లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

ఏపీ రాజకీయాల్లో రామతీర్థం రగడ

Published

on

ramateertham political battle in vizianagaram district : రామతీర్థం ఘటనపై ఏపీ రాజకీయాలు మరింత హీటెక్కాయి. ఆదివారం కూడా రామతీర్థంలో హైటెన్షన్‌ కొనసాగింది.  విజయనగరం జిల్లాలోని రామతీర్థం కొండను మంత్రులు వెల్లంపల్లి, బొత్స పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. హిందూ ధార్మిక సంస్థల కార్యకర్తల ఆందోళన దృష్ట్యా.. మెట్ల మార్గం నుంచి కాక వెనుక మార్గం ద్వారా కొండపైకి వెళ్లారు మంత్రులు.

నిన్న, మొన్నటిదాకా ప్రశాంతంగా కనిపించిన ఏపీలో ఒక్కసారిగా సీన్ మారింది… సామాజిక చర్చలు, రాజకీయ విమర్శలు, ఆరోపణలన్నీ మతం, దేవుళ్ల చుట్టూ చేరాయి. రామతీర్థ ఘటనతో రాష్ట్ర రాజకీయం రణరంగాన్ని తలపిస్తోంది. టీడీపీ అధినేత టార్గెట్‌గా మంత్రులు ఆరోపణలు చేయడగా… అదేస్థాయిలో ప్రతిపక్ష నేతలు ప్రభుత్వాన్ని కౌంటర్‌ చేశారు. బీజేపీ , జనసేనలు మంగళవారం ఛలో రామతీర్థం కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. మరోవైపు రామతీర్థంలో బీజేపీ నేతల దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ముందు జాగ్రత్త చర్యలుగా ఆదివారం తెల్లవారుజామున బీజేపీ నేతలను అరెస్ట్ చేశారు. బోడికొండ ప్రాంతంలో పోలీసులు గట్టి బందోబస్తు కొనసాగుతోంది.

రామతీర్థం ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబును మంత్రులు టార్గెట్‌ చేశారు. ఈ వ్యవహారం వెనక చంద్రబాబు హస్తం ఉందని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం కల్పించుకుని చంద్రబాబుకు నార్కో ఎనాలసిస్ టెస్టు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రి బొత్స కూడా చంద్రబాబుపై పలు ఆరోపణలు చేశారు.. విగ్రహ ధ్వంసం ఘటన వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఆరోపించారు. అన్ని నిజాలు త్వరలోనే బయటకు వస్తాయని.. దుష్టశిక్షణ రాముడు స్వయంగా చేస్తాడన్నారు.

మరోవైపు రామతీర్థం ఆలయంలో శ్రీరాముని విగ్రహం ధ్వంసం ఘటనకు బాధ్యత వహిస్తూ మంత్రి వెల్లంపల్లి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. రామతీర్ధం ఘటనకు నిరసనగా విశాఖలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించింది. రామతీర్థం ఘటనలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్‌ పర్సన్‌ సంచయిత జగపతిరాజు. బాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఇంతేనా అంటూ ట్వీట్‌ చేశారు. ఈ ఘటనకు బాధ్యులు ఎవరో తనకు తెలియదనడం హాస్యాస్పదమన్నారు.

రామతీర్థం ఘటనకు సంబంధించిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశామని విజయనగరం ఎస్పీ రాజకుమారి తెలిపారు. 20 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. కేసు దర్యాప్తులో ఎటువంటి రాజకీయ కోణం లేదని… అందరూ సంయమనం పాటించాలని ఆమె సూచించారు.

రామతీర్థం ఘటన నేపథ్యంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై కేసు నమోదైంది. ఎంపీ విజయసాయిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో చంద్రబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. చంద్రబాబుతోపాటు.. టీడీపీ నేతలు కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడుపైనా కేసు నమోదైంది. విజయసాయిరెడ్డి కొండపై నుంచి దిగివస్తున్న సమయంలో ఆయన కారుపై జరిగిన దాడి ఘటనకు బాధ్యులుగా చంద్రబాబుపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

ఇక బీజేపీ , జనసేన ఛలో రామతీర్థం కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. మంగళవారం ఈ కార్యక్రమం జరుగనుంది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు భారీగా మోహరించారు.