక్కడ…ఐఏఎస్ అధికారి అయిన..జేపీకి ప్రజల మద్దతు బాగానే ఉంది. చదువుకున్న మధ్య తరగతి, యువత ఆయన వైపు చూశారు. కానీ కేజ్రీ చేసిన విధంగా ఈయన చేయలేదనే అభిప్రాయాలు వినిపిస్తుంటాయి. పోరాటాలు చేయకపోవడం తదితర కారణాలు చూపిస్తుంటారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా జేపీకి వ్యతిరేకంగా ఓ వర్గం ఏర్పడింది. క్రమంగా..ఇతర పార్టీల నాయకుల మాదిరిగానే మారిపోయారనే అభిప్రాయాలు బలపడుతూ వచ్చింది. 

ఎన్నికల సంస్కరణలు, ఆర్టీఐ చట్టం, తదితర విషయాలపై అనర్గళంగా చెప్పగలిగే జేపీ..ఒక కాలమిస్ట్ కూడా. కానీ…దీనిని రాజకీయంగా మలుచుకోవడంలో సఫలం కాలేకపోయారు. రాజకీయాలను వ్యతిరేకిస్తూ..జేపీ వచ్చారు. బంద్‌లు, నిరహార దీక్షలు, ధర్నాలు సామాన్య ప్రజలకు అసౌకర్యాన్ని కలిగిస్తాయనే అభిప్రాయం జేపీలో ఉంది. ఆప్ పార్టీని స్థాపించిన కేజ్రీ..బలమైన కేడర్‌ను రూపొందించుకోలిగారు. కానీ..జేపీ..సైనికులు లేకుండానే..కమాండర్‌గా నిలిచారు. 

సామాన్య పార్టీగా ఏర్పడిన ఆప్…పంజాబ్, హర్యానా వంటి ఇతర రాష్ట్రాల్లోకి విస్తరించింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో జాతీయంగా వెళ్లడానికి ప్రయత్నించి విఫలం చెందింది. అనంతరం దీనిపై సుదీర్ఘంగా అధ్యయనం చేసింది. తదనంతరం కేవలం ఢిల్లీపైనే ఆప్ ఫోకస్ పెట్టింది.  సొంత రాష్ట్రంలోనే జేపీ..(లోక్ సత్తా) ఉనికిని కాపాడుకొనేందుకు ప్రయత్నించి విఫలం చెందారు. ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు 2009 ఎన్నికల్లో జేపీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

కానీ మరెక్కడా విజయం సాధించలేకపోయింది ఆప్ పార్టీ. పోటీ చేసిన 246 సీట్లలో కేవలం 1.80 శాతం ఓట్లను మాత్రమే సాధిచగలిగింది. 2014లో జేపీ మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విఫలం చెందారు. మూడో స్థానంలో నిలిచారు. పార్టీని స్థాపించిన కొద్ది రోజుల అనంతరం రాజకీయాలకు లోక్ సత్తా దూరంగా ఉంటుందని జేపీ ప్రకటించారు. ఎన్నికల్లో డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తోందని..విమర్శించారు. 

ఢిల్లీ జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, ఉచిత విద్యుత్, తాగునీరు వంటివి ప్రజలను అట్రాక్ట్ చేశాయి. ఓటర్లను ఆకట్టుకొనే విధంగా ఆప్ వ్యూహాలు రచించింది. ఇక్కడ జేపీ దీనికి వ్యతిరేకం. ప్రజలను ఆకర్షించేలా ప్రయత్నాలు చేయడం వ్యతిరేకమని జేపీ స్పష్టంగా చెప్పారు.

రాజకీయ నాయకులు అంటే..24×7 ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారి సమస్యలను పరిష్కరించే విధంగా చేయాలి..కానీ జేపీ దీనికి వ్యతిరేకంగా ఉన్నారని దోసనపూడి సోమసుందర్ వెల్లడించారు. అంతేగాకుండా…జేపీ పార్టీ సంస్థాగత నిర్మాణానికి, విస్తృత రాజకీయాలు చేయలేదన్నారు.

ప్రధానంగా జేపీ సంస్కరణలపై దృష్టి సారించారని, సమర్థవంతమైన యంత్రాంగం లేదన్నారు. ఓ వైపు కాంగ్రెస్, మరోవైపు టీడీపీ పార్టీలున్నాయని, ప్రత్యామ్నాయాన్ని ప్రజలు చూడలేకపోవడం కూడా ఒక కారణమని సందీప్ అనే వ్యక్తి వెల్లడించారు. అవినీతి, ఎన్నికలు, పరిపాలనలో సంస్కరణలు చేస్తామని వెల్లడించిన జేపీకి..పట్టణ ఓటర్లు ఆకర్షితులయ్యారని, కానీ..ఎన్టీరామారావు, వైఎస్ రాజశేఖరరెడ్డిలాంటి బలమైన ప్రజాకర్షక నేతలు ఉండడంతో చాలా మంది ప్రజలు వీరికే అట్రాక్ట్ అయ్యారన్నారు. 

2009లో వైఎస్ మరణం అనంతరం టీఆర్ఎస్ పార్టీ పెట్టి..కేసీఆర్ చేసిన ఉద్యమంతో జేపీ రాజకీయంగా ఉనికిని కోల్పోయారని, చాలా తక్కువ మంది లోక్ సత్తా తరపున ఉన్నారన్నారు. ప్రస్తుతం కేజ్రీవాల్ గెలుపుతో తాము ఒక పాఠం నేర్చుకోవాలని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో జేపీ వ్యాఖ్యానించారు.