ఏపీలో మరోసారి ఇళ్ల పట్టాల వాయిదా

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

నిరుపేదల కలలను సాకారం చేద్దామని వారికి ఇళ్ల పట్టాలను అందిస్తామని ఏపీ ప్రభుత్వం అనుకున్నా..కొన్ని అడ్డంకులు తగులుతున్నాయి. ఇళ్ల పట్టాల పంపిణీ మరోసారి వాయిదా పడింది. ఆగస్టు 15వ తేదీన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం జగన్ ప్రభుత్వం నిర్ణయించింది.

అయితే..కోర్టుల్లో కేసులు నడుస్తున్న నేపథ్యంలో వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పట్టాల పంపిణీ తేదీని త్వరలోనే ప్రభుత్వం ప్రకటించనుంది. ఇప్పటికే నాలుగు సార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే.

శ్రీకాకుళం జిల్లాలో మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఈ కార్యక్రమంపై పలు వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15వ తేదీన కాకుండా..మరో రోజున ఉండొచ్చుననే సంకేతాలు ఇచ్చారు. దీంతో ఇళ్ల పట్టాల పంపిణీ మరోసారి వాయిదా పడొచ్చని అనుకున్నారు.

పేదలకు ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే ప్రతిపక్షాలు కోర్టులకు వెళ్లి…అడ్డుకుంటున్నాయని మంత్రి రంగనాథ రాజు వెల్లడించారు. అర్హులకు స్థలాలను పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేశామన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షలమందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సీఎం జగన్ భావించారు. ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కాకముందే పంపిణీ చేయాలనుకుంది. సంక్రాంతి కానుకగా ఇవ్వాలని భావించారు. తర్వాత అనివార్య కారణాలతో అంబేద్కర్ జయంతి రోజుకు వాయిదా పడింది. తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు అడ్డుగా వచ్చాయి.

తర్వాత కరోనా, లాక్‌డౌన్ దెబ్బకు ఆగిపోయాయి. తర్వాత లాక్‌డౌన్ ఎత్తేయడంతో వైఎస్ జయంతి రోజు జూలై 8న ఇవ్వాలనుకున్నారు. కానీ కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం మళ్లీ వాయిదా వేసింది. కరోనా కేసులు తగ్గుముఖం పడితే ఆగస్టు 15న పేదలకు పట్టాలను ఇవ్వాలనే ఆలోచన చేసింది.

దీనిపై ప్రతిపక్షాలు కోర్టుకు వెళుతూ..కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నాయని వైసీపీ నేతలు అంటున్నారు. పేదల కలల సాకారం నెరవేర్చేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇళ్ల పట్టాల పంపిణీకి ఎప్పుడు అడ్డంకులు తొలుగుతాయో చూడాలి మరి.

Related Posts