prathyusha mohter questions nhrc

మా అమ్మాయిని రేప్ చేసి చంపినప్పుడు NHRC ఎక్కడుంది : ప్రత్యూష తల్లి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం అంతకన్నా

వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం అంతకన్నా సంచలనమైంది. తమపై దాడి చేసి పారిపోవాలని చూశారని.. ఆత్మరక్షణ కోసమే నిందితులను కాల్చి చంపామని పోలీసులు చెబుతున్నారు. అయితే ఎన్ కౌంటర్ పై అనుమానాలు వ్యక్తం చేస్తూ పలు మహిళా సంఘాలు జాతీయ మానవ హక్కుల కమిషన్ కి ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన ఎన్ హెచ్ ఆర్సీ బృందం దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై దర్యాఫ్తు చేపట్టింది. నిజాలు నిగ్గు తేల్చే పనిలో పడింది.

దీనిపై సినీ నటి ప్రత్యూష తల్లి సరోజినీ దేవి తీవ్రంగా స్పందించారు. దిశ కేసులో రేపిస్టులను ఎన్ కౌంటర్ చేయడం సరైనదే అన్నారామె. రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తే మానవ హక్కుల ఉల్లంఘన ఎలా అవుతుందని సరోజినీ దేవి ప్రశ్నించారు. తన కూతురిని దారుణంగా రేప్ చేసి చంపడం మానవ హక్కుల ఉల్లంఘన కాదా అని నిలదీశారు. కొందరు మృగాళ్లు తన కూతురిని క్రూరంగా చంపినప్పుడు మానవ హక్కుల సంఘం ఏమైంది, ఎక్కడుంది, ఎందుకు నోరు విప్పలేదు అని సరోజినీ దేవి అడిగారు. ఒక నిర్భయ, ఒక ప్రత్యూష, ఒక ఆయేషా, మానస, లక్ష్మి, 9 నెలల పసిపాప కేసుల్లో ఎన్ హెచ్ ఆర్సీ ఎందుకు స్పందించలేదని సరోజినీ దేవి ప్రశ్నించారు. ఇంతమంది ఆడపిల్లలు మృగాళ్ల బారిన పడి అత్యాచారానికి గురై చనిపోతే.. మానవ హక్కుల సంఘానికి బాధ అనిపించలేదా అన్నారు.

తన లాంటి తల్లులను ఎవరు ఓదారుస్తారు అని ప్రత్యూష తల్లి సరోజినీ దేవి వాపోయారు. అసలు రేపిస్టులను బెయిల్ పై ఎందుకు విడుదల చేస్తున్నారని ఆమె అడిగారు. రేపిస్టులను బెయిల్ పై విడుదల చేయడం వల్లే ఉన్నావ్ లో బాధితురాలు బలైపోయిందన్నారు. అసలు మరణశిక్ష పడే వరకు జైల్లో ఉంచకుండా రేపిస్టులకు ఎందుకు బెయిల్ ఇస్తున్నారని ప్రశ్నించారు. 

prathyusha

నేరారోపణ కాకుండానే పోలీసులు దిశ కేసు నిందితులను ఎన్ కౌంటర్ చేశారని తెగ బాధపడిపోతున్న వారు, మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందంటున్న ఎన్ హెచ్ ఆర్సీ సభ్యులపై ప్రత్యూష తల్లి సరోజినీ దేవి ప్రశ్నల వర్షం కురిపించారు. ”అత్యాచారానికి గురై దారుణంగా చంపబడ్డ బాధిత కుటుంబాలను మానవ హక్కుల సంఘం పరామర్శించిందా? మీకు ఏం అన్యాయం జరిగింది? ఎలా జరిగింది? మీ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది? కుటుంబ పరిస్థితి ఏంటి? అని మానవ హక్కుల సంఘం అడిగిందా? అది మానవ హక్కుల సంఘం బాధ్యత కాదా? నిర్భయ కేసులో నిందితులకు ఉరి శిక్ష పడి ఏడేళ్లు అవుతున్నా.. ఇంతవరకు వారికి శిక్ష పడలేదు. మరి జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు దాన్ని అడిగారా? తనలాంటి తల్లులకు అన్యాయం జరిగినప్పుడు మీరంతా ఏమయ్యారు?” అని సరోజినీ దేవి ప్రశ్నించారు.

READ  ఆంధ్రా బ్యాంక్ పేరు మార్పు బాధాకరం : మంత్రి హరీశ్ రావు

17 ఏళ్లుగా తన కూతురి కేసులో న్యాయం కోసం ఎదురుచూస్తున్నానని సరోజినీ దేవి కన్నీరు పెట్టారు. తన కూతురి కేసులో అధికారం, డబ్బు, హోదా ఉపయోగించి నిందితులు తప్పించుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసులో చట్టాలు, న్యాయాలు, మానవ హక్కుల గురించి మాట్లాడే వాళ్లు.. వారి కుటుంబాల్లో ఇలాంటి హత్యాచారం ఘటనలు జరిగితే.. ఇలాగే చట్టం, న్యాయం గురించి మాట్లాడతారా అని ఆమె ప్రశ్నించారు. కఠిన చట్టాలు రూపొందించి వాటిని కచ్చితంగా అమలు చేసినప్పుడే ఇలాంటి ఎన్ కౌంటర్లు జరగవు అని ఆమె అన్నారు.

2002 ఫిబ్రవరి 23న సినీ నటి ప్రత్యూష మృతి చెందింది. ప్రత్యూష మరణం సంచలనం రేపింది. ఆమె మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అత్యాచారం చేసి గొంతు నులిమి చంపారని ఫోరెన్సిక్ రిపోర్టులో తేలింది. అయితే ప్రత్యూషది ఆత్మహత్యగా నిరూపించేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఈ కేసులో రాజకీయ నేతల కుమారుల ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. 17 ఏళ్లుగా ఈ కేసులో న్యాయం కోసం ప్రత్యూష తల్లి ఎదురుచూస్తున్నారు.

Related Posts