రామ మందిరంపై పాక్ విమర్శలు…ఘాటుగా బదులిచ్చిన భారత్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అయోధ్యలో రామాలయం నిర్మాణానికి బుధవారం(ఆగస్టు-5,2020) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారం భూమి పూజ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇదే సమయంలో అయోధ్యలో రామాలయం నిర్మాణాన్ని ఖండిస్తూ పాకిస్తాన్ విదేశీవ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం ఓ ప్రకటన చేసింది.

పాకిస్థాన్ విడుదల చేసిన ప్రకటనలో… రామాలయం నిర్మాణానికి బాటలు పరిచిన భారతదేశ సుప్రీంకోర్టు లోపభూయిష్ట తీర్పులో న్యాయం కన్నా మత విశ్వాసానికే పెద్ద పీట అని మాత్రమే కాకుండా నేటి భారత దేశంలో పెరుగుతున్న మెజారిటీ వాదం కనిపిస్తోంది, భారతదేశంలో మైనారిటీలు, మరీ ముఖ్యంగా ముస్లింలు, వారి ప్రార్థనా స్థలాలు అత్యధికంగా దాడికి గురవుతున్నాయని తెలిపింది.

కాగా , పాకిస్థాన్ చేసిన విమర్శలపై భారత ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. మతపరంగా రెచ్చగొట్టడం మానుకోవాలని, భారత దేశ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చవద్దని హెచ్చరించింది. భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిథి అనురాగ్ శ్రీవాస్తవ గురువారం మాట్లాడుతూ…. భారత దేశ అంతర్గత వ్యవహారంపై పాకిస్థాన్ ఇచ్చిన పత్రికా ప్రకటనను చూశామన్నారు. భారత దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మానుకోవాలని హెచ్చరించారు. అంతేకాకుండా మతపరంగా రెచ్చగొట్టకుండా సంయమనం పాటించాలని హితవు పలికారు.

క్రాస్ బోర్డర్ టెర్రరిజానికి పాల్పడుతున్న, తన సొంత మైనారిటీలకు మతపరమైన హక్కులను తిరస్కరిస్తున్న దేశం ఇటువంటి వైఖరిని ప్రదర్శించడంలో ఆశ్చర్యం లేదన్నారు. అయినప్పటికీ, ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అత్యంత శోచనీయమని చెప్పారు.

Related Posts