తొడగొడుతున్న యువతరం : తూర్పు రాజకీయాల్లో కొత్తతరం

కాకినాడ : తూర్పు రాజ‌కీయాల్లో కొత్త త‌రం అరంగేట్రం చేస్తోంది. అవ‌కాశం ఇస్తే స‌త్తా చాటుతామంటోంది. ఎన్నిక‌లే ల‌క్ష్యంగా యువ‌నేత‌లు తొడగొడుతున్నారు. మరి యంగ్‌ లీడర్స్‌లో

  • Publish Date - February 1, 2019 / 02:13 PM IST

కాకినాడ : తూర్పు రాజ‌కీయాల్లో కొత్త త‌రం అరంగేట్రం చేస్తోంది. అవ‌కాశం ఇస్తే స‌త్తా చాటుతామంటోంది. ఎన్నిక‌లే ల‌క్ష్యంగా యువ‌నేత‌లు తొడగొడుతున్నారు. మరి యంగ్‌ లీడర్స్‌లో

కాకినాడ : తూర్పు రాజ‌కీయాల్లో కొత్త త‌రం అరంగేట్రం చేస్తోంది. అవ‌కాశం ఇస్తే స‌త్తా చాటుతామంటోంది. ఎన్నిక‌లే ల‌క్ష్యంగా యువ‌నేత‌లు తొడగొడుతున్నారు. మరి యంగ్‌ లీడర్స్‌లో ఎవరికి ఛాన్స్‌ దక్కబోతోంది.. ఎవరిని ఓటర్లు ఆశీర్వదించబోతున్నారు. బస్తీమే సవాల్‌ అంటున్న యంగ్ లీడర్స్ కహానీ ఏంటి..

 

తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌కీయాల్లో సీనియ‌ర్లకు ఎదురులేదు. ఏపీలో మంత్రులుగా ఉన్న య‌న‌మ‌ల‌, చినరాజ‌ప్ప వంటి వారే కాకుండా విప‌క్షంలో ఉన్న సీనియర్లు కూడా ఇందుకు నిదర్శనం. కొంద‌రు పరోక్ష ఎన్నిక‌ల‌కే ప్రాధాన్యత‌నిస్తున్నప్పటికీ మెజార్టీ నేత‌లు మాత్రం బ‌రిలో దిగేందుకు త‌హ‌త‌హ‌లాడుతున్నారు. ఇప్పుడు సీనియ‌ర్లకు తోడుగా యంగ్ లీడ‌ర్లు కూడా బరిలోదిగేందుకు సిద్ధమ‌వుతున్నారు. పొలిటికల్‌ ఎంట్రీకి ఇదే సరైన సమయం అని భావిస్తున్నారు. దీంతో అన్ని పార్టీల్లోనూ కొత్త మొఖాల ప్రభావం ఎక్కువగా ఉండే అవ‌కాశం క‌నిపిస్తోంది. టీడీపీ, వైసీపీ, జ‌న‌సేన పార్టీల్లో అవ‌కాశాల కోసం ప‌ట్టుబ‌డుతున్న యువ‌నేత‌ల ప‌రిస్థితి ఇప్పుడు జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది.

 

టీడీపీలో కొత్త త‌రం క‌దం తొక్కేందుకు సన్నద్ధమవుతోంది. రాజ‌మ‌హేంద్రవ‌రం అర్బన్ సీటు కోసం ఆదిరెడ్డి వాసు, ఆయ‌న భార్య భ‌వానీ రేసులో ఉన్నారు. ప్రత్తిపాడు అసెంబ్లీ సీటు కోసం వ‌రుపుల రాజా గ‌ట్టిగా ప‌ట్టుబ‌డుతున్నారు. తుని నుంచి య‌న‌మ‌ల కుటుంబం వార‌సులు రంగంలో దిగే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. మండ‌పేటలో సిట్టింగ్‌ని కాద‌ని త‌న‌కు ఛాన్స్ ఇవ్వాలంటూ మున్సిప‌ల్ చైర్మన్ చుండ్రు సూర్యప్రకాష్ తీవ్రంగా ప్రయ‌త్నాలు చేస్తున్నారు. పి గ‌న్నవ‌రం టిక్కెట్టుపై నేల‌పూడి స్టాలిన్ ఇప్పటికే కన్నేశారు. అటు లోక్‌స‌భ మాజీ స్పీక‌ర్ జీఎంసీ బాల‌యోగి త‌న‌యుడు తెర‌మీద‌కు వ‌స్తార‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయ‌న అమ‌లాపురం నుంచి బ‌రిలో దిగొచ్చని భావిస్తున్నారు. కానీ ప్రచారంలో ఉన్నప్పటికీ బాల‌యోగి కుటుంబం మాత్రం అమ‌లాపురం వైపు క‌న్నెత్తి చూసిన దాఖ‌లాలు క‌నిపించ‌డం లేదు.

 

వైసీపీలో కూడా యువ‌నేత‌లు తొడగొడుతున్నారు. ఇప్పటికే రాజ‌మ‌హేంద్రవ‌రం అర్బన్ సీటుని మార్గాని భ‌ర‌త్‌కి కేటాయిస్తున్నట్టు ఆ పార్టీ ప్రక‌టించింది. ఆయ‌న‌కు తోడుగా రాజాన‌గ‌రం నుంచి ఈ సారి త‌మ‌కు ఛాన్స్ ఇవ్వాల‌ని మాజీ మంత్రి జ‌క్కంపూడి త‌న‌యులు జ‌క్కంపూడి రాజా, గ‌ణేష్‌లు కోరుతున్నారు. అన్నద‌మ్ములిద్దరిలో ఎవ‌రికి అవ‌కాశం ఉంటుంద‌న్నది ఆస‌క్తిదాయ‌క‌మే. ఇక ప్రత్తిపాడు నుంచి ప‌ర్వత పూర్ణ చంద్రప్రసాద్ తొలిసారి రంగంలో దిగేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నారు. పెద్దాపురంలో డిప్యూటీ సీఎం చిన‌రాజ‌ప్పని డీ కొట్టేందుకు ద‌వులూరి దొర‌బాబు కాలుదువ్వుతున్నారు. మండ‌పేట వైసీపీ టికెట్ డాక్టర్ పితాని అన్నవ‌రానికి కేటాయించే అవ‌కాశం ఉంద‌నే అంచ‌నాలున్నాయి. రంప‌చోడ‌వ‌రంలో ధ‌న‌ల‌క్ష్మికి ఛాన్స్ ఖాయంగా క‌నిపిస్తోంది.

 

జ‌న‌సేన‌లోనూ యువ‌త‌కు ఎక్కువ అవ‌కాశాలు ద‌క్కుతాయ‌ని యంగ్‌లీడర్స్‌ ఆశాభావంతో ఉన్నారు. ఇప్పటికే ప్రక‌టించిన ముమ్మిడివ‌రం సీటు కూడా పితాని బాల‌కృష్ణకు కేటాయించ‌డంతో ఆయ‌న తొలిసారి అదృష్టాన్ని ప‌రీక్షించుకోబోతున్నారు. ఇక అమ‌లాపురం ఎంపీ టికెట్‌ని ఓఎన్జీసీకి చెందిన సీనియ‌ర్ అధికారి డీఎంఆర్ శేఖ‌ర్‌కి ఖ‌రారు చేసిన‌ట్టు ప్రచారం సాగుతోంది. ఆయ‌న త్వర‌లోనే ఉద్యోగానికి గుడ్ బై చెప్పి పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే రీతిలో ప‌లువురు యువ‌నేత‌లు జ‌న‌సేన‌లో ఛాన్స్ కోసం ఎగ‌బడుతున్నారు. మొత్తానికి 2019 ఎన్నిక‌ల్లో ప‌లు కొత్త ముఖాలు రాజ‌కీయ తెర‌మీద‌కు రావ‌డం ఖాయంగా కనిపిస్తోంది. యంగ్‌ లీడర్స్‌లో ఎవ‌రి అదృష్టం ఎలా ఉంటుందోనని ఇప్పుడు  చర్చ జరుగుతోంది. ఓటర్లు ఎవరిని ఆశీర్వదిస్తారో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు