రియల్ సీతయ్య.. ఎవరి మాటా వినడు, కేర్ చెయ్యడు.. అధికార పార్టీ నేతలకు చుక్కలు చూపిస్తున్న ఎస్పీ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొందరు తమకు అనుకూలంగా ఉండే సీఐ, ఎస్ఐ, కానిస్టేబుళ్లను తమ ప్రాంతంలో నియమితులయ్యేలా చూసుకున్నారు. కాకపోతే ప్రకాశం జిల్లాలో సీఐల దగ్గర నుంచి ఎస్ఐ, కానిస్టేబుళ్లను భారీ స్థాయిలో జిల్లా ఎస్పీ సిద్దార్ధ కౌశల్ బదిలీలు చేయడంతో అలజడి మొదలైంది. జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు ఎస్సీ చర్యలతో కంగుతిన్నారు.

ఎస్పీకి పూర్తి స్వేచ్ఛనిచ్చిన సీఎం జగన్:
అధికారం చేపట్టాక నాయకులు తమకు అనుకూలురైన వారిని నియమించుకోవడం, వారి అండతో జిల్లా పోలీసులు సివిల్ సెటిల్‌మెంట్లతో పాటు భారీ ఎత్తున లంచాలు వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన సమాచారం సీఎం జగన్‌కు చేరడంతో ప్రక్షాళన చేసేందుకు ఎస్పీకి పూర్తి స్వేచ్ఛనిచ్చారట. దీంతో జిల్లా పోలీస్ బాస్ తన దూకుడు ప్రదర్శించారట. తమ ప్రమేయం లేకుండా ఎస్పీ తన ఇష్టానుసారంగా బదిలీలు చేయడంపై నేరుగా మంత్రికి ఎస్పీపై ఫిర్యాదులు చేసినట్లు వైసీపీ వర్గాలు అంటున్నాయి.

ఎస్పీ తమ మాట వినడం లేదని వైసీపీ ఎమ్మెల్యేల ఆవేదన:
గిద్దలూరు, కనిగిరి, కందుకూరు ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, బొర్రా మధుసూదన్ యాదవ్, మానుగుంట మహీధర్‌రెడ్డిలు మంత్రి ముందు ఎస్పీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని అంటున్నారు. తమ మాట ఎస్పీ వినడం లేదని, సరిగా రిసీవ్ చేసుకోవడం లేదని మొరపెట్టుకున్నారట. తమ సిఫారసులు పనిచేయనప్పుడు తామెలా రాజకీయాలు చేయాలని, ఎస్పీనే పాలనా వ్యవహారాలు కూడా చూసుకుంటే సరిపోతుంది కదా అంటూ కాస్త వెటకారం మిక్స్‌ చేసి మంత్రి ముందు వాపోయారట.

మంత్రికి ఇబ్బందిగా మారిన బదిలీలు:
చీరాల, దర్శి నియోజకవర్గాల్లో ఈ బదిలీల వ్యవహారం మంత్రికి తీవ్ర ఇబ్బందికరంగా మారిందట. చీరాలలో ఆమంచి, కరణం బలరాం, దర్శిలో మద్దిశెట్టి వేణుగోపాల్, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డిల మద్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఆయా నాయకులు వారికి అనుకూలురైన వారిని నియమించాలంటూ ఎస్పీకి సిఫారసు లేఖలు రాశారట. జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తేవడంతో బదిలీలు చేయడం ఎస్పీ, మంత్రికి సవాలుగా మారింది. చీరాలో ఒక్క మండలం మినహా మిగతా మండలాల్లో ఇప్పటికీ ఎస్ఐల బదిలీలు పెండింగ్ లో ఉన్నాయి.

అటు బలరాం వర్గం, ఇటు ఆమంచి వర్గం:
అటు బలరాం వర్గం, ఇటు ఆమంచి వర్గీయులు ఇచ్చిన సిఫారసులలో ఎవరిని ఎలా సంతృప్తి పరచాలన్న విషయంపై అధిష్టానం ఒక నిర్ణయానికి రాలేకపోతోంది. దీంతో అక్కడ బదిలీల వ్యవహారం మంత్రి మెడకు చుట్టుకున్నట్లు అనుచరులు అంటున్నారు. దర్శి నియోజకవర్గంలో మాత్రం ఎమ్మెల్యే మద్దిశెట్టి పట్టుబట్టి మరీ తన పంతాన్ని నెగ్గించుకున్నట్లు అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముండ్లమూరు ఎస్ఐ బదిలీ విషయంలో బూచేపల్లి, మద్దిశెట్టిలు పోటీ పడటంతో చివరకు ఎమ్మెల్యేకే మంత్రి ప్రాధాన్యం ఇవ్వడంతో బూచేపల్లి అసంతృప్తిగా ఉన్నారట. మరి ఈ వ్యవహారాన్నిమంత్రి బాలినేని ఎలా అధిగమిస్తారో చూడాలంటున్నారు.

READ  హైదరాబాద్‌లో అభివృద్ధి అంటే..మొదట గుర్తుకొచ్చేది నేనే - బాబుRelated Posts