rajiv-gandhi-killer-nalini-attempts-suicide-in-prison

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకురాలు నళిని ఆత్మహత్యాయత్నం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య కేసులో నిందితురాలు నళిని శ్రీహరన్‌ ఆత్మహత్యాయత్నం చేశారు. తమిళనాడులోని వేలురు జైలులో సోమవారం రాత్రి ఆమె ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. విషయం గమనించిన జైలు సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలించారు. నళిని ఆత్మహత్య చేసుకోటానికి గల కారణం తెలియరాలేదు.

రాజీవ్‌ గాంధీ హత్య కేసులో దోషిగా తేలిన నళిని 29 ఏళ్లుగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు. బెయిల్‌ కోసం గత కొంత కాలంగా ఆమె తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తన కుమార్తె హరిత వివాహానికి ఆరు నెలలు పాటు పెరోల్‌పై విడుదలై తిరిగి జైలుకు వెళ్లారు. రాజీవ్‌ హత్యకేసులో నళినితో పాటు ఆమె భర్త మురుగన్‌ సహా ఏడుగురు వేలూరు సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

గత 29 ఏళ్లలో నళిని ఆత్మహత్యాయత్నం చేయటం ఇది మొదటి సారని ఆమె లాయర్ పుహళేంది చెప్పారు. నళినికి, జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న మరో ఖైదీకి మధ్య ఘర్షణ జరిగినట్లు తెలిసిందని తెలిపారు. ఆ ఖైది ఘర్షణ ను జైలర్ కు చాలా పెద్ద ఘటన గా అభివర్ణించి చెప్పటంతో నళిని మనస్తాపానికి గురై సూసైడ్ ప్రయత్నం చేసి ఉంటారని ఆయన అన్నారు.

నళినీ ని వేరే జైలుకు తరలించే ప్రయత్నంలో ఉన్నామని అందుకు సంబంధించిన పిటీషన్ త్వరలో వేయబోతున్నామని ఈలోగా ఇది జరిగిందని ఆయన తెలిపారు. మరింత సమాచారం కోసం జైలు అధికారులను సంప్రదిస్తానని పుహళేంది చెప్పారు.

గత 29 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న నళిని, ఎక్కువ కాలం జైలు జీవితం గడిపిన మహిళగా కూడా గుర్తింపు పొందింది. 1991, మే నెలలో ఎన్నికల ప్రచారం నిమిత్తం విశాఖ పట్నం నుంచి తమిళనాడులోని శ్రీ పెరుంబుదూర్‌కి వెళ్లిన రాజీవ్‌ గాంధీని ఎల్‌టీటీఈ ఆత్మాహుతి దళ సభ్యులు బాంబు పేల్చి హతమార్చారు.

రాజీవ్ గాంధీ హత్య  కేసులో ఏడుగురికి టాడా కోర్టు ఉరిశిక్ష వేయగా, తర్వాత దాన్ని జీవిత ఖైదుగా మార్చారు. ఆ నిందితుల్లో నళిని ఒకరు. కాగా గతంలోనూ న్యాయస్థానం ఆమెకు ఒక్కరోజు పెరోల్ ఇచ్చింది. గత ఏడాది నళిని తండ్రి శంకర్‌ నారాయణన్‌ అంత్యక్రియల కార్యక్రమానికి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.

 

Related Posts