Home » రామా నీనామమేమిరా..! : శ్రీరామచంద్రుడా ? నారాయణుడా ?
Published
2 years agoon
By
madhuదక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలం క్షేత్రంలో కొలువున్నది శ్రీరామచంద్రుడా? నారాయణుడా? కొన్ని ఏళ్లుగా జరుగుతోన్న ఈ చర్చ ఎడతెగడం లేదు. సీతారామచంద్ర స్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి ఇదే చర్చ మొదలైంది. అసలు ఇక్కడ ఉన్నది సీతాదేవీ సహిత అయోధ్య రాముడేనా? లేక శ్రీలక్ష్మీ సమేతుడైన నారాయణుడా? భద్రాద్రిలో రేగుతోన్న ఈ వివాదం వెనుక కారణాలేంటి?
భద్రాచలం..ఆ కోదండ రాముడు..సీతాదేవి సమేతంగా కొలువైన పుణ్యక్షేత్రం. ప్రతి ఏటా సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంటుంది. శ్రీరామనవమి వస్తోందంటే శ్రీ సీతారామ కల్యాణమా? శ్రీలక్ష్మీనారాయణుల కల్యాణమా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. తీరా కల్యాణం అయిపోయాక మళ్లీ అందరూ మౌనంగా ఉండిపోతున్నారు. ఇది నిత్యం కొనసాగడం వల్ల భద్రాద్రి ఆలయ ప్రతిష్టకు భంగం కలుగుతుందనే ఆందోళన భక్తుల్లో వ్యక్తం అవుతోంది.
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవంలో రామనారాయణ అనే మాటను వైదిక బృందం ఉపయోగిస్తోంది. కొన్ని వర్గాలు దీన్ని తప్పుపడుతున్నాయి. ఏప్రిల్ 6 నుంచి 20 వరకు శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సమయంలో గుంటూరు జిల్లా ఆరేపల్లి అగ్రహారానికి చెందిన డాక్టర్ చిదంబరశాస్త్రి రాసిన భద్రాద్రీశునకు జరుగుతున్న ఘోరాపచారం అనే పుస్తకం రాశారు. ఈ పుస్తకాన్ని స్థానికులు కొందరు దేవస్థానం అధికారులకు పంపిణీ చేశారు. ఈ పుస్తకం పెద్ద దుమారాన్నే రేపుతోంది. రామాలయ కార్యాలయ, ఆలయ సిబ్బంది ముక్త కంఠంతో ఈ పుస్తకంలోని అంశాలను ఖండించారు. పుస్తకంలోని ప్రతి పదం తప్పేనని అంటున్నారు. ఆలయ ఈవో తాళ్లూరి రమేష్‌బాబు మాత్రం పూర్వ సంప్రదాయమే రామాలయంలో కొనసాగుతుందని వెల్లడించారు. దీనిపై అర్చకుల అభిప్రాయాలు కూడా తెలుసుకున్నామని, పూర్తి నివేదికను కమిషనర్‌కు పంపిస్తామని చెబుతున్నారు.
ఈ తతంగం అంతా పరిశీలిస్తుంటే కుట్రలా ఉందని, తమ వద్ద రామనారాయణ అనే పదానికి సంబంధించి అనేక అధారాలున్నాయని మాజీ ప్రధానార్చకులు క్నష్ణమాచార్యులు చెబుతున్నారు. 1964 ఆలయ జీర్ణోద్దరణ సమయంలో ప్రభుత్వం, దేవస్థానం కలిపి తయారు చేసిన పుస్తకంలో 60 ఏళ్లకు ఒకసారి జరిగే మహా సామ్రాజ్య పట్టాభిషేక సమయంలోనూ 1987లో ఆనాటి ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ విడుదల చేసిన సావనీర్లోనూ రామనారాయణ పదముంది. ప్రతి ఆలయానికి కొన్ని ఆచార సంప్రదాయాలుంటాయి.
వంశపారంపర్యంగా వచ్చే వాటిపై కూడా కొందరు లేని పోని అభాండాలు సృష్టించారని అంటున్నారు. రాముడు, రామదాసు, అర్చకులను నిందిస్తూ చిదంబరం శాస్త్రి పుస్తకం రాయడం పట్ల ఆవేదన వెలిబుచ్చారు. పుస్తకంలో మొదటి పేజీలో రాముల వారు చిత్రపటం, చివరి పేజీలో కల్యాణ మండపం ఉన్న నేపథ్యంలో పుస్తకాన్ని చింపివేసి, నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే ఈ విషయంపై కలుగజేసుకొని చట్టపరంగా ఇబ్బందులు తలెత్తకుండా, భవిష్యత్తులో సమస్యలు పునరావృతం కాకుండా సమస్యను పరిష్కరించాలని భక్తులు కోరుతున్నారు.