నువ్వా, నేనా : నరసన్నపేటలో టీడీపీ వర్సెస్ వైసీపీ

శ్రీకాకుళం: వారిద్దరి ఒకే సామాజిక వర్గం…..దగ్గరి బంధుత్వం కూడా ఉంది. ఒకే మండలంలోని పక్క పక్క గ్రామాలు. పాలిటిక్స్‌లో ఇద్దరికి సీనియారిటి ఉంది. ఆ ఇద్దరు నేతలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ ప్రకటించారు. ఆయా పార్టీలు కూడా వారి అభ్యర్థిత్వాన్నే ఖరారు చేసే అవకాశం ఉంది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏదీ ? ఆ ఇద్దరు నేతలెవరూ అనుకుంటున్నారా….ఒకసారి ఈ స్టోరీ చూద్దాం.
శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున బగ్గు రమణమూర్తి, వైసీపీ తరపున ధర్మాన కృష్ణదాసు పోటీ పడ్డారు. ఈ ఎన్నికల్లో కృష్ణదాసుపై దాదాపు 6వేల ఓట్ల తేడాతో బగ్గు రమణమూర్తి విజయం సాధించారు. మొట్ట మొదటిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టిన రమణమూర్తి ప్రభుత్వ నిధులతో తనదైన శైలిలో నియోజక వర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వం నుంచి భారీగా నిధులు విడుదల చేయించుకొని పనులు చేశారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. నియోజకవర్గంలోని జలుమూరు, సారవకోట, సోలాకి, నరసన్నపేట మండలాల్లో వందల కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పించారు.
ఇక ధర్మాన సోదరలు విషయం చూస్తే ..ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాసు గతంలో ఉన్న భేదాభిప్రాయాలను పక్కన పెట్టి పని చేస్తున్నారు. అన్నదమ్ములిద్దరూ సమన్వయంతో పని చేస్తుండటం వైసీపీకి బలమైన కేడర్ ఉండటంతో ఆపార్టీ క్యాడర్‌లో జోష్ నింపుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బగ్గు రమణమూర్తి, ధర్మాన కృష్ణదాసుల మధ్య పోటీ రసవత్తరంగా మారనుంది.
బగ్గు రమణమూర్తికి అచ్చెన్నాయుడు వర్గంగా పేరున్నప్పటికీ, ఇక్కడ్నుంచి కింజరాపు వర్గీయులు పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తిపై ఎలాంటి వ్యతిరేకత లేకపోవడంతోపాటు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలే తనను గెలిపిస్తాయని ఆయన ధీమాగా చెబుతున్నారు.
గత ఎన్నికల్లో ఓటమితో డీలా పడ్డ ధర్మాన కృష్ణదాస్ రెట్టింపు ఉత్సాహంతో నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఈసారి గెలిస్తే తమ్ముడు ధర్మాన ప్రసాదరావును కాదని తనకే మంత్రి పదవి లభిస్తుందన్న ధీమాలో ఉన్నారు. జగన్ పాదయాత్ర, నవరత్నాలు, వైసీపీపై ప్రజల్లో ఉన్న నమ్మకమే తనను గెలిపిస్తాయని కృష్ణదాస్ లెక్కలు వేసుకుంటున్నారు. టీడీపీ, వైసీపీ అభ్యర్థులు నువ్వా, నేనా అన్నట్లు ప్రజల్లో తిరుగుతుంటే జనసేన, కాంగ్రెస్, బీజేపీ మాత్రం ఎవరు పోటీ చేస్తారన్న దానిపై క్లారిటీ ఇవ్వడం లేదు.