1.40 లక్షల పోస్టుల భర్తీకి రైల్వే రెడీ…డిసెంబర్​లో పరీక్షలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. కరోనా సంక్షోభంతో ఆగిపోయిన రైల్వే పోస్టుల నియామక ప్రకియ డిసెంబర్ లో ప్రారంభంకానుంది. ఈ మేరకు ఉద్యోగాల భర్తీకి నిర్వహించాల్సిన పరీక్షలపై రైల్వేశాఖ కీలక ప్రకటన చేసింది.

దేశవ్యాప్తంగా 1.40లక్షల ఉద్యోగాల భర్తీకి డిసెంబర్‌ 15 నుంచి పరీక్షల ప్రక్రియ ప్రారంభించనున్నట్టు, మూడు విభాగాల్లో 1.40లక్షల ఉద్యోగాల నియామకానికి దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని రైల్వే బోర్డు ఛైర్మన్‌ వినోద్‌కుమార్‌ యాదవ్‌ తెలిపారు.

మొత్తం 1,40,640 పోస్టుల భర్తీ కోసం కరోనా వ్యాప్తికి ముందే రైల్వే.. నోటిఫికేషన్ జారీ చేయగా .. దాదాపు 2.4 కోట్ల మందికి పైగా దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, అభ్యర్థులందరికీ కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష (సీబీటీ) నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కరోనా నేపథ్యంలో ఆ పరీక్షలు వాయిదా పడ్డాయని వినోద్‌కుమార్ తెలిపారు. పూర్తి షెడ్యూల్‌ను అతి త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం జేఈఈ, నీట్‌ పరీక్షలు జరుగుతుండటం వల్ల వాటి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని కరోనా వల్ల నిలిచిపోయిన ఈ పరీక్షలను ప్రారంభించాలని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు.

రైల్వేశాఖ గతంలో జారీచేసిన నోటిఫికేషన్‌ ప్రకారం… నాన్ టెక్నికల్ పాప్యులర్ కేటగిరీలైన గార్డులు, ఆఫీస్ క్లర్క్, కమర్షియల్ క్లర్క్ విభాగాల్లో 35,208 పోస్టులు, ఐసోలేటెడ్ అండ్ మినిస్ట్రీరియల్ కేటగిరీలైన స్టెనో, టీచెస్ వంటి వాటిలో 1,663 పోస్టులు, ట్రాక్ మెయింటెనెన్స్, పాయింట్స్‌మేన్ వంటి ఉద్యోగాలు 1,03,769 లను భర్తీ చేయనున్నారు. పరీక్షలకు సంబంధించి త్వరలోనే షెడ్యూలు విడుదల చేయనుంది.

Related Posts