సిక్కోలును టచ్ చేయొద్దంటోన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఆలూ లేదు చూలూ లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నాడట వెనుకటికి ఒకతను. ఏపీలో జిల్లాల పునర్విభజన తెరపైకి రావడంతో సిక్కోలులో కొత్త లొల్లి మొదలైంది. ఏ లెక్కన జిల్లాను వేరు చేస్తారనే చర్చ రచ్చ చేస్తోంది. ఏ జిల్లాను ఏం చేసినా డోంట్‌ కేర్‌.. శ్రీకాకుళంను మాత్రం టచ్ చేయొద్దని సాక్షాత్తు అధికార పార్టీ నేతలే అల్టిమేటమ్‌ విధిస్తున్నారు. అసమ్మతి రాగం కొండెక్కుతుండడంతో అధిష్టానం ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తుందనేదే ఆసక్తికరంగా మారింది.

జిల్లాల పునర్విభజన శ్రీకాకుళం రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. పార్లమెంట్ నియోజకర్గం ప్రాతిపదికన జిల్లాల విభజన జరుగుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో సిక్కోలు వెనుకబాటుతనం మరోసారి తెరపైకి వచ్చింది.

10 అసెంబ్లీ సెగ్మెంట్లు కలిగిన సిక్కోలులో ఏడు శ్రీకాకుళం.. రెండు విజయనగరం.. ఒకటి అరకు పార్లమెంట్ పరిధిలోనికి వస్తాయి. జిల్లాలో బాగా వెనుక బడిన పాతపట్నం, ఇచ్చాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట, ఆముదాల వలస, శ్రీకాకుళం అసెంబ్లీ సెగ్మెంట్లు శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలోకి రాగా, విద్య, వైద్య, ఆర్ధికంగా అంతో ఇంతో అభివృద్ధి చెందిన ఎచ్చెర్ల, రాజాం అసెంబ్లీ సెగ్మెంట్లు విజయనగరం పార్లమెంటు పరిధిలోకి వస్తాయి. ఏజెన్సీ ప్రాంతమైన పాలకొండ నియోజకవర్గం విశాఖ జిల్లా అరకు పార్లమెంటు పరిధిలోకి వస్తుంది.

రాజాం ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గం అయినప్పటికీ ప్రముఖ వ్యాపార దిగ్గజం జిఎంఆర్ అధినేత స్వస్థలం కావడంతో ఇతర నియోజకవర్గాలతో పోలిస్తే రాజాం నియోజకవర్గం విద్య,వైద్య,ఆరోగ్యం, పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. జిఎంఆర్ కేర్ హాస్పిటల్, జిఎంఆర్ ఇంజనీరింగ్ విద్యా సంస్థలు, జిఎంఆర్ సుగర్స్ తో పాటు పలు పరిశ్రమలకు కేంద్రంగా రాజాం ఉంది.

అటు రాజాం, ఇటు శ్రీకాకుంళం నియోజకవర్గాల మధ్యలో ఉన్న ఎచ్చెర్ల నియోజకవర్గం కూడా విద్య, పారిశ్రామికంగా మెరుగైన స్థానంలో ఉంది. శ్రీకాకుళం నగరంలో సగం భాగంతో పాటు ట్రిపుల్ ఐటి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం, పైడి భీమవరం ఫార్మా హాబ్ ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలోనికి రావడంతో విద్య, ఉపాధి పరంగా ఆ నియోజకవర్గానికి డోకా లేదు. ప్రతిపాదిత కొవ్వాడ అణువిద్యుత్ పరిశ్రమ ఈ నియోజకవర్గం పరిధిలోనే ఉండటంతో పాటు ప్రభుత్వం నూతనంగా నిర్మించబోయే భోగాపురం ఎయిర్ పోర్టుకు ఆనుకుని ఎచ్చెర్ల నియోజకవర్గం ఉండటంతో భవిష్యత్ లో కూడా ఈ ప్రాంతం అభివృద్ధికి ఢోకా ఉండకుండాపోయింది.

పరిపాలనా సౌలభ్యం కోసం జగన్ ప్రభుత్వం పార్లమెంటు నియోజకర్గాల ప్రాతిపదికన జిల్లాల పునర్విభజన జరిగితే శ్రీకాకుళం జిల్లాకు తీవ్ర నష్టం జరుగుతుందనే చర్చ మొదలైంది. దేశంలోనే వెనుకబడిన జిల్లాగా పేరొందిన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధివైపు వడివడిగా అడుగులు వేస్తున్న క్రమంలో ఎచ్చెర్ల, రాజాం నియోజకవర్గాలు విజయనగరం జిల్లాలో కలిపేస్తే శ్రీకాకుళం పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

READ  రాజధానిపై సస్పెన్స్ : రేపు మరోసారి సీఎంతో హైపవర్ కమిటీ భేటీ

అభివృద్ధి చెందిన రాజాం, ఎచ్చెర్ల అసెంబ్లీ సెగ్మెంట్లు విజయనగరానికి.. ఆదాయ వనరుగా ఉన్న పాలకొండ అసెంబ్లీ సెగ్మెంట్ అరకు పరిధిలోకి వెళ్తే.. శ్రీకాకుళానికి ఏం మిగులుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. కిడ్నీ రోగాలకు కేరాఫ్‌గా నిలిచిన ఉద్ధానం తప్ప శ్రీకాకుళం జిల్లాకు ఏమీ మిగలదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భౌగోళికంగా రాజాం, ఎచ్చెర్ల, పాలకొండ పట్టణాలు శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి అత్యంత సమీపంలో ఉండటంతో వారు ఇతర జిల్లాల్లో కలవడానికి స్థానికులకు ఇష్టం లేదట.

విజయనగరం జిల్లాలో తమను కలిపితే జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే ఎన్నో వ్యయ ప్రయాసలకు గురికావాల్సి వస్తుందని భయపడుతున్నారట. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటుతో జరగబోయే నష్టాలపై విపక్షాలు ఉద్యమానికి సిద్ధం అవుతున్నాయట.

విపక్షాల ఉద్యమానికి చెక్ పెట్టేందుకు అధికార పార్టీ నాయకులు ప్రణాళికలు సిద్ధం చేసారని తెలుస్తోంది. ముఖ్యంగా ఒకే పార్టీలో ఉన్నా ఎప్పుడూ ఎడముఖం పెడముఖంగా ఉండే ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాంలు ఈ విషయంలో ఒక్కటైనట్టు స్పష్టమవుతోంది. దివంగత సీఎం వైఎస్సార్ జయంతి వేదికగా ఉత్తరాంధ్ర ఇన్ చార్జి విజయసాయిరెడ్డి సమక్షంలో కొత్త జిల్లాల ప్రతిపాదనతో జరగబోయే నష్టాన్ని వివరించే ప్రయత్నం చేశారు.

పార్లమెంటు నియోజకవర్గం ప్రాతిపదికన జిల్లాలను విభజిస్తే శ్రీకాకుళం జిల్లా తీవ్రంగా నష్టపోవడంతో పాటు మరోసారి వెనుకబాటు ఉద్యమానికి దారి తీస్తుందని హెచ్చరించారు ధర్మాన. అంతేకాదు ఇది విపక్షాలకు అనుకూలంగా మారుతుందని కూడా కుండబద్దలు కొట్టారు. ధర్మాన వాదనలకు తమ్మినేని మద్దతు పలికారు. ఈ విషయంలో విజయసాయిరెడ్డి సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ప్రజలు, నేతల అభిప్రాయాలను అధినేత దృష్టి తీసుకెళ్తానన హామీ కూడా ఇచ్చారట.

సిక్కోలువాసులకి వ్యతిరేకంగా సీఎం జగన్ నిర్ణయం తీసుకోరని.. ఒకవేళ తీసుకున్నా తీవ్రస్థాయిలో ఉద్యమించాలని డిసైడ్ అయ్యారట ద్వితీయ శ్రేణి నాయకులు. మరి ప్రభుత్వం సిక్కోలుకి ఎలాంటి దారి చూపిస్తుందా..? ఏ రకంగా ముందుకెళ్తుందన్నది చూడాలి.

Related Posts