RTC HIGH COURT

ఆర్టీసీ సమ్మె : హైకోర్టు ఏం చెబుతుంది

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె 28వ రోజుకు చేరింది. ఆర్టీసీ ఇన్‌చార్జ్ ఎండీ హాజరుతోపాటు పూర్తి వివరాలు అందించాలని హైకోర్టు ఆదేశించడంతో..ఈసారి లెక్కలను పక్కాగా సమర్పించేందుకు రెడీ అయ్యారు అధికారులు. ఇక రాష్ట్ర విభజన దగ్గర నుంచి ఆర్టీసీ పరిస్థితి, అప్పులు, ఆదాయం, నష్టాల చిట్టాను తమ తరపున హైకోర్టుకు అందజేసేందుకు నివేదిక సిద్ధం చేసారు జేఏసీ నేతలు ఈ పరిస్థితుల్లో హైకోర్టులో ఇవాళ్టి విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ సాగనుంది. ఆర్టీసీకి ప్రభుత్వం బకాయి ఉన్న మొత్తం, పాసుల రీయింబర్స్‌మెంట్ సొమ్ము, విభజన తర్వాత ఆర్టీసీకి ఇచ్చిన నిధుల వివరాలను కోర్టుకు అఫిడవిట్ రూపంలో అందజేయాలని అదేశించినా.. పూర్తి వివరాలు ఇవ్వకపోవడంతో ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది న్యాయస్థానం. దీంతో శుక్రవారం విచారణకు ఆర్టీసీ ఎండీతోపాటు లెక్కలన్నీ పక్కాగా ఉండేలా రిపోర్ట్ తయారుచేసే పనిలో బిజీగా ఉన్నారు ఉన్నతాధికారులు. నివేదికను ఇప్పటికే సిద్ధం చేసినా మరోసారి క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. 

కోర్టులో కీలక వాదనల నేపథ్యంలో.. ఇటు ఆర్టీసీ జేఏసీ నాయకులు సైతం విభజన దగ్గర నుంచి ఆర్టీసీకి ఇచ్చిన సొమ్ము, బస్ పాస్ రీయింబర్స్‌మెంట్, బకాయిలు, ఆర్టీసీ ఆస్తులు, ఆర్టీసీ ఆస్తుల అన్యాక్రాంతం, నష్టాలు, ఇతర లెక్కలన్నీ పక్కాగా ఇచ్చేందుకు వివరాలు సేకరిస్తున్నారు. అంతేకాకుండా ఆర్టీసీలో వివిధ పనుల కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవోల వివరాలు.. వాటి సారంశాన్ని కోర్టులో తమ తరపున వాదించబోయే లాయర్‌కు పూర్తి సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఆర్టీసీకి పలు సమయాల్లో సీఎం చేసిన వాగ్దానాలు, బడ్జెట్ సమయంలో అసెంబ్లీలో ప్రసంగాలు, బడ్జెట్ లో ఆర్టీసీకి కేటాయించిన లెక్కల వివరాలను ఇప్పటికే రిపోర్ట్ రూపంలో సిద్ధం చేశారు. 

ఇక సమ్మెలో భాగంగా ఇప్పటివరకు అనుసరించిన ఉద్యమ కార్యాచరణ, కోర్టు వాదనలు తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలు, భవిష్యత్ కార్యాచరణను రూపొందించేందుకు ఆర్టీసీ జేఏసీ నాయకులు, ఆల్‌ పార్టీ నేతలు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే పలు రూపాల్లో ఆందోళన చేసిన జేఏసీ నాయకులు, భవిష్యత్తులో మరింత గట్టిగా తమ నిరసన గళం వినిపించేందుకు సిద్ధవుతున్నారు.

Related Posts