సైకిల్ దిగిన పులివెందుల పులి.. ఇప్పుడెందుకీ సైలెంట్? సతీష్ పయనమెటు?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులతో తలపడిన చరిత్ర ఆయనది. గెలుపు తలుపు తట్టకపోయినా ఆయన అధైర్యపడలేదు. నమ్ముకున్న పార్టీ కోసం శ్రమించాడు. ఇంతలో ఏమైందో ఏమో గానీ.. ఉన్నపళంగా సైకిల్ దిగేశాడు. ఫ్యాన్ కింద సేద తీరుతాడని అందరూ అనుకున్నారు. అదీ జరగలేదు. పులివెందులలో పులిబిడ్డతో తలపడిన పులి ఇప్పుడెందుకు సైలెంట్‌ అయింది.

టీడీపీకి షాక్‌ మీద షాక్ తగులుతూనే ఉంది. ప్రస్తుత గడ్డు పరిస్థితుల్లో పులివెందుల నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ కుమార్ రెడ్డి టీడీపీకి గుడ్‌బై చెప్పడం తీరని లోటుగా చెప్పొచ్చు. టీడీపీని వీడే సమయంలో తన స్వగృహంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి కన్నీటిపర్యంతమయ్యారు.దశాబ్దాలుగా వైఎస్ కుటుంబంతో తలపడుతున్నా.. పార్టీ సరైన ప్రాధాన్యత కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం విశేషంగా కృషి చేసినా ఫలితం లేకుండా పోయిందని.. ఇంకా మనసు చంపుకుని పార్టీలో ఉండలేనని ఆవేదన వ్యక్తం చేశారు. సతీష్‌ ఫ్యామిలీ అంతా పార్టీకి రాజీనామా చేసింది.

వైసీపీ కండువా కప్పుకుంటారా? :
నమ్మకున్న పార్టీ కోసం శక్తివంచన లేకుండా కృషి చేసినా.. అధినేత చంద్రబాబు తనను నమ్మలేదన్నాడు సతీష్‌. అందుకే రాజీనామా చేస్తున్నానని ప్రకటించాడు. ఆ సమయంలో సతీష్‌ వైసీపీ కండువా కప్పుకుంటారని కొందరు భావించారు. కమలం గూటికి చేరుతారని మరికొందరు అనుకున్నారు. కానీ ఆయన మాత్రం ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు సతీష్ టిడిపిని వీడారు. దీంతో పులివెందుల నియోజకవర్గంలో స్థానిక సంస్థల్లో టిడిపి పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల కరువయ్యారు. టిడిపిని వీడి నాలుగు నెలలు గడుస్తున్నా సతీష్ పయనమెటు అన్నది ఎవ్వరికీ అర్థం కావడం లేదు.

పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కుటుంబానికి గట్టి పోటీ ఇస్తూ వచ్చిన సతీష్.. ఇప్పుడు ఆ కుటుంబంతోనే చేతులు కలపనున్నారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు సతీష్ పార్టీలోకి వస్తే ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉందట. ప్రచారాలు ఎలా ఉన్నా సతీష్‌ త్వరలోనే భవిష్యత్తుపై కార్యాచరణ ప్రకటిస్తారని ఆయన వర్గీయులు చెబుతున్నారు.


Related Posts