రష్యాలో తీవ్ర కలకలం : పుతిన్ ప్రత్యర్థిపై విష ప్రయోగం…పరిస్థితి విషమం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రష్యాలో తీవ్ర కలకలం రేగింది. ప్రతిపక్ష నేత అలెక్సీ నవాల్నీ(44)పై గుర్తు తెలియని వ్యక్తులు విష ప్రయోగం చేశారు. సైబీరియాలోని ఓ ఆస్పత్రిలో అలెక్సీ నవాల్నీకి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని.. కోమాలో ఉన్నారని డాక్టర్లు తెలిపారు. ఆయన చావు బతుకుల మధ్య ఉన్నారని అలెక్సీ నవాల్నీ అధికార ప్రతినిధి కిరా యార్మిష్ ట్విటర్ ద్వారా ప్రకటన చేశారు.

ర‌ష్యాలో అవినీతి వ్య‌తిరేక ఉద్య‌మాన్ని న‌వాల్నీ నిర్వ‌హిస్తున్నారు. అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను.. న‌వాల్నీ తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. మ‌రో రెండు ప‌ర్యాయాలు అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టేందుకు ఇటీవ‌ల పుతిన్ రాజ్యాంగ స‌వ‌ర‌ణ చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. అయితే ఆ సంస్క‌ర‌ణ‌ల అమ‌లులో భారీ కుట్ర జ‌రిగిన‌ట్లు న‌వాల్నీ ఆరోపిస్తున్నారు.

అలెక్సీ నవాల్నీ అధికార ప్రతినిధి కిరా యార్మిష్ తెలిపిన వివరాల ప్రకారం…. సైబీరియాలో టోమస్క్ సిటీ నుంచి మాస్కోకు విమానంలో వెళ్తుండగా అలెక్సీ ఒక్కసారిగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఒళ్లంతా చెమటలు పట్టాయి. ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితుల్లో.. తనతో మాట్లాడాల్సిందిగా కిరాను కోరారు అలెక్సీ. ఆమె మాట్లాడుతున్న మాటలు వినబడుతున్నాయో లేదో నిర్ధారించుకునేందుకు.. అలానే మాట్లాడుతూ ఉండాలని చెప్పారు. ఆ తర్వాత బాత్రూమ్‌లోకి వెళ్లి కిందపడిపోయి అపస్మార స్థితిలోకి వెళ్లిపోయారు అలెక్సీ. బాత్రూమ్ నుంచి ఎంతకూ రాకపోవడంతో సిబ్బంది వెళ్లి చూడగా.. ఆయన కిందపడి పోయి ఉన్నారు.

వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని ఓమస్క్ సిటీలో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. అక్కడి నుంచి నేరుగా సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నారు. ఆయన శరీరంలో విషం అవశేషాలు ఉన్నాయి.. వేడి వేడి ద్రావణం ద్వారా విషం లోపలికి వెళ్లిందని డాక్టర్లు తెలిపారు. ఐతే ఉదయాన్నే అలెక్సీ టీ తాగారని ఆయన అధికార ప్రతినిధి కిరా యార్మిష్ తెలిపారు. ఈ నేపథ్యంలో క్యాంటిన్‌లోనే టీలో ఎవరో విషం కలిపారని భావిస్తున్నారు.

Related Tags :

Related Posts :