Telangana Congress: కర్ణాటక గాలి తెలంగాణకు వీచేనా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకుంటుందా?

మరికొద్ది రోజుల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. కర్ణాటకలో ఎలా అయితే త్రిముఖ పోరు నడిచిందో, తెలంగాణలోనూ త్రిముఖ పోరే ఉండనుంది. కర్ణాటకలో కాంగ్రెస్ ఎలా అయితే ప్రధాన ప్రతిపక్షపమో, ఇక్కడ కూడా అలాగే ప్రధాన ప్రతిపక్షం

Telangana Congress: కర్ణాటక గాలి తెలంగాణకు వీచేనా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకుంటుందా?

Karnataka Congress: దక్షిణాదిపై చాలా పట్టున్న రాజకీయ పార్టీ కాంగ్రెస్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చాలా కాలం పాటు ఏలింది. 2014కి ముందు వరకు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది. అయితే రాష్ట్ర విభజనతో పరిస్థితులు మారిపోయాయి. విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ మచ్చుకైనా కనిపించడం లేదు. ఇక తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష హోదాకు పరిమితమైన కాంగ్రెస్.. క్రమంగా ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటేనే ఎక్కువ అనే పరిస్థితికి వచ్చింది. తమిళనాడు రాష్ట్రంలో డీఎంకే, ఏడీఎంకే ఎంట్రీతోనే కాంగ్రెస్ కనుమరుగైంది. ఇక కేరళలో ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉంది.

Karnataka Polls: కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ఐదు ప్రధాన కారణాలు ఇవే

ఇవి కాకుండా కర్ణాటకలో నిన్నటి వరకు ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. తాజా ఎన్నికల ఫలితాల్లో హస్తం పార్టీ ఘన విజయం సాధించింది. దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాల్లో ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రభావవంతంగా లేకపోయినప్పటికీ.. తెలంగాణ, కేరళలో ప్రతిపక్ష హోదాలో ఉంది. కర్ణాటకకు ఈ రెండు రాష్ట్రాలు సరిహద్దు రాష్ట్రాలు. తాజాగా కర్ణాటక విజయం కేరళ, తెలంగాణ రాష్ట్రాలపై ఏ విధంగా ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ఇప్పుడున్న ప్రభుత్వాలు వరుసగా రెండుసార్లు గెలిచి అధికారం చేపట్టాయి. పైగా ఈ రెండు రాష్ట్రాల్లో రెండు దఫాలుగా కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాలో కొనసాగుతోంది.

తెలంగాణలో కర్ణాటక గాలి వీచేనా?
తొమ్మిదేళ్ల క్రితం వరకు తెలుగు నేలపై ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రాలో అంతరించే స్థితికి వెళ్లిపోయింది. అయితే ఒక్క తెలంగాణలో మాత్రమే ప్రతిపక్ష హోదాలో నెట్టుకువస్తోంది. అయితే కొంతకాలంగా తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఏమంత బాగోలేదు. ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా పోటీ అధికార బీఆర్ఎస్, బీజేపీ మధ్యగా మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ గెలుపోటముల పోటీ నుంచి తప్పుకుని మూడో పెద్ద పార్టీగా సరిపెట్టుకోవాల్సి వస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీనపడడానికి భిన్న కారణాలు ఉన్నప్పటికీ.. బలం పుంజుకోవడానికి కూడా అన్నే కారణాలు ఉన్నాయి.

Karnataka Election Result 2023: జేడీఎస్‌కు షాకిచ్చిన కన్నడ ఓటర్లు.. కుమారస్వామి ఆశలు గల్లంతు

బూత్ స్థాయి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. అంతే కాకుండా ప్రజల్లో కూడా ఆదరణ ఉంది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తన ప్రభావాన్ని చూపలేకపోతోంది. నాయకుల మధ్య విబేధాలు ప్రధాన కారణం అయితే.. రేవంత్ రెడ్డి నాయకత్వానికి నాయకులందరి మద్దతు లేకపోవడం లాంటి కారణాలు ఉన్నాయి. పైగా కాంగ్రెస్ పార్టీలో గెలిచిన నాయకులు వరుస బెట్టి బీఆర్ఎస్ పార్టీలో చేరుతుండడం, వాటికి అడ్డుకట్ట వేయలేకపోవడం వల్ల ప్రజల్లో ప్రతికూల అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. ఇలాంటి సమస్యల్ని కర్ణాటక కాంగ్రెస్ అధిగమించింది. తెలంగాణ కాంగ్రెస్ సైతం వీటిని పరిష్కరిస్తే మంచి ఫలితాలు వస్తాయని అంటున్నారు.

బొమ్మై, కేసీఆర్ ఒకటేనా?
కర్ణాటకలో ఉన్న ప్రభుత్వం అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయింది. పైగా కర్ణాటక బీజేపీలో నాయకుల మధ్య విబేధాలు పెద్ద ఎత్తున చెలరేగాయి. కానీ తెలంగాణలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. కేసీఆర్ ప్రభుత్వంపై అవినీతి సహా ఇతర అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ.. వాటిని లేవనెత్తి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలో విపక్షాలు విఫలమవుతున్నాయి. కేసీఆర్ నాయకత్వం బలంగా ఉండడంతో పాటు ప్రభుత్వానికి ఉన్న భారీ స్థాయిలో ఎమ్మెల్యేల మద్దతు ఉండడం కూడా దీనికి ప్రధానం కారణం. రాజకీయాలు చేయడంలో, విపక్షాలను ఇరుకున పెట్టడంలో బొమ్మైకి కేసీఆర్‭కి చాలా తేడా ఉంది. బొమ్మై మృదు స్వభావి. కానీ కేసీఆర్ అలా కాదు. ఒకవేళ కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు ప్రభావం తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో వచ్చినప్పటికీ కేసీఆర్‭ను ఎదుర్కోవడం ఇక్కడ పెద్ద సవాల్.

Karnataka Polls: సౌత్ ఇండియా నుంచి బీజేపీ ఔట్..! ‘బీజేపీ ముక్త్ సౌత్ ఇండియా’ అంటూ నెట్టింట హవా

మరికొద్ది రోజుల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. కర్ణాటకలో ఎలా అయితే త్రిముఖ పోరు నడిచిందో, తెలంగాణలోనూ త్రిముఖ పోరే ఉండనుంది. కర్ణాటకలో కాంగ్రెస్ ఎలా అయితే ప్రధాన ప్రతిపక్షపమో, ఇక్కడ కూడా అలాగే ప్రధాన ప్రతిపక్షం. దేశ వ్యాప్తంగా వరుస ఓటములతో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక ఘన విజయం కొత్త ఊపిరి ఊదింది. తెలంగాణలోనూ కర్ణాటక లాంటి ఫలితాలే రిపీట్ అవుతాయని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అంటున్నారు కానీ, అది ఏ మేరకు ప్రభావం చూపిస్తుందో ఎన్నికల్లో తేలుతుంది.