జగన్ ఎవరిని కరుణిస్తారో, నెల్లూరు జెడ్పీ చైర్‌పర్సన్‌ స్థానం కోసం పోటీ

నెల్లూరులో రాజకీయాలు వేడెక్కాయి. జడ్పీ ఛైర్‌పర్సన్‌ స్థానాన్ని తొలిసారిగా జనరల్ మహిళకు కేటాయించడంతో అక్కడ పాలిటిక్స్‌ ఆసక్తికరంగా మారుతున్నాయి. రెండు నెలల

  • Published By: veegamteam ,Published On : March 11, 2020 / 10:56 AM IST
జగన్ ఎవరిని కరుణిస్తారో, నెల్లూరు జెడ్పీ చైర్‌పర్సన్‌ స్థానం కోసం పోటీ

నెల్లూరులో రాజకీయాలు వేడెక్కాయి. జడ్పీ ఛైర్‌పర్సన్‌ స్థానాన్ని తొలిసారిగా జనరల్ మహిళకు కేటాయించడంతో అక్కడ పాలిటిక్స్‌ ఆసక్తికరంగా మారుతున్నాయి. రెండు నెలల

నెల్లూరులో రాజకీయాలు వేడెక్కాయి. జడ్పీ ఛైర్‌పర్సన్‌ స్థానాన్ని తొలిసారిగా జనరల్ మహిళకు కేటాయించడంతో అక్కడ పాలిటిక్స్‌ ఆసక్తికరంగా మారుతున్నాయి. రెండు నెలల క్రితం ఈ స్థానాన్ని ఎస్టీ జనరల్‌కు కేటాయిస్తూ గెజిట్‌లో ప్రకటించినప్పటికీ.. తాజా రిజర్వేషన్లలో ఈ స్థానాన్ని జనరల్ మహిళకు అవకాశం కల్పించారు. దీంతో ఆశావహుల్లో ప్రముఖుల వారసుల పేర్లు తెరపైకి వస్తున్నాయి.  

జడ్పీ చైర్‌పర్సన్‌ స్థానం జనరల్‌ మహిళకు కేటాయింపు:
నెల్లూరు జిల్లా పరిషత్‌ చరిత్రలో తొలిసారిగా ఛైర్‌పర్సన్‌ స్థానాన్ని జనరల్‌ మహిళకు కేటాయించారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. 59 శాతం రిజర్వేషన్ల క్రమంలో రెండు నెలల క్రితం జడ్పీ చైర్‌పర్సన్‌ స్థానాన్ని ఎస్టీలకు రిజర్వు చేస్తూ ప్రకటన చేసింది. అయితే రిజర్వేషన్లను 50 శాతానికి కుదించడంతో చైర్‌పర్సన్‌ స్థానం జనరల్‌ మహిళకు రిజర్వు చేశారు. ఇప్పటివరకు ఇద్దరు మహిళలు చైర్‌పర్సన్‌లుగా పనిచేసినా వారిద్దరూ రిజర్వుడు వర్గాలకు చెందిన వారు. జనరల్ మహిళకు కేటాయించడం ఇదే తొలిసారి. కేబినెట్ హోదా కలిగిన జడ్పీ చైర్‌పర్సన్‌ స్థానంపై అధికార పార్టీకి చెందిన పలువురు ప్రముఖులు దృష్టి సారించారు. తమ వారికి చైర్‌పర్సన్‌ స్థానం దక్కించుకోవాలనే తపన, పట్టుదలతో ఇప్పటికే  ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. అయితే ప్రతిపక్షం నుంచి ఇప్పటి వరకు ఎవరిపేర్లు పెద్దగా ప్రచారంలోకి రాలేదు. 

1987 నుంచి రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభం:
నెల్లూరు జిల్లా పరిషత్‌లో 1987 నుంచి రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అప్పట్లో జనరల్‌కు ఈ స్థానాన్ని కేటాయించారు. అనంతరం 1995లో ఎస్సీ మహిళకు, 1998లో ఎస్సీలకే కేటాయించారు. 2001లో బీసీ వర్గానికి ఈ కుర్చీ దక్కింది. ఆ తర్వాత నుంచి ఇక్కడ జనరల్ ఆధిపత్యం ప్రారంభమైంది. 2006, 2014లో ఓసీలకు ఈ స్థానం దక్కింది. ప్రస్తుతం మళ్లీ జనరల్ కే అవకాశం కల్సించినప్పటికీ దాన్ని మహిళకు రిజర్వ్ చేశారు. దీంతో మూడు దఫాలుగా జనరల్ ఆధిపత్యం కనిపించినా.. ఈసారి అతివకు పెద్దపీట వేశారు. 

రేసులో ముందున్న కాకాణి కూతురు పూజిత:
నెల్లూరు జడ్పీ స్థానాన్నిఆశిస్తున్న వారిలో ప్రధానంగా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ రెడ్డి కుమార్తె పూజిత పేరు ప్రచారంలోకి వచ్చింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తండ్రి గెలుపు కోసం ఈమె విస్తృతంగా ప్రచారం చేసింది. జడ్పీ చైర్మన్‌గా, రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా, వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా రాజకీయ సమీకరణల్లో భాగంగా మంత్రివర్గంలో కాకాణికి అవకాశం దక్కలేదు. ఈ క్రమంలో అధిష్ఠానం పూజితకు చైర్‌పర్సన్‌గా ఛాన్స్‌ ఇచ్చే అవకాశం ఉందని అధికార పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దీనికితోడు మనుబోలు జడ్పీటీసీ స్థానం జనరల్‌ మహిళకు రిజర్వు కావడంతో అక్కడి నుంచి ఈమె పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కాగా కాకాణి గోవర్ధన్‌ రెడ్డికి అధికారపార్టీలో నెంబర్ 2 గా ఉన్న విజయసాయిరెడ్డితో మంచి సంబంధాలు ఉన్నాయి. అలాగే జిల్లావ్యాప్తంగా విస్తృత పరిచయాలు ఉండటం, ఆనం రామనారాయణరెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతో కాకాణి కోరితే జడ్పీ చైర్‌పర్సన్‌ టిక్కెట్టు ఆయన కుమార్తెకు దక్కుతుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే నెక్ట్స్ టర్మ్ లోనైనా మంత్రి పదవి దక్కించుకోవాలన్న ఆలోచనలో ఉన్న కాకాణి తన కూతురి భవిష్యత్ కోసం జడ్పీ చైర్‌పర్సన్‌ స్థానాన్ని ఆశిస్తాడా లేదా అన్నది చూడాలి.   

రేసులో మాజీ జడ్పీటీసీ పందిళ్లపల్లి రాజేశ్వరమ్మ పేరు:
అధికార పార్టీ నుంచి ఏఎస్‌ పేట మాజీ జడ్పీటీసీ పందిళ్లపల్లి రాజేశ్వరమ్మ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఈమెది బలమైన రాజకీయ కుటుంబంగా పేరు. ఈమె భర్త పందిళ్లపల్లి సుబ్బారెడ్డికి దశాబ్ధ కాలంగా మండలంపై పట్టు ఉంది. గతంలో ఈయన ప్రాంతీయ విద్యుత్‌ మండలి చైర్మన్‌గా కూడా పనిచేశారు. మంత్రి మేకపాటి గౌతంరెడ్డికి అత్యంత సన్నిహితుడు. మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి దగ్గరి బంధువు. ఈ  నేపథ్యంలో జడ్పీ చైర్‌పర్సన్‌ ఆశావహుల పేర్లలో ఈమె పేరు కూడా బలంగా వినిపిస్తోంది. మరోవైపు నెల్లూరు రూరల్‌ జడ్పీటీసీ స్థానం కూడా జనరల్‌ మహిళకు రిజర్వు కావడంతో చైర్‌పర్సన్‌ సీటుపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వర్గీయులు ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

తన అనుచరులకి టికెట్‌ దక్కించుకోవడానికి కోటంరెడ్డి పట్టు:
తన అనుచరులకి టికెట్‌ దక్కించుకోవడానికి కోటంరెడ్డి పట్టుపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జిల్లా నేతలు అంటున్నారు. కోటంరెడ్డి కూడా పార్టీలో సీనియర్‌ ఎమ్మెల్యేనే. రెండు సార్లు గెలిచినా మంత్రివర్గంలో కాని, మరే ఇతర ముఖ్యమైన పదవులు కానీ దక్కలేదు. ఈ క్రమంలో తన మనిషిని జడ్పీ చైర్‌పర్సన్‌గా నియమించుకోవడం కోసం అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. మంత్రి అనిల్‌ అత్యంత సన్నిహితుడు కావడం ఈయనకు అదనపు బలం. అలాగే రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంతి రెడ్డి, గూడూరు మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్‌ దేవసేనమ్మ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. 

మరోవైపు వెంకటగిరి, కోవూరు, గూడూరు, నాయుడుపేట, ఉదయగిరి నియోజకవర్గాల పరిధిలోని మండలాలు కూడా జనరల్‌ మహిళకు రిజర్వు అయ్యాయి. ఈ ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గ పరిధిలోని మండలాలకు జడ్పీ చైర్‌పర్సన్‌ సీటు కేటాయించాలని అధిష్ఠానాన్ని కోరే అవకాశం లేకపోలేదు. జడ్పీ పీఠం ఎవరికి దక్కించుకునే విషయంలో జిల్లా అధికార పార్టీ గ్రూపు రాజకీయాలు కీలక పాత్ర వహించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఒక కుటుంబానికి ఒకే పదవి అనే నినాదంతో సీఎం జగన్ అందరికీ న్యాయం చేయాలన్న ఉద్దేశ్యంతో ఆ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశాలూ లేకపోలేదు. అయితే జెడ్పీ ఛైర్‌పర్సన్‌ స్థానాన్ని ఆశిస్తున్న జిల్లా నాయకులు మాత్రం ఎలాగైనా పీఠాన్ని సొంతం చేసుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికివారుగా తమకే సీటంటూ ప్రచారం చేసుకుంటున్నారు. 

See Also |సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసు సీబీఐకి అప్పగింత