Home » చైనా,కరోనాని ఎదుర్కొనేందుకు సిద్ధం…నేవీ చీఫ్
Published
2 months agoon
Navy chief Admiral Karambir Singh భవిష్యత్తులో నౌకాదళానికి అవసరమైన యుద్ధనౌకలు, జలాంతర్గాములను దేశీయంగా నిర్మించనున్నామని గురువారం నౌకాదళ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. స్వదేశీయంగా నిర్మించనున్న వాటిలో 41 యుద్ధనౌకలతో పాటు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ కూడా ఉన్నట్లు సింగ్ తెలిపారు. భారత నౌకాదళం ప్రస్తుతం రెండు సవాళ్లను ఎదుర్కొంటోందని తెలిపారు.
కరోనాతోపాటు వాస్తవాధీన రేఖ వద్ద చైనా దళాల దురాక్రమణ సాగుతున్నట్లు సింగ్ తెలిపారు. అయితే ఈ రెండు సవాళ్లను ఎదుర్కొనేందుకు నౌకాదళం సిద్ధంగా ఉందని కరంబీర్ సింగ్ చెప్పారు. ఒకవేళ భారత జలాల్లోకి చైనా నౌకలు ప్రవేశిస్తే, అప్పుడు వారిని అడ్డుకునేందుకు తమ వద్ద ప్రామాణికమైన పద్ధతులు ఉన్నాయన్నారు.
కాగా, లీజుకి తీసుకున్న రెండు ప్రిడేటర్ డ్రోన్లు నిఘాను పెంచినట్లు నేవీ చీఫ్ చెప్పారు. 24 గంటల పాటు అవి నిఘా పెట్టడం వల్ల నిఘా సామర్థ్యం పెరిగిందన్నారు. ఒకవేళ ఆ డ్రోన్లు కావాలని ఆర్మీ, వైమానిక దళం భావిస్తే, ఆ డ్రోన్లను ఇచ్చేందుకు పరిశీలిస్తామన్నారు. ఆర్మీ, ఎయిర్ఫోర్స్ సంయుక్త సహకారంతో నౌకాదళం పటిష్టమవుతోందని, చైనాను ఎదుర్కొనేందుకు ముగ్గురం కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు.
నవంబర్లో నలుగురు మహిళా ఆఫీసర్లను ఇండియన్ నేవీ నియమించిందని, మాల్దీవులు, రష్యాకు చెందిన నౌకలపై మరో ఇద్దరు మహిళా ఆఫీసర్లను నియమించినట్లు నేవీ చీఫ్ తెలిపారు.