సచిన్ పైలట్ తో టచ్ లో 30 MLAలు….ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు గెహ్లాట్ చివరి ప్రయత్నాలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రాజస్థాన్‌ అధికార కాంగ్రెస్ సర్కారులో సంక్షోభం మరింత ముదిరింది. సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య అగాధం పెరగడంతో అశోక్ గెహ్లాట్ సర్కారు కూలిపోవడం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు అశోక్ గెహ్లాట్ వర్గం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై కేబినెట్‌ మంత్రులతో సీఎం అశోక్ గెహ్లాట్ ఆదివారం సమావేశమై చర్చించారు. ఈ నేపథ్యంలో తనకు మద్దతిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, స్వతంత్ర ఎమ్మెల్యేలతో ఇవాళ రాత్రి 9 గం.లకు సీఎం అశోక్ గెహ్లాట్ జైపూర్‌లో సమావేశంకానున్నారు.

అటు సచిన్ పైలట్ సహా ఆయన మద్ధతుదారులైన 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీలోనే ఉన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో సమావేశం కోసం సచిన్ పైలట్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. సచిన్ పైలట్‌తో పాటు కొందరు ఎమ్మెల్యేలు మనేసర్‌లోని ఐటిసి గ్రాండ్ హోటల్‌లో ఉంటున్నట్లు తెలుస్తోంది. సచిన్ పైలట్‌తో సన్నిహితంగా భావించే రాజస్థాన్ మంత్రులు అశోక్ గెహ్లాట్ పిలిచిన మంత్రుల సమావేశానికి హాజరు కాలేదు.

తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని సీఎం అశోక్ గెహ్లాట్ శనివారం ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, స్వతంత్ర ఎమ్మెల్యేలకు కోట్లాది రూపాయలు ఎరవేసి తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ నేతలు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అయితే ఆయన ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య ఆధిపత్యపోరు కారణంగానే సంక్షోభం నెలకొంటోందని బీజేపీ తెలిపింది.

SOG నోటీసుపై సచిన్ పైలట్ గుర్రు..
గెహ్లాట్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ బేరసారాలకు పాల్పడుతోందన్న ఆరోపణలపై రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్(ఎస్ఓజీ) ఎఫ్ఐఆర్ నమోదుచేసింది. ఈ వ్యవహారంపై తనకు కూడా ఎస్ఓజీ నోటీసు జారీ చేయడంపై సచిన్ పైలట్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన అశోక్ గెహ్లాట్…కాంగ్రెస్ వైపు వాదన చెప్పేందుకే తనతో పాటు డిప్యూటీ సీఎం, చీఫ్ విప్‌కు ఎస్ఓజీ నోటీసులు జారీ చేసిందని చెప్పారు. దీన్ని వక్రీకరిస్తూ ఓ వర్గం మీడియా కథనాలు ప్రసారం చేస్తోందని మండిపడ్డారు.

నెంబర్ గేమ్

-200 సీట్లున్న రాజస్తాన్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 106 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
-13 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలలో 12 మంది కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు.
-అయితే, ఆదివారం ఉదయం 3 ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి తమ మద్దతును వెనక్కి తీసుకున్నారు.
-రాష్ట్రీయ జనతా దళ్, భారతీయ ట్రైబల్ పార్టీ లకు చెందిన 3 గురు ఎమ్మెల్యేలు కూడా గెహ్లాట్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు.
-CPI(M)కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా గెహ్లాట్ ప్రభుత్వానికిబయటి నుంచి మద్దతిస్తున్నారు.
-బీజేపీకి 72 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
-కాంగ్రెస్ సంకీర్ణానికి ప్రస్తుతం ప్రతిపక్షాల కంటే 48 సీట్ల మెజారిటీ ఉంది.

READ  హనీట్రాప్ : అందమైన అమ్మాయిల వలలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు

బీజేపీతో సచిన్ పైలట్ చర్చలు
మరోవైపు, రాజస్తాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ ఢిల్లీలో బీజేపీ నేతలతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఆయనకు రాజస్తాన్ సీఎం పదవిని మాత్రం కట్టబెట్టేందుకు కమలనాథులు సిధ్ధంగా లేరని, ఇదంతా మీ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారమని చెబుతున్నారని తెలుస్తోంది. సచిన్ పైలట్ సొంతంగా ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేయవచ్ఛునని కూడా ఊహాగానాలు వస్తున్నాయి.

సచిన్ పైలట్ కు 30మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు
ఇప్పటి వరకు సచిన్ పైలెట్ వెంట 19 మంది, 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారనే ప్రచారం ఉంది. ఇప్పుడు ఆ సంఖ్య 30కి పెరిగినట్టు తెలుస్తోంది. 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మరికొందరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు సచిన్ పైలట్ కు మద్దతు పలికినట్టు సమాచారం. సచిన్ పైలట్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తమ మద్దతు ఉంటుందని ఆ 30 మంది ఎమ్మెల్యేలు చెబుతున్నారు.

పైలట్ ను సైడ్ లైన్ చేయడం బాధాకరం

మరోవైపు బీజేపీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా ఈ అంశంపై స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీలో ప్రతిభ, సామర్థ్యానికి విశ్వసనీయత తక్కువగా ఉంటుందని విమర్శించారు. రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్.. ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ను కావాలనే పక్కకు బెట్టి, ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. తన మాజీ సహచరుడు సచిన్‌ను ఇలా చూడటం బాధగా ఉందన్నారు

Related Posts