వదిలేస్తారా? వేటు వేస్తారా? స్థానిక ఎన్నికల్లో గీత దాటిన నేతలను జగన్ ఏం చేస్తారు

ప్రాంతీయ పార్టీలంటే అధినేత మాటే శాసనం.. అధినేత చెప్పిందే ఫైనల్‌. ఆ మాటలను పెడచెవిన పెట్టే సాహసం పార్టీలో నేతలు చేయరు. కానీ... ఏపీలో మాత్రం ఆ అధినేత ఆదేశాలను

  • Published By: veegamteam ,Published On : March 21, 2020 / 06:29 AM IST
వదిలేస్తారా? వేటు వేస్తారా? స్థానిక ఎన్నికల్లో గీత దాటిన నేతలను జగన్ ఏం చేస్తారు

ప్రాంతీయ పార్టీలంటే అధినేత మాటే శాసనం.. అధినేత చెప్పిందే ఫైనల్‌. ఆ మాటలను పెడచెవిన పెట్టే సాహసం పార్టీలో నేతలు చేయరు. కానీ… ఏపీలో మాత్రం ఆ అధినేత ఆదేశాలను

ప్రాంతీయ పార్టీలంటే అధినేత మాటే శాసనం.. అధినేత చెప్పిందే ఫైనల్‌. ఆ మాటలను పెడచెవిన పెట్టే సాహసం పార్టీలో నేతలు చేయరు. కానీ… ఏపీలో మాత్రం ఆ అధినేత ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. స్థానిక సమరంలో బంధుగణాన్ని పోటీకి దింపవద్దని స్పష్టం చేస్తే.. నువ్వు చెప్తే మేం చేయాలా అన్నట్టుగా బంధువులను, దగ్గర వారినీ రంగంలోకి దించేశారు. మరి తన మాటను బేఖాతరు చేసిన నేతలను అధినేత ఏం చేయబోతున్నారు? 

జగన్‌ మాటలను పట్టించుకోని మంత్రులు, ఎమ్మెల్యేలు:
వైసీపీ అంటే జగన్‌.. జగన్‌ అంటే వైసీపీ.. పార్టీలో ఆయన మాటే శాసనం. ఆయన చెప్పిన దానిని తూచ తప్పకుండా పాటించాల్సిందే. జగన్‌ మాటను జవదాటే సాహసం ఎవరూ చేయరు. అందుకే పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఎవరూ ఎదురు చెప్పరు. కానీ స్థానిక సంస్థ ఎన్నికల నేపథ్యంలో మాత్రం సీఎం జగన్ మాటను మంత్రులు లెక్క చేయడం లేదంట. జగన్ చెప్పిన మాటలను పక్కన పెట్టేసి మంత్రులు రాజకీయం చేస్తున్నారని అంటున్నారు. ఏపీ ముఖ్యమంత్రి అయ్యాక, కాక ముందు కూడా పార్టీలో జగన్ నిర్ణయమే ఫైనల్. అదే వైఖరి ఇప్పుడు కూడా కొనసాగుతోంది. కాకపోతే స్థానిక ఎన్నికల సందర్భంగా జగన్ మాటను మంత్రులు కొంచెం పక్కన పెట్టి వ్యవహారం నడిపిస్తున్నారట. అదేమిటంటే ఎన్నికల్లో కుటుంబ సభ్యులకు అవకాశం వద్దని జగన్ ఆదేశించారు. కానీ, దానిని మంత్రులు పట్టించుకోవడం లేదు. 

బంధువులను ఎన్నికల బరిలోకి దించిన మంత్రులు, ఎమ్మెల్యేలు:
జగన్ చేసిన హెచ్చరికల్ని మంత్రులు పట్టించుకోలేదని తాజా పరిణామాలు చూస్తుంటే తెలుస్తోంది. ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జులు, కీలక నాయకుల కుటుంబ సభ్యులు, బంధువులను ఎవరూ స్థానిక ఎన్నికల బరిలో నిలపవద్దని జగన్ ఆదేశించారు. ఒకవేళ అలా నిలిచిన వారికి బీ ఫాంలు ఇవ్వొద్దని తేల్చి చెప్పారు. అయితే వాటిని ఎమ్మెల్యేలు, మంత్రులు ధిక్కరించి తమ వారికి పదవులు ఇప్పించుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ముఖ్యంగా విశాఖపట్టణంతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీ తరఫున మంత్రులు, ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు, బంధువులు పోటీ చేస్తున్నారు. దీన్ని పార్టీ గుర్తించినట్లు సమాచారం. 

విజయనగరంలో కార్పొరేటర్లుగా కోలగట్ల కుమార్తె, బొత్స అల్లుడు:
శ్రీకాకుళం జిల్లా దూసి ఎంపీటీసీ సభ్యురాలిగా స్పీకర్ తమ్మినేని సీతారాం బంధువు తమ్మినేని శారద బరిలో నిలిచారు. మంత్రి ధర్మాన కృష్ణదాస్ తన కుమారుడు కృష్ణ చైత్యనను పోలాకి జడ్పీటీసీ అభ్యర్థిగా నిలబెట్టారు. పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి తన కుమారుడు రెడ్డి శ్రవణ్‌ను జడ్పీటీసీగా బరిలో దించారు. విశాఖ జిల్లాలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అనూహ్యంగా తన కుమార్తె ప్రియాంకతో జీవీఎంసీ 6వ వార్డులో పోటీకి నిలిపారు. విజయనగరం ఎమ్మెల్యే వీరభద్రస్వామి తన కుమార్తెను కార్పొరేటర్‌గా పోటీ చేయిస్తున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ అల్లుడు చిన్న శ్రీను కార్పొరేటర్‌గా నామినేషన్ వేశారు. 

ఇద్దరు కుటుంబ సభ్యులను పోటీలో పెట్టిన గాజువాక ఎమ్మెల్యే:
శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన దువ్వాడ శ్రీను ఈసారి తన భార్య దువ్వాడ వాణిని స్థానిక ఎన్నికల్లో పోటీకి నిలిపారు. ప్రభుత్వ విప్, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు కుమార్తె ఈర్లె అనురాధ కె.కోటపాడు జడ్పీటీసీ స్థానానికి, కుమారుడు రవి దేవరాపల్లి జడ్పీటీసీకి రెబల్‌గా నామినేషన్ వేశారు. గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తన కుటుంబం నుంచి ఇద్దరిని కార్పొరేటర్లుగా పోటీకి దింపారు. విశాఖ తూర్పు నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల తన తోటికోడలు పద్మతో నామినేషన్‌ వేయించారు. మరికొన్ని స్థానాల్లో కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు, కీలక నాయకుల బంధుమిత్రులు ఎన్నికల బరిలో ఉన్నారు. 

నేతల తీరుతో కార్యకర్తల్లో అయోమయం:
సీఎం జగన్‌ అంత స్పష్టంగా చెప్పినప్పటికీ నేతలెవరూ పట్టించుకోకపోవడం పట్ల కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. పార్టీలోని కీలక వ్యక్తులే జగన్ ఆదేశాలను ధిక్కరించడంతో పార్టీలో అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదంటున్నారు. అయితే ఈ వ్యవహారాన్ని జగన్ గుర్తించారట. నామినేషన్ ఉప సంహరణకు గడువు ఉండడంతో వారితో ఉపసంహరించుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ, అది కూడా జరగలేదు. దీంతో ఈ విధంగా తన మాటను లెక్క చేయని వారిపై చర్యలు తీసుకునే ఆలోచనలో జగన్‌ ఉన్నారని అంటున్నారు. మరి అది ఎంత వరకూ వీలవుతుందో చూడాల్సిందే.

Also Read | ఆయన చంద్రబాబు సమకాలికుడు, ఒకప్పుడు ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పారు, ఇప్పుడు అడ్రస్ వెతుక్కుంటున్నారు