కాంగ్రెస్ కు షాక్ : బీజేపీతో సచిన్ పైలట్ చర్చలు…19MLAల మద్దతు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

pilotరాజస్థాన్‌లో అరకొర మెజారిటీతో అధికారాన్ని అందుకున్న కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు హైపిచ్‌కు చేరుకున్నాయి. పార్టీలో తిరుగుబాటు లేవనెత్తారు ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను కుర్చీ నుంచి కిందికి దించే దిశగా పావులు కదుపుతున్నారు. తనకు మద్దతు ఇస్తోన్న ఎమ్మెల్యేలతో ఆయన ప్రస్తుతం దేశ రాజధానిలో మకాం వేశారు. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం తనను పట్టించుకోవడం లేదని, తనను పక్కన పెడుతున్నారని సచిన్ పైలట్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నారు. పార్టీ హైకమాండ్ జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని ఆయన కోరనున్నారు. శనివారం పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ని కలిసినపైలట్.. .. తమ రాష్ట్రంలోని తాజా పరిణామాలను ఆయనకువివరించారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కూడా సచిన్ పైలట్ కలుసుకుంటారని తెలుస్తోంది.

మరోవైపు, సచిన్ పైలట్ ఇప్పుడు బీజేపీతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. తనకు 16మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు,3స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు ఉందని సచిన్.. బీజేపీకి చెప్పినట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ ముందు నుంచే సచిన్.. బీజేపీ మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, సచిన్ పైలట్ పార్టీలోకి వస్తే అయన ఆశించినట్లుగా ముఖ్యమంత్రి పదవిని ఇవ్వడానికి బీజేపీ సిద్ధంగా లేదని సమాచారం. సచిన్ పైలట్ సొంతంగా ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేయవచ్ఛునని కూడా ఊహాగానాలు వస్తున్నాయి.

అశోక్ గెహ్లట్ ప్రభుత్వాన్ని కూల్చి వేయడానికి కుట్ర పన్నారనే  ఆరోపణలపై .. తనకు ‘స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ‘ సమన్లు జారీ చేయడం పట్ల సచిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన సన్నిహితులు కూడా.. ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షునికి లేదా ఉప ముఖ్యమంత్రికి ఇలా సమన్లు పంపడం ఎన్నడూ జరగలేదని మండిపడుతున్నారు. ఈ విషయంలో పార్టీ హైకమాండ్ ఎందుకు జోక్యం చేసుకోవడంలేదని వారు ప్రశ్నిస్తున్నారు.

సచిన్ పైలట్‌ను ప్రశ్నించడానికి ఆదేశాలు జారీ చేసినందుకు అశోక్ గెహ్లాట్‌ పట్ల కాంగ్రెస్ హైకమాండ్ కూడా అప్ సెట్ గా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే రాజస్తాన్ చీఫ్ విప్ మహేష్ జోషీ, తనకు కూడా సమన్లు పంపారని, వారికి తాను కూడా సహకరిస్తానని సీఎం అశోక్ గెహ్లాట్ తెలిపారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని ఆయన పేర్కొన్నారు.

దాదాపు మూడు నెలల క్రితమే మధ్యప్రదేశ్ లో పవర్ ఫుల్ నేత జ్యోతిరాదిత్య సింధియా తనకు విధేయులైన 23 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీలో వాలి.. బీజేపీ తీర్థం పుచ్చుకోవడం , కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయి.. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం తెలిసిందే. ఇప్పుడు ఇంచుమించు అదే పరిస్థితి రాజస్థాన్ లోనూ కనిపిస్తోంది. సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య విభేదాలు ఈ నాటివి కావు. గత లోక్ సభ ఎన్నికల్లో తన కుమారుడి ఓటమికి పైలటే కారకుడని గెహ్లాట్ ఆరోపించడం, దాన్ని పైలట్ ఖండించడం తెలిసిందే.

READ  బీజేపీలో చేరిన సన్నీ డియోల్

శనివారం రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితిపై చర్చించేందుకు అశోక్ గెహ్లాట్ నిర్వహించిన సమావేశానికి పైలట్ గైర్ హాజరయ్యారు. కాగా..మధ్యప్రదేశ్ లో మాదిరి తమ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడంద్వారా బీజేపీ తన ప్రభుత్వాన్ని పడగొట్టి.. అధికారాన్ని కైవసం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందని అశోక్ గెహ్లాట్ ఆరోపిస్తున్నారు. ఒక్కో ఎమ్మెల్యేకి ఆ పార్టీ 15 కోట్లు ఇవ్వజూపుతోందని, ఇతర తాయిలాలను కూడా ఎర వేస్తోందని ఆయన అంటున్నారు. అయితే బీజేపీ యత్నాలను సాగనివ్వబోమన్నారు. తమ ఎమ్మెల్యేలను ఎలా రక్షించుకోవాలో తమకు తెలుసునన్నారు. సచిన్ పైలట్ వర్గం  బీజేపీతో టచ్ లో ఉందని గెహ్లాట్ సన్నిహితులు ఆరోపిస్తున్నారు

200 సీట్లున్న రాజస్తాన్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులు 107 మంది ఉన్నారు. 12 మంది స్వతంత్ర సభ్యులతో బాటు.. రాష్ట్రీయ లోక్ దళ్, సీపీఎం, భారతీయ ట్రైబల్ పార్టీ లకు చెందిన 5గురు ఎమ్మెల్యేలు కూడా గెహ్లాట్ కు మద్దతు ఇస్తున్నాయి. అయితే సచిన్ పైలట్ రూపంలో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం సంకట పరిస్థితిని ఎదుర్కొంటోంది.

Related Posts