బంధువులతో జాగ్రత్త.. హైదరాబాద్‌లో డాక్టర్ కిడ్నాప్ కేసులో అసలు విలన్ బంధువే

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

hyderabad doctor kidnap: ఆయనది వైద్య వృత్తి.. ఎవరితో ఎలాంటి విభేదాలు లేవు. సొంత భవనంలో క్లినిక్ నడుపుతున్నాడు. సీన్ కట్ చేస్తే.. పట్టపగలే కొంతమంది దుండగులు క్లినిక్‌కి వచ్చి డాక్టర్‌ని కొట్టారు. అతని కారులోనే బలవంతంగా తీసుకెళ్లారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటనకు.. అనంతపురంలో ఫుల్‌స్టాప్ పెట్టారు పోలీసులు.. ఇంతకీ ఆ దుండగులు ఎవరు? డాక్టర్‌ని ఎందుకు కిడ్నాప్ చేశారు?

హైదరాబాద్‌లో కిడ్నాప్.. అనంతపురంలో పట్టుకున్న పోలీసులు.. సినీ ఫక్కీలో ఛేజింగ్.. కిడ్నాపర్లకు చెక్ పెట్టిన పోలీసులు.

డాక్టర్‌ను కిడ్నాప్ చేసిన దుండగులు:
హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ప్రెస్టిజ్‌ విల్లాస్‌లో బెహజత్‌ హుస్సేన్‌ నివసిస్తున్నారు. డెంటల్ డాక్టర్ గా పని చేస్తున్నారు. వైద్య వృత్తిలో ఆయన బండ్లగూడ జాగీర్‌లో ప్రధాన రహదారిపై ఉన్న సొంత భవనంలో క్లినిక్‌ ఏర్పాటు చేసుకున్నాడు. అతనిపై కన్నేసిన కొంతమంది దుండగులు సినీ ఫక్కీలో కిడ్నాప్ చేశారు. ఎవరితో విభేదాలు లేని డాక్టర్ హుస్సేన్.. కిడ్నాప్ కావడం కుటుంబసభ్యులను ఆందోళనకు గురిచేసింది. రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తును ముమ్మరం చేశారు.

బురఖాలో వచ్చి డాక్టర్ కిడ్నాప్:
కిడ్నాప్ సమయంలో హుస్సేన్‌తో పాటు సయ్యద్ అనే వ్యక్తి ఉన్నాడు. మంగళవారం(అక్టోబర్ 27,2020) మధ్యాహ్నం కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు బురఖా ధరించి క్లినిక్‌ లోపలికి వచ్చారు. సయ్యద్‌ను తీవ్రంగా కొట్టి అతన్ని ఓ గదిలో బంధించారు. అనంతరం హుస్సేన్‌ను కాళ్లు, చేతులు కట్టేసి అతని కారులోనే బలవంతంగా లాక్కెళ్లారు దుండుగులు. మార్గ మధ్యంలో వాహనాలు మారుస్తూ డాక్టర్‌ను చిత్రహింసలు పెట్టారు.

ఫోన్‌ నెంబర్ ఆధారంగా వెహికిల్‌ని ట్రేస్ చేసిన పోలీసులు:
సినిమాటిక్ లెవల్‌లో డాక్టర్‌ను కిడ్నాప్ చేసిన దుండగులు బెంగళూరు వైపు వెళ్లారు. ఫోన్‌ నెంబర్ ఆధారంగా వెహికిల్‌ని ట్రేస్ చేసిన సైబరాబాద్‌ పోలీసులు ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అలర్ట్ అయిన ఏపీ పోలీసులు అనంతపురంలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. డాక్టర్‌ను తీసుకెళ్తున్న కిడ్నాపర్ల వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. అయితే వాళ్లు ఆపకుండా అలాగే వెళ్లిపోయారు. దీంతో కొద్ది దూరంలోనే పోలీసులు రెండో చెక్‌ పోస్ట్‌ను ఏర్పాటు చేసి వాహనాన్ని ఆపే ప్రయత్నం చేశారు. అక్కడ కూడా వెహికిల్ ఆగకుండా వెళ్లింది.

కిడ్నాపర్లను పట్టుకునేందుకు స్థానికుల సాయం తీసుకున్న పోలీసులు:
రాప్తాడు సమీపంలో మూడో చెక్‌ పోస్టు దగ్గర పోలీసులు మాస్టర్ ప్లాన్ వేశారు. కిడ్నాపర్ల వాహనాన్ని ఆపేందుకు స్థానికుల సహాయం తీసుకున్నారు. కొంతమంది ప్రజలను తీసుకొచ్చి చెక్‌పోస్ట్‌కు అడ్డంగా నిలబెట్టడంతో కిడ్నాపర్లు ఎట్టకేలకు వాహనాన్ని ఆపేశారు. వెంటనే వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు.. డాక్టర్‌ను కిడ్నాపర్ల చెర నుంచి రక్షించారు. ఇద్దరు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకొని వారి నుంచి రివాల్వర్, కత్తి, మత్తు ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సైబరాబాద్ పోలీసులకు సమాచారమిచ్చారు.

అసలు నిందితుడు డాక్టర్ బంధువే:
తనను కిడ్నాప్‌ చేసి.. చిత్రహింసలకు గురి చేశారని వైద్యుడు హుస్సేన్ వాపోయాడు. తన కాళ్లు చేతులు కట్టేసి కదలకుండా చేశారని చెప్పాడు. డాక్టర్ హుస్సేన్ కిడ్నాప్‌ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. హుస్సేన్ బ్యాంకు అకౌంట్ లో పెద్ద మొత్తంలో నగదు ఉందని తెలుసుకున్న బంధువు ముస్తఫా ఈ కిడ్నాప్‌కు ప్లాన్‌ వేసినట్లు పోలీసులు నిర్ధారించారు. డాక్టర్‌పై నిఘా ఉంచేందుకు ఓ వ్యక్తిని అతని ఇంటిపైనే అద్దెకు దింపాడు ముస్తఫా. అతని సాయంతోనే వైద్యుడిని కిడ్నాప్ చేసి బిట్ కాయిన్ల రూపంలోనే రూ.10కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు ముస్తఫా.

అయితే సకాలంలో పోలీసులు స్పందించడంతో ముస్తఫా ఆటలు సాగలేదు. అడ్డంగా దొరికిపోయాడు. ఈ కేసులో మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో పుణెకి చెందిన సుమిత్ చంద్రకాంత్ బోస్లే(28), అక్షయ్ బాలు(24), విక్కీ దత్తా షిండే(20), చాంద్రాయణగుట్టకి చెందిన మహ్మద్ రహీమ్(18), కూకట్ పల్లికి చెందిన మహ్మద్ ఇమ్రాన్(21), మహ్మద్ ఇర్ఫాన్(25), ఉడిపికి చెందిన సంజయ్(19) ఉన్నారు.

కేవలం డబ్బు కోసమే మనుషుల జీవితాలతో ఆడుకుంటున్న ఇలాంటి దుర్మార్గులకు సరైన శిక్ష విధించాలని డాక్టర్ కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు.

Related Tags :

Related Posts :