వెలకట్టలేని ఎర్రకోట గ్రేట్ హిస్టరీ గురించి తెలుసా..?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఆధునిక భారతదేశ చరిత్రకి.. ఈ ఎర్రకోటకు విడదీయరాని అనుబంధం ఉంది. 1857లో సిపాయిల తిరుగుబాటుగా ప్రారంభమైన అలజడి.. మహా సంగ్రామంగా మారింది. మీరట్ లో తిరుగుబాటు ప్రారంభం కాగానే అక్కడి సిపాయిలు.. ఆఘమేఘాల మీద ఢిల్లీ వెళ్లి ఈ ఎర్రకోటలోనే బహదూర్ షా-2ను భారతదేశ చక్రవర్తిగా ప్రకటించారు. ఆయన నాయకత్వం కిందే సమరయోధులంతా ఒక్కటై నడిచారు. ఇదే కోటలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన అజాద్ హింద్ ఫౌజ్ కు చెందిన ముగ్గురు వీరులు గురుభక్ష్ సింగ్ ధిల్లాన్, ప్రేమ్ కుమార్ సెహగల్, సయ్యద్ షానవాజ్ ఖాన్ లపై రాజద్రోహనేరం మోపి, సైనిక విచారణ జరిపింది.

స్వాతంత్ర్య పోరాటాన్ని క్లైమాక్స్‌కు చేర్చిన మహోద్విగ్న ఘట్టాలవి. కోట లోపల విచారణ జరుగుతుండగా లాల్ ఖిలే సే ఆయీ ఆవాజ్.. సెహగల్, ధిల్లాన్, షానవాజ్, తీనోంకీ హో ఉమర్ దరాజ్ అని అశేష ప్రజానీకం దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేసింది. ఈ నినాదాలే దేశమంతటా ప్రతిధ్వనించాయి. లా చదివినా అప్పటికి ఎన్నో యేళ్ళ కిందటే కోటు విప్పి కదనరంగంలోకి దూకిన హేమాహేమీలు నెహ్రూ, అసఫ్ అలీ, భులాబాయ్ దేశాయ్, తేజ్ బహదూర్ సప్రూ, కైలాస్ నాథ్ కట్జు మళ్ళీ లాయర్లుగా మారి ఈ యోధత్రయం తరపున వాదించింది కూడా ఇక్కడే.

1857లో సిపాయిల తిరుగుబాటు అనంతరం.. బ్రిటన్ ఈ కోటని కైవసం చేసుకుంది. నివాస రాజ భవనాలను నాశనం చేసింది. ఆ తర్వాత బ్రిటిష్ ఇండియన్ సైన్యానికి కేంద్ర స్థావరముగా మార్చేసింది. తిరుగుబాటు జరిగిన వెంటనే బహదూర్ షా జాఫర్ మీద ఎర్రకోటలో విచారణ జరిపించారు. 1945 నవంబరులో ఇండియన్ నేషనల్ ఆర్మీకి చెందిన ముగ్గురు అధికారులపై సైన్య విచారణ జరిగింది. ఆ తర్వాత 1947లో భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత.. మన సైన్యం ఈ కోటను కైవసం చేసుకుంది. డిసెంబరు 2003లో భారత సైన్యం.. ఈ కోటను భారత పర్యాటక అధికారులకి అప్పగించింది.

1947 ఆగస్టు, 15న భారత్ స్వతంత్ర దేశంగా మారింది. అదే సందర్భంలో నాటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధాన మంత్రి దేశీయ పతాకాన్ని ఎగురవేసి ఆ తర్వాత ఒక ప్రసంగం ఇచ్చే పద్ధతి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మనదేశం స్వేచ్ఛా వాయువులు పీల్చిన తరువాత ప్రధాని జాతినుద్దేశించి ప్రసగించింది ఇక్కడి నుంచే. ఇలా ఎన్నో సంఘటనలకు సాక్ష్యంగా నిలిచింది లాల్‌ ఖిల్లా.

READ  కరోనాతో చనిపోయిన వారిలో వైరస్ ఉంటుందా..తెలుసుకోవాల్సిన విషయాలు

ఢిల్లీ నగరం నడిబొడ్డున ఉన్న ఈ కోట ఒకప్పుడు మొఘల్‌ రాజవంశీయుల నివాస సముదాయం. 1639లో దేశ రాజధాని ఆగ్రా నుంచి ఢిల్లీకి మారిన తరువాత షాజహాన్‌ చక్రవర్తి ఎర్రకోటను నిర్మించారు. కోటగోడలు ఎర్రటి ఇసుకరాయితో నిర్మించడంతో ఎర్రకోట అనే పేరు ముద్రపడింది. మొఘల్‌ పాలనలో రాజకీయ కేంద్రంగా భాసిల్లిన ఈ కోట.. ఇప్పుడు మ్యూజియంలతో పర్యాటకులను కనువిందు చేస్తోంది. ఏటా ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రధాని ఎర్రకోటపై జాతీయ జెండా ఎగరవేస్తారు.

స్వాతంత్య్రం వచ్చిన తరువాత నెహ్రూ మొదటిసారి ఇక్కడే జాతీయ జెండా ఎగరేశారు. అప్పటి నుంచి అది సంప్రదాయంగా వస్తోంది. ఢిల్లీలో ప్రధాన పర్యాటక కేంద్రాల్లో ఇదొకటి. ఈ కోటను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. తాజ్‌మహల్‌ను డిజైన్‌ను చేసిన ఉస్తాద్‌ అహ్మద్‌ లాహౌరి ఈ కోటను డిజైన్‌ చేశారు. కోట లోపల ఉన్న నిర్మాణాలు ఇట్టే అట్రాక్ట్ చేస్తాయి. ముంతాజ్‌ మహల్‌లో ఇప్పుడు ఫోర్ట్‌ మ్యూజియంను ఏర్పాటు చేశారు.

నాదిర్‌షా దండయాత్ర చేసి ఈ కోటలో భద్రపరచి ఉన్న నెమలి సింహాసనాన్ని తీసుకెళ్లాడు. ఆ తరువాత ఈ కోట బ్రిటిష్‌ ఆధీనంలోకి వెళ్లింది. వాళ్లు కోహినూర్‌ డైమండ్‌తో పాటు షాజహాన్, బహదూర్‌షా-2లకు సంబంధించిన విలువైన వస్తువులను లండన్‌కు తరలించుకుపోయారు.

పంద్రాగస్టు రోజున జరిగే పరేడ్‌లో ఎర్రకోట ముందు విన్యాసాలు చేయాలని ఉవ్విళ్లూరని సైనికుడు ఉండడు. అశ్వాలపైకి ఎక్కి ఎర్రకోటకు వచ్చే అవకాశం తమకు దక్కినందుకు పులకించిపోయే వాళ్లెందరో. ఎప్పటికప్పుడు వినూత్న రీతిలో తన విశిష్టతను అక్కడ ప్రదర్శించాలని పోటీ పడని రాష్ట్రముండదు. త్రివిధ దళాల పాటవ ప్రదర్శనకు అచ్చెరువొందని ప్రేక్షకులుండరు. ఇలా ఏటా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అంబరాన్నంటే సంబరాలు జరుగుతాయి.

Related Posts