వివేకా హత్య కేసు : సీఎం వ్యాఖ్యలపై సీఈవోకి సునీతా రెడ్డి ఫిర్యాదు

  • Published By: veegamteam ,Published On : March 21, 2019 / 09:59 AM IST
వివేకా హత్య కేసు : సీఎం వ్యాఖ్యలపై సీఈవోకి సునీతా రెడ్డి ఫిర్యాదు

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ విచారణ తీరుపై వివేకా కూతురు సునీతా రెడ్డి ఏపీ సీఈవో గోపాలకృష్ణ ద్వివేదికి ఫిర్యాదు చేశారు. సచివాలయంలో ద్వివేదిని  కలిసిన ఆమె.. సిట్ విచారణను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. సాక్షాత్తూ సీఎం చంద్రబాబే కేసు దర్యాప్తును ప్రభావితం చేసేలా మాట్లాడుతున్నారని సునీతా రెడ్డి తన ఫిర్యాదులో చెప్పారు. సీఎం మాటలు కేసు దర్యాప్తు చేస్తున్న విచారణ అధికారులను ప్రభావితం చేసేలా ఉన్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

వివేకా హత్య కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించిన సునీతా రెడ్డి.. వివేకా హత్య  తర్వాత టీడీపీ నేతల వ్యాఖ్యలు ఉన్న పేపర్ కటింగ్స్ ను సీఈవో ద్వివేదికి ఇచ్చారు. సిట్ విచారణ పారదర్శకంగా జరిగేలా చూడాలని, దోషులకు శిక్షపడేలా చేయాలని సీఈవోకి.. సునీతా రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ  విషయమై త్వరలో కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. సునీతా రెడ్డి తన భర్త రాజశేఖరరెడ్డితో కలిసి సీఈవోని కలిశారు.

వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి మార్చి 15వ తేదీన తెల్లవారుజామున పులివెందులలోని ఇంట్లో దారుణ హత్యకు గురయ్యారు. వివేకా హత్య.. రాజకీయ రంగు పులుముకుంది. టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. వివేకాను చంపింది టీడీపీ వాళ్లే అని వైసీపీ నాయకులు ఆరోపిస్తే.. మీరే చంపారు.. అని టీడీపీ నాయకులు ఎదురుదాడికి దిగుతున్నారు. వివేకా హత్య వెనుక చంద్రబాబు, లోకేష్ హస్తం ఉందని జగన్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.