పొలిటికల్ డైలమా : జగన్ పార్టీలోకి బలరాం వెళతారా!

  • Published By: venkaiahnaidu ,Published On : January 21, 2019 / 01:15 PM IST
పొలిటికల్ డైలమా : జగన్ పార్టీలోకి బలరాం వెళతారా!

ఒకప్పుడు ప్రకాశం జిల్లా రాజకీయాలను ఒంటిచేత్తో నడిపించిన నేత. సొంత పార్టీకి జిల్లాలో తిరుగులేని ఆధిపత్యాన్ని అందించిన నాయకుడు. ఇప్పుడు అటా ఇటా.. అంటూ ఎటూ తేల్చుకోలేని స్థితిలో పడ్డారు. వారసుడి రాజకీయ భవిష్యత్తు కోసం ఆరాటం. మరోవైపు గోడ దూకుదామంటే ఇన్నేళ్లు సంపాదించుకున్న ఇమేజ్‌ పోతుందనే భయం. టోటల్‌గా సీనియర్‌ పొలిటీషియన్‌ కరణం బలరామకృష్ణమూర్తి పొలిటికల్ డైలమాలో పడిపోయారు.
 

మాస్ లీడర్ ఇమేజ్ :
ప్రకాశం జిల్లా రాజకీయాలు అనగానే గుర్తుకొచ్చేది కరణం బలరామకృష్ణ మూర్తి. జిల్లాలో ఓ మాస్ లీడర్‌గా ఫాలోయింగ్‌ సంపాదించారు. టీడీపీ జిల్లా నాయకుడిగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు అండగా నిలవడంతో పాటు.. ఎన్టీఆర్ హయాంలో 1992లో జిల్లా పార్టీ అద్యక్షుడిగా భాద్యతలు తీసుకున్నారు.సైకిల్‌ను పరుగులు పెట్టించారు. జిల్లా రాజకీయాలను సింగిల్ హ్యాండ్ తో డీల్ చేశారు. ఇచ్చిన భాద్యతను చిత్తశుద్ధితో నడిపించి 1994 ఎన్నికల్లో టీడీపీకి తిరుగులేని విధంగా 10 స్థానాలను అందించడంతో పాటు ఇద్దరు ఇండిపెండెంట్లను టీడీపీలోకి రప్పించడంలో కీలకపాత్ర పోషించారు. ప్రకాశం జిల్లాను టీడీపీ కంచుకోటగా మార్చారు. 1978లో ఇందిరా కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దంకి శాసనసభ్యుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కరణం తిరుగులేని విజయాలు సాధించడంతో పాటు  అద్దంకి అంటే కరణం.. కరణం అంటే అద్దంకి అనేలా పేరు సంపాదించాడు. 
 

సీటుపై క్లారిటీ లేదు :
2004 ఎన్నికల్లో టీడీపీ తరపున జిల్లాలో ఆయనొక్కరే అద్దంకి నియోజకవర్గం నుంచి విజయం సాధించి.. తానేంటో చాటారు. తర్వాత రాజకీయ పరిణామాలతో 2009 నుంచి కరణం కుటుంబం వరసగా ఓటమి చవిచూస్తూ వస్తోంది. పార్టీలో ఆయన ప్రాధాన్యత తగ్గుతూ వస్తోంది. జిల్లాలో ఒక సింహలా ఎదిగిన కరణం బలరాం.. ప్రస్తుతం పార్టీలో తనకు ఎదురవుతున్న పరిస్థితులను జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకప్పుడు జిల్లాలో సీటు కేటాయింపుల్లో తన మాటే శాసనం. 2019 ఎన్నికల్లో తన కుటుంబం బరిలో నిలిచే సీటు ఏంటో కూడా స్పష్టంగా తెలియని డైలమాలో పడిపోయారు. ఈ పరిణామాలే బలరాం పార్టీ మారుతున్నారనే వార్తలకు కారణం అయ్యింది. గొట్టిపాటి వర్సెస్ కరణం బలరాం కుటుంబాల మధ్య  ఉన్న ప్యాక్షన్ గొడవలతో తరుచూ రోడ్డుకెక్కడంతో.. కరణం ప్రాభవం తగ్గుతూ వచ్చింది. ఇక గొట్టిపాటిపై సానుభూతికి తోడు వైఎస్ గాలి వీయడంతో వరుసగా తిరుగులేని విజయాలు సాదించారు. దీంతో కరణం బలరాం కోటకు బీటలు వారాయి.

బలపడుతున్న దామచర్ల జనార్థన్ :
2012లో ప్రకాశం జిల్లా టీడీపీ బాధ్యతలు తీసుకున్న దామచర్ల జనార్ధన్ క్రమంగా బలపడుతూ వచ్చారు. 2014లో బలరాం కుమారుడు ఓటమి, ఒంగోలు నుంచి దామచర్ల జనార్ధన్ గెలుపుతో పార్టీ రాజకీయాలు కీలక మలుపు తీసుకున్నాయి. పార్టీకి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించటమే కాకుండా.. కష్టకాలంలో నిలబడ్డాడనే పేరును దామచర్ల జనార్ధన్ అధిష్టానం దగ్గర సంపాదించగలిగారు. చంద్రబాబుకి మరింత దగ్గర అయ్యారు. ఇది ఏ స్థాయిలో జరిగింది అంటే.. ఇటీవల సీఎం ప్రకాశం జిల్లా సమీక్ష సమావేశం అంతర్గత చర్చల్లో బలరాంకి పిలుపు లేనంతగా. దీనికితోడు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి గెలిచిన గొట్టిపాటి రవి టీడీపీలోకి రావటంతో కరణం బలరాం కుటుంబానికి మరిన్ని కష్టాలు వచ్చాయి. రాబోయే ఎన్నికల్లో అద్దంకి సీటు దక్కే పరిస్థితులు కూడా లేవు. టీడీపీలోకి వచ్చిన గొట్టిపాటి రవితో.. నిత్యం ఢీ అంటే ఢీ అంటూ బలరాం ఘర్షణకు దిగడంతో పెద్ద రచ్చే జరుగుతుంది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ భారీ ఆఫర్స్ :
కరణం బలరాం పరిస్థితిని గమనిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్.. తనకు అనుకూలంగా మార్చుకోవటానికి వ్యూహాలు రచిస్తోంది. బలరాంని పార్టీలోకి ఆహ్వానించి.. అద్దంకి నియోజకవర్గం నుంచి గొట్టిపాటిపైనే నిలబట్టాలనే స్కెచ్ వేసింది. ఇప్పటికే కరణంతో చర్చలు కూడా జరిపింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆఫర్ పై ఎటూ తేల్చుకోలేని బలరాం.. డైలమాలో ఉన్నారు. టీడీపీలో ఉన్న వాతావరణం వైసీపీలో ఉండదనే ఫీలింగ్ లో ఉన్నారు. ఇప్పటికే జిల్లాలో రాజకీయ ఉద్దండులను వైసీపీలోకి తెప్పించడంలో సక్సెస్‌ అయిన విజయసాయిరెడ్డిని.. రంగంలోకి దింపి కరణం కుటుంబాన్ని ఫ్యాన్ కిందకు తేవాలని భావిస్తొంది. బలరాం కుమారుడు వెంకటేష్ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి వెళ్లటానికే ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కొడుకు దూకుడికి కళ్లెం వేస్తూ వేచిచూసే ధోరణిలో ఉన్నారంట బలరాం. కుమారుడు వెంకటేష్ రాజకీయ భవిష్యత్ కు చంద్రబాబు స్వయంగా హామీ ఇవ్వటంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించటం కష్టం.. ఏమైనా జరగొచ్చు.. బలరాం వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి వెళ్లొచ్చు.. వెళ్లకపోవచ్చు అంటున్నారు అనుచరులు. ఇప్పటికి అయితే క్లారిటీ మిస్సింగ్..