కిసాన్ బిల్లు 2020: రైతులపై డెత్ వారెంట్ అంటున్న కాంగ్రెస్.. దేశవ్యాప్తంగా నిరసనలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రాజ్యసభలో వ్యవసాయ రంగ బిల్లులను పార్లమెంటు ఆమోదించిన తరువాత, కాంగ్రెస్ ఈ బిల్లుపై దేశవ్యాప్త ఆందోళనను ప్రారంభించింది. ఈ బిల్లులో ప్రతిపాదిత చట్టాలకు వ్యతిరేకంగా రైతులు మరియు పేదల నుంచి రెండు కోట్ల సంతకాలను సేకరించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది.

దేశవ్యాప్తంగా వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా వరుస విలేకరుల సమావేశాలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సుర్జేవాలా వెల్లడించారు. రాష్ట్ర పార్టీ ముఖ్యులు, ఇతర సీనియర్ నాయకులు ఆయా రాష్ట్రాల్లో కవాతులు చేపట్టి సంబంధిత రాష్ట్ర గవర్నర్‌లకు మెమోరాండాలు సమర్పించేందుకు ప్లాన్ చేస్తున్నారు.వ్యవసాయ రంగానికి సంబంధించి పెట్టిన రైతు వ్యతిరేక బిల్లును ఆమోదించడం ద్వారా మోడీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా ఒక విధంగా డెత్ వారెంట్ జారీ చేసిందని కాంగ్రెస్ విమర్శిస్తుంది. వ్యవసాయ బిల్లులను ఆదివారం ఆమోదించేందుకు ఎనిమిది మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడంపై కాంగ్రెస్ నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యయి. దీంతో రాజ్యసభలో సోమవారం అనేకసార్లు అంతరాయం ఏర్పడింది.

సస్పెండ్ చేసిన సభ్యులలో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన డెరెక్ ఓబ్రెయిన్, డోలా సేన్, కాంగ్రెస్‌కు చెందిన రాజీవ్ సాతావ్, సయ్యద్ నజీర్ హుస్సేన్, రిపున్ బోరా, ఆప్‌కు చెందిన సంజయ్ సింగ్, సిపిఐ-ఎమ్‌కు చెందిన కెకె రాగేష్, ఎలమారామ్ కరీం ఉన్నారు. ఎనిమిది మంది సభ్యులు సోమవారం పార్లమెంటు వెలుపల ధర్నా చేశారు.పెద్ద కంపెనీలకు, కార్పోరేట్లకు ప్రయోజనం చేకూర్చే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ఇటువంటి చట్టాన్ని తీసుకువచ్చిందని, ఈ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయడానికి వీళ్లేదు అని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది.

పంజాబ్ కాంగ్రెస్ సోమవారం రాష్ట్రంలో వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేసింది. ఈ బిల్లులు వ్యవసాయ సమాజాన్ని ‘నాశనం చేస్తాయి’ అని పార్టీ ఆరోపించింది. ‘రైతు వ్యతిరేక’ బిల్లులపై కాంగ్రెస్ కార్యకర్తలు బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి బిల్లులకు సంబంధించిన కాపీ జెరాక్స్‌లను దహనం చేశారు.వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా వేర్వేరు నిరసనలు నిర్వహించిన తరువాత, మొత్తం 30 రాష్ట్ర రైతు సంస్థలు ఉమ్మడి వేదికపైకి వచ్చి సెప్టెంబర్ 25 న పంజాబ్‌లో బంద్‌ నిర్వహించాలని నిర్ణయించాయి. దీనికి అఖిల భారత కిసాన్ సంగ్రాష్ కోఆర్డినేషన్ కమిటీ (ఎఐకెఎస్‌సిసి) రాష్ట్ర యూనిట్ మద్దతు ప్రకటించింది. రైతు వ్యతిరేక చర్యలను బిజెపి ప్రభుత్వం ఆపాలని ఈ సంధర్భంగా యూనియన్లు డిమాండ్ చేశాయి.

Related Posts