దీక్షిత్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి, తల్లిదండ్రులకు అప్పగింత, శనిగపురంలో అంత్యక్రియలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

deekshith dead body : కిడ్నాపర్ చేతిలో దారుణ హత్యకు గురైన 9ఏళ్ల బాలుడు దీక్షిత్ రెడ్డి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయ్యింది. దీక్షిత్ డెడ్ బాడీని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. శనిగపురంలో దీక్షిత్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.

మహబూబాబాద్‌లో 9ఏళ్ల బాలుడు దీక్షిత్ కిడ్నాప్ కథ విషాదాంతంగా ముగిసింది. ముద్దులొలికే పసివాడిని కిడ్నాప్ చేసిన మెకానిక్ మంద సాగర్(23), గొంతు నులిమి దారుణంగా చంపేశాడు. ఏదో ఆశించి.. ఇంకేదో జరుగుతుందని భావించి.. అమాయక చిన్నారిని నిర్దాక్షిణ్యంగా నులిమేశాడు. కన్నవాళ్లకు కడుపుకోత మిగిల్చాడు

ఈజీమనీ కోసం దారుణం:
కిడ్నాప్ చేసిన గంటలోనే చిన్నారి దీక్షిత్‌ను కిడ్నాపర్‌ సాగర్ హత్య చేశాడని పోలీసులు తెలిపారు. ఈజీగా, త్వరగా ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే ఈ దారుణానికి తెగబడ్డాడన్నారు. అయితే పిల్లాడు తనను గుర్తు పడతాడన్న భయంతోనే హత్య చేశాడని తెలిపారు. దీక్షిత్‌ హత్యకు సంబంధించిన వివరాలను మహబూబాబాద్‌ ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. ఆదివారం(అక్టోబర్ 18,2020) సాయంత్రం ఇంటిముందు ఆడుకుంటున్న దీక్షిత్‌ను మంద సాగర్‌ తీసుకెళ్లాడు.

మెకానిక్‌గా పనిచేస్తున్న సాగర్‌… ఆ ప్రాంతంలో తరచుగా తిరుగుతుండేవాడు. బయటకు వెళ్లొద్దామని సాగర్ రమ్మనగానే… ఏ మాత్రం అనుమానం లేకుండా దీక్షిత్ అతడి బైక్‌ ఎక్కాడు. అదే అతడి ప్రాణాలు తీసింది. బైక్ ఎక్కే సమయంలో కూడా మిగిలిన పిల్లలతో అన్నతో వెళ్లొస్తానని చెప్పాడు. కానీ దీక్షిత్ తిరిగి రాలేదు.

గుర్తు పడతాడనే భయంతోనే హత్య:
కాగా, మెకానిక్ సాగర్‌కు కెమెరాలపై పూర్తి అవగాహన ఉంది. దీంతో అవి లేని ప్రాంతం నుంచి పిల్లాడిని ఎత్తుకెళ్లాడు. అంతేకాకుండా తనను ఎవరూ గుర్తుపట్టకుండా బైక్‌ నెంబర్‌ ప్లేట్‌ను మార్చేశాడు. తర్వాత దానవయ్య గుట్టల్లోకి పిల్లాడిని తీసుకెళ్లాడు. అక్కడకు వెళ్లాక గంటసేపు గడిపాడు. అంతకుమించి పిల్లాడ్ని ఆపలేకపోయాడు. దీంతో సాగర్ మనసు మార్చుకున్నాడు. పిల్లాడి గొంతు నులిమి చంపేశాడు. పెట్రోల్‌ పోసి తగలబెట్టాడు. ఆ తర్వాతే తల్లిదండ్రులతో బేరసారాలు మొదలుపెట్టాడు. ఫేక్‌ కాల్‌ యాప్‌ ద్వారా వారితో మాట్లాడాడు. మూడు రోజుల తర్వాత పోలీసులు కేసును ఛేదించారు.

నా కొడుకు క్షేమంగా తిరిగొస్తాడని అనుకున్నా:
దీక్షిత్ ఇక లేడు అనే వార్తను తల్లి జీర్ణించుకోలేకపోతోంది. గుండె పగిలేలా రోదిస్తోంది. తన కుమారుడు క్షేమంగా వస్తాడని భావించానని బాలుడి తల్లి వసంత కన్నీరుమున్నీరు అయ్యింది. తన కుమారుడిని ఏ విధంగా అయితే చంపాడో అదే విధంగా నిందితుడిని కూడా సజీవదహనం చేయాలని వసంత డిమాండ్ చేశారు. అడిగినంత డబ్బు ఇవ్వడానికి అంగీకరించాము, అన్నా అని బతిమాలాను, నా కొడుకుని ఏమీ చేయొద్దని వేడుకున్నా, అయినా కనికరం లేకుండా తన బిడ్డను చంపేశాడని తల్లి వసంత బోరున విలపించింది.

తొందరగా డబ్బు సంపాదించాలన్న దురుద్దేశం, దొరికిపోతాననే భయంతోనే దీక్షిత్‌ హత్య:
కృష్ణకాలనీలో మెకానిక్‌గా సాగర్ పనిచేసేవాడు. వచ్చే సంపాదనతో సంతృప్తి చెందకుండా లగ్జరీ లైఫ్‌ కావాలని కోరుకున్నాడు. అందుకే దీక్షిత్‌ను కిడ్నాప్ చేశాడని పోలీసులు తెలిపారు. బాబుని కిడ్నాప్‌ చేయాలని చాలా రోజులుగా స్కెచ్చేశాడు సాగర్. కాకపోతే సమయం కోసం వేచి చూశాడు. చాలా న్యాక్‌గా ఆదివారం రోజు స్పాట్‌ పెట్టి.. పిల్లాడ్ని ఎత్తుకెళ్లాడని పోలీసులు చెప్పారు. దీక్షిత్‌ను కిడ్నాప్ చేసిన సాగర్ ఆ తర్వాత డైలమాలో పడ్డాడు. తాను సేఫ్ కావడానికే చిన్నారిని చంపేశాడని నిర్ధారించారు పోలీసులు.

Related Tags :

Related Posts :