YSR Telangana Party : జూలై 8న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావం, ముమ్మరంగా ఏర్పాట్లు

తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకోనుంది. వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టబోతున్నారు. జూలై 8న..

YSR Telangana Party : జూలై 8న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావం, ముమ్మరంగా ఏర్పాట్లు

Ysr Telangana Party

YSR Telangana Party : తెలంగాణలో మరో కొత్త పార్టీ పురుడు పోసుకోనుంది. వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టబోతున్నారు. జూలై 8న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ప్రకటించనున్నారు. పార్టీ ఆవిర్భావానికి సంబందించిన షర్మిల ముఖ్య అనుచరులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లో కొత్త పార్టీ ఆవిర్భావ కార్యక్రమ వాల్ పోస్టర్ ను షర్మిల అనుచరులు ఆవిష్కరించారు. షర్మిల ముఖ్య అనుచరుడు కొండ రాఘవ రెడ్డి ఈ ఏర్పాట్లు చూసుకుంటున్నారు. పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి ఒక్కో జిల్లా నుంచి 2వేల మందికి పైగా అభిమానులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

కాగా, ఇన్విటేషన్ ఉంటేనే ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వనున్నారు. పార్టీ ఆవిర్భావానికి అందరూ రావాల్సిందేనని, వారి ముందు మాత్రమే ఆవిష్కరణ చేయాలని షర్మిల నిర్ణయించారు. కాగా, స్క్రీన్లు వద్దని నిర్ణయించారు. అంతేకాదు పార్టీ కండువాలు కూడా సిద్ధం చేశారు. జూలై 9న నుంచి గ్రామాల వారీగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్టు కొండ రాఘవరెడ్డి చెప్పారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించామన్నారు. జూలై 8న పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఉదయం పదిన్నరకి హైదరాబాద్ పంజాగుట్టలోని వైఎస్సార్ విగ్రహానికి వైఎస్ షర్మిల నివాళులర్పిస్తారు.

తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన షర్మిల పార్టీ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. తెలంగాణలో ఏర్పాటు చేయనున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా ఖరారైంది. జెండాను తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట రంగుతో రూపొందించారు. జెండాలో 80 శాతం పాలపిట్ట రంగు ఉండగా.. మిగిలిన 20 శాతం నీలి రంగు ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. జెండా మధ్యలో తెలంగాణ భౌతిక స్వరూపం, అందులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రం ఉండేలా డిజైన్ చేశారు. దివంగత రాజశేఖర్ రెడ్డి జయంతి రోజైన జులై 8న పార్టీని ప్రారంభించనున్నారు.

ఇక ఇప్పటికే షర్మిల తన పార్టీకి వ్యూహకర్తను కూడా నియమించుకున్నారు. షర్మిల తన పార్టీ రాజకీయ వ్యూహకర్తగా తమిళనాడులోని తిరువల్లూరు డీఎంకే ఎమ్మెల్యే రాజేంద్రన్‌ కుమార్తె ప్రియను ఎంచుకున్నారు. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ టీమ్‌లో కీలకంగా వ్యవహరించారు ప్రియ. ఈ నెల 8న ప్రకటించనున్న షర్మిల కొత్త పార్టీతో పాటు సోషల్‌ మీడియాకు ప్రియ వ్యూహకర్తగా వ్యవహరించనున్నారు.