చిత్తూరులో సర్వే రగడ : పోలీస్ స్టేషన్‌లో చెవిరెడ్డి ఆందోళన

  • Published By: madhu ,Published On : February 25, 2019 / 05:18 AM IST
చిత్తూరులో సర్వే రగడ : పోలీస్ స్టేషన్‌లో చెవిరెడ్డి ఆందోళన

ఏపీ రాష్ట్రంలో సర్వేల రగడ కొనసాగుతోంది. తమ పార్టీకి చెందిన ఓట్లర్లను, సానుభూతి పరుల ఓట్లను టీడీపీ ప్రభుత్వం తొలగిస్తోందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆయా జిల్లాల్లో సర్వేకు వచ్చిన వారిని నేతలు అడ్డుకుంటుండడంతో హై టెన్షన్ వాతావరణం నెలకొంటోంది. తాజాగా చంద్రగిరిలో జరిగిన ఘటన కాకా పుట్టిస్తోంది. తమను అడ్డుకున్నారని సర్వే సిబ్బంది కంప్లయింట్ చేయడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలను అరెస్టు చేయడం..వారిని రిలీజ్ చేయాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆందోళన చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. 

చిత్తూరు జిల్లా చంద్రగిరిలో మరోసారి సర్వేల రగడ కొనసాగుతోంది. పాకాలలో సర్వేను అడ్డుకొనేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. సర్వే సిబ్బంది ఫిర్యాదుతో ఆ పార్టీకి చెందిన నేతలను పోలీసులు అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పీఎస్‌ వద్దకు ఫిబ్రవరి 24వ తేదీ రాత్రి వెళ్లారు. తమ పార్టీకి చెందిన నేతలను విడుదల చేయాలంటూ చెవిరెడ్డి డిమాండ్ చేశారు. ధర్నా విరమించాలని చెప్పినా వినిపించుకోకపోవడంతో పోలీసులు చెవిరెడ్డిని అరెస్టు చేసి సత్యవేడు పీఎస్‌కు తరలించారు.

స్టేషన్‌కు తరలించినా చెవిరెడ్డి ఆందోళన విరమించ లేదు. పీఎస్ వద్ద కూర్చొన్నారు. దుప్పటి కప్పుకుని అక్కడే నిద్ర చేశారు. చివరకు ఫిబ్రవరి 25వ తేదీ ఉదయం చెవిరెడ్డిని పోలీసులు వదిలేశారు.