ఎవరి సీటుకి ఎసరు : రాధా టీడీపీలో చేరితే

  • Published By: veegamteam ,Published On : January 21, 2019 / 01:04 PM IST
ఎవరి సీటుకి ఎసరు : రాధా టీడీపీలో చేరితే

విజయవాడ: ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది బెజవాడ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. మాజీ ఎమ్మెల్యే, వంగవీటి రాధా…వైసీపీకి రాజీనామా చేయడంతో ఆ పార్టీకి భారీ షాక్ తగిలినట్లయింది. రాధాకృష్ణ కొంత మంది టీడీపీలో చేరతారంటుంటే…మరి కొందరు జనసేన తీర్థం పుచ్చుకుంటారని అంటున్నారు. ఒకవేళ వంగవీటి…టీడీపీలోకి వస్తే ఆ పార్టీ నేతలు స్వాగతిస్తారా ? ఎవరి సీటుకు ఎసరు పడుతుంది ? టీడీపీ నేతలు ఏమంటున్నారు ?

వైసీపీకి షాక్:
బెజవాడలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. కీలక నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ…వైసీపీకి గుడ్ బై చెప్పడంతో…బెజవాడ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. విజయవాడ సెంట్రల్ స్థానం నుంచి ఇన్‌చార్జ్‌గా తప్పించి…మల్లాది విష్ణును నియమించారు. విజయవాడ సెంట్రల్ సీటు కూడా ఇవ్వమన్నారు. దీంతో మనస్థాపం చెందిన వంగవీటి రాధా…కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. రాధాకృష్ణ వైసీపీని వీడుతున్నారన్న సమాచారం తెలుసుకున్న బొత్స సత్యనారాయణ….రాధా నివాసానికి వెళ్లి మంతనాలు జరిపారు. పార్టీలోనే ఉండాలని…సముచిత స్థానం కల్పిస్తామంటూ బుజ్జగించినా రాధా చల్లబడ లేదు. కొడాలి నాని కూడా బుజ్జగించేందుకు ప్రయత్నించారు.

4 నెలలు ఓపిక పట్టా:
ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడని రంగా స్ఫూర్తితో…పేద ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రయాణం సాగించాలన్నదే తన ఆకాంక్ష అని రాధా స్పష్టం చేశారు. వైసీపీలో ఆంక్షలు విధించడం మీకు తప్పనిసరయితే….నా  ఆకాంక్షలు నెరవేరాలంటే ఆంక్షలు లేని ప్రజాప్రయాణం కావాలంటూ జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. పార్టీ నిర్ణయం కోసం 4నెలలు ఓపిక పట్టానని, కానీ అధిష్ఠానం నుంచి సానుకూల నిర్ణయం రాకపోవడంతో పార్టీని వీడుతున్నట్లు వివరించారు. అభిమానులతో చర్చించి రెండు రోజుల్లో తన భవిష్యత్‌ రాజకీయ కార్యాచరణను వెల్లడిస్తానన్నారు.

 

రాధాకు టీడీపీ గాలం:
విజయవాడలో ఉన్న కాపు సామాజికవర్గంలో వంగవీటి కుటుంబానికి మంచి పట్టు ఉంది. దీంతో రాధా రాజకీయ అడుగులు ఎటు అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జనసేనలో చేరతారన్న ప్రచారం కొంతకాలంగా జరుగుతుంటే… మరోవైపు టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు తెలుగుదేశం పార్టీ విజయవాడ అర్బన్ అధ్యక్షుడు బుద్ధా వెంకన్న….రాధా రాజీనామాపై స్పందించారు. వంగవీటి రాధా పార్టీలోకి వస్తే స్వాగతిస్తామన్న ఆయన…చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు. అంతేకాకుండా చాలా మంది వైసీపీ నేతలు…పార్టీలోకి వస్తామంటున్నారని బుద్దా వెల్లడించారు. వంగవీటి రాధా…టీడీపీలోకి వస్తే స్వాగతిస్తామన్నారు మంత్రి పత్తిపాటి పుల్లారావు. జగన్‌ విధానాలు నచ్చకే  వంగవీటి రాధా…. వైసీపీకి రాజీనామా చేశారని తెలిపారు. వైసీపీ నుంచి మరింత మంది బయటి కొస్తారని స్పష్టం చేశారు.

బోండాకి ఎర్త్ పెడతారా:
వంగవీటి రాధా టీడీపీలో చేరితే…ఎవరికి సీటుకు ఎసరు పెడతారన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా బోండా ఉమా మహేశ్వరరావు ఉన్నారు. రెండేళ్ల క్రితం మంత్రి వర్గ విస్తరణలో చోటు లభించలేదన్న కారణంతో బోండా కొంచెం హడావుడి చేశారు. దీంతో అప్పుడే పార్టీ అధినేత గట్టిగా మందలించారు. అప్పట్నుంచి ఉమా అసంతృప్తితో ఉన్నారు. అంతేకాకుండా పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఒకానొక సమయంలో జనసేన తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం జరిగినప్పటికీ….బోండా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఆ తర్వాత టీటీడీ బోర్డు మెంబర్‌గా అవకాశం కల్పించారు చంద్రబాబు.

బోండాకి చెక్:
బోండా ఉమాకు చెక్‌ పెట్టేందుకే రాధను తెస్తున్నారన్న ప్రచారంలో బెజవాడలో జోరుగా సాగుతోంది. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఒకవేళ బోండా ఉమా వెళ్లిపోయినా రాధాకృష్ణతో భర్తీ చేసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది తెలుగుదేశం పార్టీ. లేదంటే వచ్చే ఎన్నికల్లో బోండా ఉమాకే సెంట్రల్ సీటు కేటాయించి…వంగవీటి రాధాకృష్ణకు ఎమ్మెల్సీ లేదా నామినేటేడ్ పోస్టు ఇస్తారా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.

 

వంగవీటి వర్సెస్ దేవినేని:
మరోవైపు బెజవాడ రాజకీయాల్లో…వంగవీటి కుటుంబానికి, దేవినేని కుటుంబాలకు దశాబ్దాలుగా వైరం ఉంది. ఈ నేపథ్యంలో దేవినేని, వంగవీటి కుటుంబాలు…ఒకే ఒరలో రెండు కత్తులు ఇముడుతాయా అన్నది కూడా ఉత్కంఠ రేపుతోంది. పార్టీ అధినేత చంద్రబాబు…ఇద్దరు నేతలకు సర్ది చెప్పి…సమన్వయంతో పని చేయమంటారా ? అన్నది తేలాలంటే రెండు మూడు రోజుల్లో క్లారిటీ రానుంది.