ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్యా, ఆగస్టు 12న కరోనా వ్యాక్సిన్ విడుదల

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

యావత్ ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు వణికిపోతున్న వేళ, ప్రజలు ప్రాణాలు మాస్కులో పెట్టుకుని జీవిస్తున్న వేళ రష్యా గుడ్ న్యూస్ చెప్పింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కరోనా వ్యాక్సిన్‌ రేసులో రష్యా ముందడుగు వేసింది. కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను రిజిస్టర్‌ చేయించుకున్న తొలి దేశంగా నిలిచేందుకు రంగం సిద్ధం చేసింది. కొవిడ్‌కు తాము అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను ఆగస్టు 12న ప్రపంచానికి పరిచయం చేయనున్నామని రష్యా రక్షణ శాఖ కీలక ప్రకటన చేసింది. రష్యా రక్షణశాఖ, గమలేయ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను ఆగస్టు 12న రిజిస్టర్ చేయనున్నారు. ఈ విషయం స్వయంగా రష్యా ఉప ఆరోగ్యశాఖ మంత్రి(డిప్యూటీ హెల్త్ మినిస్టర్) ఒలెగ్‌ గ్రిడ్నెవ్‌ ప్రకటించారు.

రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తికాగానే.. తొలుత దాదాపు 1,600 మందికి (వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, వయో వృద్ధులకు) వ్యాక్సిన్‌ను అందిస్తామని తెలిపారు. దాని ప్రభావంతో వారి ఆరోగ్యాల్లో చోటుచేసుకునే మార్పులు ప్రాతిపదికగా తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని గ్రిడ్నెవ్‌ స్పష్టం చేశారు. వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట పడటం, కేసులు తగ్గుముఖం పట్టడమే.. ఈ వ్యాక్సిన్‌ పనితీరుకు నిదర్శనంగా పరిగణిస్తామన్నారు. ప్రస్తుతం చిట్టచివరిదైన మూడో దశ ప్రయోగ పరీక్షల తుది అంకం నడుస్తోందని, అది తప్పకుండా సఫలమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా, ఈ వ్యాక్సిన్‌తో 76 మంది వలంటీర్లపై జూన్‌ 17న ప్రయోగ పరీక్షలు ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ ను తిప్పికొట్టేలా వారందరిలోనూ రోగ నిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేయడంలో వ్యాక్సిన్‌ సఫలమైంది. అయితే వ్యాక్సిన్‌ను త్వరగా విడుదల చేయాలనే తొందరలో రష్యా షార్ట్‌కట్‌లను అనుసరించి ఉండొచ్చని.. అలా చేస్తే వ్యాక్సిన్‌ సురక్షితంగా ఉండదని, పనితీరు కూడా ప్రభావవంతంగా ఉండకపోవచ్చని అమెరికాలోని జార్జ్‌టౌన్‌ వర్సిటీ ఆరోగ్యరంగ నిపుణులు లారెన్స్‌ గోస్టిన్‌ విశ్లేషించారు.

వ్యాక్సిన్ తీసుకున్న వారిలో రోగనిరోధక శక్తి బలోపేతం అయిన తర్వాత టీకా ప్రభావం వెల్లడవుతుందని మంత్రి గ్రిడ్నెవ్ తెలిపారు. రష్యా గమలేయా నేషనల్ రిసెర్చ్ సెంటర్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్‌ క్లినికల్ ట్రయల్స్‌‌లో పాల్గొన్న వాలంటీర్లలో వ్యాధినిరోధక శక్తిని చూపించిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, వ్యాక్సిన్‌ను భారీ ఎత్తున ఉత్పత్తి చేసే పనులను సెప్టెంబర్ లో ప్రారంభించనున్నామని రష్యా పరిశ్రమల శాఖ మంత్రి డెనిస్ మన్తురోవ్ తెలిపారు. ఇప్పటివరకు రష్యాలో 8లక్షల 82వేల 347 మంది వైరస్ బారినపడగా.. 14వేల 854 మంది ప్రాణాలు కోల్పోయారు.

READ  కరోనా వైరస్ భయంతో కరోనాపై చర్చించే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ క్యాన్సిల్

‘గమలేయా సంస్థ రూపొందించిన వ్యాక్సిన్‌ను ఆగస్టు 12న రిజిస్టర్‌ చేస్తాం. ప్రస్తుతం చివరి, మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయి. వ్యాక్సిన్‌ ఎంత భద్రమన్నది నిర్ణయించేందుకు ఈ ప్రక్రియ చాలా ముఖ్యం. మొదట వైద్య నిపుణులు, వృద్ధులకు టీకా ఇవ్వనున్నాం’ అని ఒలెగ్‌ గ్రిడ్‌నేవ్‌ అన్నారు. జూన్ 17న 76 మంది వాలంటీర్లపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించగా.. వీరిలో సగం మందికి ఇంజక్షన్ రూపంలో, మిగతావారికి పౌడర్ రూపంలో వ్యాక్సిన్ ఇచ్చామని అధికారులు తెలిపారు. రెండు రకాల పరీక్షల్లోనూ వ్యాక్సిన్ సత్ఫలితాలను ఇచ్చిందని, అందరిలోనూ వ్యాధి నిరోధక శక్తి పెరిగిందని, ఎవరిలోనూ దుష్ప్రభావం చూపలేదని ‘స్పుత్నిక్’ న్యూస్ వెల్లడించింది.

రష్యా కరోనా వ్యాక్సిన్ ప్రకటనపై అమెరికా భిన్నంగా స్పందించింది. వ్యాక్సిన్‌ను అన్ని రకాలుగా పరీక్షించి, ఫలితాలను నిర్దారించుకున్న తరువాతనే రష్యా ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని భావిస్తున్నామని యూఎస్ అంటువ్యాధుల విభాగం నిపుణుడు ఆంటోనీ ఫౌచీ అన్నారు. వ్యాక్సిన్ సిద్ధమైనట్టు ప్రకటించిన రష్యా, దాన్ని పంపిణీ చేసే ముందు ఎటువంటి సమస్యలూ తలెత్తకుండా మరోసారి పునరాలోచించుకోవాలని ఆయన సలహా ఇచ్చారు.

Related Posts